
ఇండియన్ ఆర్మీతో పాటు నేవీకి సేవలందించేందుకు తేలికపాటి హెలికాఫ్టర్ అయిన 156 ప్రచండ్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి కోనుగోలు చేయాలని ఇప్పటికే నిర్ణయించింది. అందుకోసం లేటెస్ట్‌గా HALతో 62వేల కోట్ల రూపాయల డీల్ కుదుర్చుకుంది. ఇప్పటివరకు HALకి ఇదే అతిపెద్ద ఆర్డర్ కావడంతో… హెలికాఫ్టర్ల తయారీని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు, తుంకుర్ ప్లాంట్లలో ఈ ప్రచండ్ హెలికాఫ్టర్లు తయారుకానున్నాయి.
వాస్తవానికి ప్రచండ్ హెలికాఫ్టర్ చాలా తేలికగా ఉంటుంది. ఇది శత్రువుల కార్యకలాపాలపై నిఘా ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఇండియన్ ఆర్మీకి 90, నేవీకి కోసం 60 ప్రచండ్ హెలికాఫ్టర్లకు ఆర్డర్ ఇచ్చింది కేంద్రం. ఈ హెలికాఫ్టర్‌లో ఇద్దరు కూర్చునే సామర్థ్యం ఉంటుంది. ప్రచండ్ పొడవు 51.10 అడుగులు, ఎత్తు 15.5 అడుగులు ఉంటుంది. హెలికాఫ్టర్ బరువు 5800 కిలోలు ఉంటుంది. గంటకు 268 కి.మీ వేగంతో ప్రయాణించగలదీ ప్రచండ్. దీనికి ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే… ఏకంగా మూడున్నర గంటలపాటు నిరంతరంగా ఎగరగలుగుతుంది. ఇక ఆయుధాల పరంగా చూస్తే ఈ హెలికాప్టర్‌లో 20 mm M621 ఫిరంగి లేదా నెక్స్టర్ THL-20 టరెట్ గన్‌ని అమర్చవచ్చు. రాకెట్లు, క్షిపణులు, బాంబులను కూడా నాలుగు హార్డ్ పాయింట్లలో అమర్చుకోవచ్చు. ఈ హెలికాప్టర్‌లో ఉన్న అత్యాధునిక ఏవియానిక్స్ వ్యవస్థతో శత్రువులను గుర్తించడం చాలా సులభం. ఇక వీటిని చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో కార్యకలాపాల కోసం వినియోగించనున్నారు.
మొత్తంగా భారత్ మారుతోంది. ఎన్నో దిగుమతుల నుంచి… ఇప్పుడు అన్నీ ఉత్పత్తులే అనే స్థాయికి భారత్ చేరింది. మేకిన్ ఇండియా నినాదం క్రమంగా ప్రతిఫలాలను ఇస్తోంది. అందులోభాగంగానే పూర్తి స్వదేశీ టెక్నాలజీతో 156 ప్రచండ్ హెలికార్టర్ల తయారీ కోసం హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌తో డీల్ కుదుర్చుకుంది కేంద్రం.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..