New Delhi: భారత్‌ నుంచి మరో పాక్ అధికారి బహిష్కరణ.. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశం!

బుధవారం, న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ నుండి మరో అధికారిని భారతదేశం బహిష్కరించింది. అతను భారతదేశంలో ఉంటూ తన అధికారిక హోదాకు అనుగుణంగా లేని కార్యకలాపాలకు పాల్పడినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ మేరకు అతన్ని భారత్‌లో ఉండేందుకు అర్హత లేని వ్యక్తిగా ప్రకటించింది. 24 గంటల్లోగా భారతదేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది.

New Delhi: భారత్‌ నుంచి మరో పాక్ అధికారి బహిష్కరణ.. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశం!
Delhi

Updated on: May 21, 2025 | 10:11 PM

భారతదేశంలో ఉంటూ తన అధికారిక హోదాకు అనుగుణంగా లేని కార్యకలాపాలకు పాల్పడినందుకు మరో పాక్‌ అధికారిని భారత్‌ బహిష్కరించింది. న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌లో పనిచేస్తున్న ఒక పాకిస్తాన్ అధికారిని భారత ప్రభుత్వం పర్సనాలిటీ నాన్ గ్రాటాగా ప్రకటించింది. ఆ అధికారిని 24 గంటల్లోగా భారతదేశం విడిచి వెళ్లాలని కోరింది” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ఒక ప్రకటనలో తెలిపింది. (దౌత్య పరిభాషలో ‘పర్సొనా నాన్ గ్రాటా’ అంటే, ఒక విదేశీ అధికారి లేదా దౌత్యవేత్తను అతను ఆతిథ్యం పొందుతున్న దేశంలో ఇకపై ఉండటానికి అనర్హుడని అర్థం, అయితే వారు ఇలాంటి కార్యకాలాపాలకు పాల్పడినప్పుడు కారణం చెప్పకుండానే వారిని దేశం విడిచి వెళ్లాలని ఆతిథ్య దేశం ఆదేశించవచ్చు.)

ఈ విషయాన్ని పాకిస్తాన్ హైకమిషన్ ఛార్జ్ డి’అఫైర్స్‌కు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. భారత్‌లో ఉన్న పాకిస్థానీ దౌత్యవేత్తలు లేదా అధికారులు ఎవరైనా సరే ఇకపై తమ హోదాను, ప్రత్యేక అధికారాలను దుర్వినియోగం చేయకుండా చూసుకోవాలని స్పష్టం చేసింది. అయితే భారత్‌లోని పాక్‌ అధికారి తన పరిధిని దాటి కార్యకలాపాలకు పాల్పడటం ఇది రెండో సారి. ఇంతకు ముందు ఇదే నెల 13న ఇదే పాకిస్థాన్ హైకమిషన్‌లో పనిచేస్తున్న ఓ అధికారిని భారత్‌ బహిష్కరించింది. కానీ అతని పేరు లేదా చర్యల వివరాలను ప్రభుత్వం వెల్లడించలేదు.

ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించిన దానికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్‌ సిందూర్‌ను చేపట్టి
పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK)లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసింది.ఈ ఆపరేషన్ తర్వాత భారత్‌- పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తితలు తారా స్థాయికి చేరాయి. దీంతో రెండు దేశాలు పరస్పర దాడులు చేసుకున్నాయి. ఆ తర్వాత జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. ఇది జరిగిన కొద్ది రోజుల వ్యవధిలోనే పాకిస్తాన్‌ హైకమిషన్‌లోని ఓ అధికారి ఈ కార్యకలాపాలకు పాల్పడడం జరిగింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..