Video: పాకిస్తాన్‌పై దాడి చేస్తున్న మొదటి వీడియోను అధికారికంగా విడుదల చేసిన ఇండియన్‌ ఆర్మీ!

పాకిస్తాన్ దళాలు సరిహద్దు వెంబడి కాల్పులు జరుపుతుండటంతో భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ప్రతిస్పందనగా భారత సైన్యం పాకిస్తాన్ సైనిక స్థావరాలను ధ్వంసం చేసింది. పాకిస్తాన్ డ్రోన్ దాడులను భారత్ విజయవంతంగా ఎదుర్కొంది. ఇండియన్ ఆర్మీ లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి పాకిస్తాన్ సైనిక స్థావరాన్ని ధ్వంసం చేస్తున్న వీడియోను విడుదల చేసింది.

Video: పాకిస్తాన్‌పై దాడి చేస్తున్న మొదటి వీడియోను అధికారికంగా విడుదల చేసిన ఇండియన్‌ ఆర్మీ!
Indian Army Attack Footage

Updated on: May 09, 2025 | 9:30 AM

భారత్‌, పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరిన నేపథ్యంలో పాక్‌ దళాలు సరిహద్దు వెంబడి కాల్పులకు పాల్పడుతున్నాయి. ప్రతిదాడిగా భారత దళాలు నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి అనేక పాకిస్తాన్ సైనిక పోస్టులను ధ్వంసం చేసింది. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK) లోని ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు చేసిన తర్వాత, పాకిస్తాన్‌ క్షిపణి, డ్రోన్‌లతో భారత్‌పై దాడికి దిగింది. వాటిని భారత్‌ సమర్థవంతంగా ఎదుర్కొంది. కనీసం 50 పాకిస్తాన్ డ్రోన్‌లను కూల్చివేసినట్లు అధికారులు తెలిపారు.

అయితే తాజాగా లైన్‌ ఆఫ్‌ కంట్రోల్‌ వెంబడి పాకిస్తాన్ సైనిక పోస్టును ధ్వంసం చేస్తున్న మొట్టమొదటి అధికారిక వీడియోను ఇండియన్‌ ఆర్మీ షేర్ చేసింది. సైనిక పోస్టులను దాడి చేయడానికి యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణులను ఉపయోగించినట్లు సమాచారం. ఈ వీడియో ఏ సెక్టార్‌కు చెందినదో తెలియదు, కానీ భారత సైన్యం నిరంతర కాల్పుల విరమణ ఉల్లంఘనలకు సమర్థవంతమైన సమాధానంగా ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది. “పాకిస్తాన్ సాయుధ దళాలు 2025 మే 8, 9 తేదీల మధ్య రాత్రి పశ్చిమ సరిహద్దు వెంబడి డ్రోన్లు, ఇతర మందుగుండు సామగ్రిని ఉపయోగించి అనేక దాడులను ప్రారంభించాయి. జమ్మూ కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి పాక్ దళాలు అనేక కాల్పుల విరమణ ఉల్లంఘనలను కూడా ఆశ్రయించాయి” అని సైన్యం తెలిపింది.

డ్రోన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టామని, సైన్యం కాల్పుల విరమణ ఉల్లంఘనలకు “తగిన సమాధానం” ఇచ్చిందని పేర్కొంది. “భారత సైన్యం దేశ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడటానికి కట్టుబడి ఉంది. అన్ని దుర్మార్గపు కుట్రలకు బలవంతంగా ప్రతిస్పందిస్తాం” ఇండియన్‌ ఆర్మీ వెల్లడించింది. అంతకుముందు జమ్మూ, పఠాన్‌కోట్, ఉధంపూర్‌లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు వచ్చాయని వాటిని కూడా అడ్డుకున్నామంటూ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా జమ్మూ కశ్మీర్‌లోని సాంబా జిల్లాలో సరిహద్దు దాటి చొరబాటు ప్రయత్నాన్ని BSF భగ్నం చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..