AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సరిహద్దులో శాంతి.. వాణిజ్యంలో దోస్తీ! మోదీ – జిన్‌పింగ్ భేటీతో కుదిరిన కీలక డీల్..!

న్యూఢిల్లీలో జరిగిన BRICS సదస్సులో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కీలక భేటీ నిర్వహించారు. సరిహద్దు శాంతి, స్థిరత్వం, వాణిజ్య అసమతుల్యత, భవిష్యత్ సహకారంపై విస్తృతంగా చర్చించారు. సరిహద్దు సమస్యలు వివాదాలుగా మారకుండా, పరస్పర గౌరవంతో సంబంధాలను ముందుకు తీసుకెళ్లాలని మోదీ స్పష్టం చేశారు. వాణిజ్య లోటును తగ్గించి, ఇరు దేశాల మధ్య సహకారాన్ని పెంచుకోవాలని ఇద్దరు నేతలు అంగీకరించారు.

సరిహద్దులో శాంతి.. వాణిజ్యంలో దోస్తీ! మోదీ - జిన్‌పింగ్ భేటీతో కుదిరిన కీలక డీల్..!
Pm Modi Xi Jingping Discuss
Balaraju Goud
|

Updated on: Sep 12, 2026 | 9:04 PM

Share

న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా భారత్‌–చైనా సంబంధాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ శనివారం (సెప్టెంబర్ 12) ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. సుమారు 50 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో ఇరు దేశాల మధ్య సరిహద్దు సమస్య, శాంతి-స్థిరత్వం, వాణిజ్యం, సరఫరా గొలుసులు, మార్కెట్‌ ప్రాప్యతతో పాటు ద్వైపాక్షిక సంబంధాల భవిష్యత్‌పై విస్తృతంగా చర్చించినట్లు తెలుస్తోంది.

సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, స్థిరత్వం కొనసాగడం భారత్‌–చైనా సంబంధాల పురోగతికి అత్యంత కీలకమని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భేదాభిప్రాయాలు వివాదాలుగా మారకూడదని పేర్కొన్న ఆయన.. పరస్పర గౌరవం, పరస్పర సున్నితత్వం, పరస్పర ప్రయోజనం అనే మూడు అంశాలు ద్వైపాక్షిక సంబంధాలకు మార్గదర్శక సూత్రాలుగా ఉండాలని అన్నారు. ముఖ్యంగా వాస్తవ నియంత్రణ రేఖ (LAC) వెంబడి శాంతి, ప్రశాంతతను కొనసాగించడం అత్యంత అవసరమని మోదీ పేర్కొన్నారు. ఇప్పటికే కుదిరిన సరిహద్దు ఒప్పందాలు, అవగాహనలకు ఇరు దేశాలు కట్టుబడి ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. సరిహద్దు సమస్యకు న్యాయమైన, సహేతుకమైన, ఇరు దేశాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం దిశగా ముందుకు సాగేందుకు భారత్‌–చైనా తమ నిబద్ధతను ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు.

వాణిజ్య అసమతుల్యతపై చర్చ

మోదీ–జిన్‌పింగ్‌ భేటీలో ఆర్థిక, వాణిజ్య అంశాలకు కూడా ప్రాధాన్యం లభించింది. ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని మరింత విస్తరించడంతో పాటు వాణిజ్య అసమతుల్యతను తగ్గించడం, సరఫరా గొలుసులను బలోపేతం చేయడం, విశ్వసనీయమైన మార్కెట్‌ ప్రాప్యతను మెరుగుపరచడం వంటి అంశాలపై చర్చించారు.

భారత్‌కు చైనాతో భారీ వాణిజ్య లోటు ఉండటం చాలా కాలంగా ప్రధాన ఆందోళనగా ఉంది. చైనా మార్కెట్‌లో భారతీయ ఉత్పత్తులకు మరింత ప్రాప్యత కల్పించడం, కీలక రంగాల్లో సరఫరా గొలుసులు స్థిరంగా ఉండేలా చూడటం వంటి అంశాలు భారత్‌కు ముఖ్యమైనవి. ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడితే వాణిజ్యం, పెట్టుబడులు, తయారీ, టెక్నాలజీ, ఫార్మా, ఎలక్ట్రానిక్స్‌ వంటి రంగాల్లో సహకారానికి అవకాశాలు పెరగవచ్చని భావిస్తున్నారు.

‘భారత్‌–చైనా కలిసి ముందుకు సాగాలి’

భారత్‌, చైనా రెండూ ప్రపంచంలోనే శక్తిమంతమైన దేశాలని షి జిన్‌పింగ్‌ పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని వేగంగా అభివృద్ధి సాధించేందుకు ఇరు దేశాలు కలిసి పనిచేయాలని సూచించారు. ఒకరి సామర్థ్యాల నుంచి మరొకరు నేర్చుకుంటూ పరస్పర సహకారంతో ముందుకు సాగవచ్చని జిన్‌పింగ్‌ అన్నారు.

చైనాతో నిర్మాణాత్మక చర్చలకు భారత్‌ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక, దీర్ఘకాలిక దృక్పథంతో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాన్ని ఇరు దేశాల నేతలు గుర్తించారు. ప్రజల మధ్య సంబంధాలు, సాంస్కృతిక మార్పిడులు, వ్యాపార సంబంధాలను మరింత పెంచుకోవాలని నిర్ణయించారు.

గల్వాన్‌ తర్వాత కీలక భేటీ

2020లో గల్వాన్‌ ఘర్షణల తర్వాత భారత్‌–చైనా సంబంధాల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. LAC వద్ద సైనిక మోహరింపులు, సరిహద్దు వివాదం కారణంగా ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే ఇటీవలి కాలంలో ఇరు దేశాల మధ్య దౌత్య, సైనిక స్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మోదీ–షి భేటీకి ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది.

LAC వద్ద శాంతి, స్థిరత్వం కొనసాగితే ఇరు దేశాల మధ్య రాజకీయ విశ్వాసం పెరగడంతో పాటు వాణిజ్య, ఆర్థిక సంబంధాలు కూడా మరింత మెరుగుపడే అవకాశం ఉంటుంది. అయితే సరిహద్దు సమస్య పూర్తిగా పరిష్కారం కాకపోవడంతో సంబంధాల పునరుద్ధరణ ప్రక్రియ సున్నితంగానే కొనసాగనుంది.

ఇదిలా ఉండగా, భారత్‌ అధ్యక్షతన జరుగుతున్న బ్రిక్స్‌ సదస్సుకు చైనా అందిస్తున్న మద్దతు, సహకారానికి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై ఏకాభిప్రాయ పరిధిని విస్తరించుకోవడంతో పాటు ఉమ్మడి సవాళ్లను కలిసి పరిష్కరించుకోవాలని ఇరు దేశాలు అంగీకరించాయి.

మొత్తంగా చూస్తే.. సరిహద్దులో శాంతి, సంబంధాల్లో స్థిరత్వం, వాణిజ్యంలో సమతుల్యత అనే మూడు కీలక అంశాల చుట్టూ మోదీ–జిన్‌పింగ్‌ భేటీ సాగింది. ఈ సమావేశం తర్వాత భారత్‌–చైనా సంబంధాలు ఏ దిశగా ముందుకు వెళ్తాయన్నది ఇప్పుడు అంతర్జాతీయంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక తదుపరి 19వ బ్రిక్స్ సమావేశం చైనాలో జరగనున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us