గల్ఫ్ దేశాలతో భారత్ భారీ స్కెచ్.. ఒమన్‌తో బిగ్ ట్రేడ్ డీల్.. ఇకపై..

గల్ఫ్ ప్రాంతంతో ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి భారత్ ఒమన్‌తో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై సంతకం చేయనుంది. ఒమన్‌కు 20 ఏళ్లలో ఇది మొదటి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం. ఈ ఒప్పందం ద్వారా భారతీయ వస్తువులకు ఒమన్ మార్కెట్‌లో పన్ను రాయితీలు లభించడంతో పాటు ఎగుమతులు పెరుగుతాయి.

గల్ఫ్ దేశాలతో భారత్ భారీ స్కెచ్.. ఒమన్‌తో బిగ్ ట్రేడ్ డీల్.. ఇకపై..
India Oman Cepa

Updated on: Dec 18, 2025 | 3:42 PM

గల్ఫ్ దేశాలతో తన ఆర్థిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఒమన్‌తో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA)పై సంతకం చేసేందుకు
భారత్ సిద్ధమైంది. ఒమన్ ఒక దేశంతో కుదుర్చుకుంటున్న రెండో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం మాత్రమే కాకుండా, గత 20 ఏళ్లలో వారు చేస్తున్న మొట్టమొదటి ఒప్పందం కావడం గమనార్హం. ఈ ఒప్పందంతో రెండు దేశాల మధ్య వ్యాపార లావాదేవీలు మరింత సులభతరం కానున్నాయి. విశేషం ఏమిటంటే.. ఒమన్ దేశం గత 20 ఏళ్లలో ఇలాంటి ఒక పెద్ద ఒప్పందాన్ని చేసుకోవడం ఇదే మొదటిసారి. ఈ ఒప్పందం ద్వారా భారతీయ వస్తువులు ఒమన్ మార్కెట్‌లోకి ఎటువంటి అదనపు పన్నులు లేకుండా లేదా తక్కువ పన్నులతో వెళ్లే అవకాశం ఉంటుంది. దీనివల్ల మన దేశంలోని రైతులు, వ్యాపారులు, ఎగుమతిదారులకు భారీ లాభాలు చేకూరుతాయి. అలాగే పెట్టుబడులు పెరగడం వల్ల కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు మారుతున్న వేళ వస్తువుల సరఫరా ఆగిపోకుండా ఉండేందుకు ఈ స్నేహపూర్వక ఒప్పందం ఎంతో కీలకం.

వరుస ఒప్పందాలతో భారత్ జోరు

గడిచిన నాలుగేళ్లలో భారత్ అనేక దేశాలతో ఇటువంటి వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంది. అవి మన ఆర్థిక వ్యవస్థకు ఎలా తోడ్పడుతున్నాయంటే:

బ్రిటన్ (2025): 90 శాతం వస్తువులపై పన్నులు తగ్గడం వల్ల మన వ్యాపారం విస్తరించింది.

స్విట్జర్లాండ్, నార్వే (2024): ఈ దేశాల నుంచి భారత్‌కు భారీగా పెట్టుబడులు వస్తున్నాయి.

ఆస్ట్రేలియా (2022): మన ఎగుమతులకు కొత్త మార్కెట్లు లభించాయి.

UAE (2022): బంగారం, నగలు, బట్టలు మరియు ఇంజనీరింగ్ వస్తువుల వ్యాపారం బాగా పెరిగింది.

మారిషస్ (2021): ఆఫ్రికా దేశాలకు మన వస్తువులను పంపడానికి ఇది ఒక వారధిగా మారింది.

మోదీ ఏమన్నారంటే..?

ఇరు దేశాల మధ్య కుదురుతున్న సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం 21వ శతాబ్దపు భాగస్వామ్యానికి కొత్త దిశానిర్దేశం చేస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ఈ చారిత్రాత్మక నిర్ణయం రాబోయే దశాబ్దాల పాటు ఇరు దేశాల ఆర్థిక గమనాన్ని మారుస్తుందని ఆయన ఆకాంక్షించారు. భారత్ త్వరలోనే ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోందని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. భారత్ అభివృద్ధి చెందితే అది తన స్నేహపూర్వక దేశాల అభివృద్ధికి కూడా దోహదపడుతుందని, ముఖ్యంగా సముద్ర పొరుగు దేశమైన ఒమన్‌కు ఇది మరింత ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు. భారత్ ఎప్పుడూ స్వావలంబన, ప్రగతిశీల ఆలోచనలతో ముందుకు సాగుతుందని ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

మొత్తంమీద, భారత్ ప్రపంచ దేశాలతో తన స్నేహాన్ని పెంచుకుంటూనే, ఆర్థికంగా ఎదగడానికి ఈ ఒప్పందాలను వాడుకుంటోంది. ఒమన్‌తో కుదుర్చుకుంటున్న ఈ కొత్త ఒప్పందం గల్ఫ్ దేశాల్లో మన పట్టును మరింత పెంచుతుందని నిపుణులు భావిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి