Glowing skin: పైసా ఖర్చు లేదు.. కిచెన్‌లో దొరికే ఈ పదార్థాలతోనే మెరిసే చర్మాన్ని ఈజీగా పొందండి!
అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ఇందుకోసం మార్కెట్‌లో దొరికే అనేక రకాల బ్యూటీ ప్రాడక్ట్స్ వాడుతూ ఉంటారు. కానీ పైసా ఖర్చు లేకుండా, పూర్తిగా సహజసిద్ధంగా ముఖ కాంతిని రెట్టింపు చేసే కొరియన్ బ్యూటీ టెక్నిక్ గురించి మాత్రం చాలా మందికి తెలియదు. అవును అదే సైంటిఫిక్‌గా నిరూపితమైన కూల్ థెరపీ స్టైల్ విధానం. దీనిలో చర్మ సౌందర్యాన్ని ఈజీగా పెంచుకోవచ్చు.అదెలానో చూద్దాం.

మన చర్మ సౌందర్యానికి ఐస్ క్యూబ్ థెరఫీ బెస్ట్ ఆప్షన్ అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఐస్ క్యూబ్‌తో ముఖంపై మసాజ్ చేసినప్పుడు ఆ ప్రాంతం బాగా చల్లబడుతుంది. శరీర ధర్మం ప్రకారం ఉష్ణోగ్రత 35-36 డిగ్రీల సెల్సియస్ వద్ద నియంత్రణలో ఉండాలి. చర్మం చల్లబడగానే, శరీరం ఆ భాగాన్ని వెచ్చగా ఉంచేందుకు వేడి రక్తాన్ని రెట్టింపు వేగంతో అక్కడికి పంపిస్తుంది. ఈ క్రమంలో రక్తనాళాలు వ్యాకోచించి చర్మానికి ఎక్కువ రక్తాన్ని చేరవేస్తాయి.
ఈ రక్తప్రసరణతో పాటు పోషకాలు, ఆక్సిజన్, శక్తినిచ్చే పదార్థాలు చర్మ కణాలకు అందుతాయి. తద్వారా కణాలు ఉత్తేజితమై మెరుగ్గా పనిచేస్తాయి. వ్యర్థాలు రక్తంతో పాటు తిరిగి ప్రయాణించి తొలగిపోతాయి. ఈ డీటాక్సిఫికేషన్ ప్రక్రియ వల్ల చర్మం తక్కువ సమయంలోనే రిఫ్రెష్ అయి, కాంతివంతంగా మారుతుంది. కొరియన్లు తమ చర్మం నిగనిగలాడేందుకు ఈ కోల్డ్ థెరపీ స్టైల్ మసాజ్‌ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.
యాంటీ-టాన్ ఐస్ క్యూబ్స్ తయారీ
సాధారణ ఐస్ క్యూబ్స్‌తోనూ మంచి ఫలితాలు వస్తాయి. అయితే కొన్ని సహజ పదార్థాలను జోడించి యాంటీ-టాన్ ఐస్ క్యూబ్స్ తయారు చేసుకుంటే ఫలితం మరింత మెరుగ్గా ఉంటుంది.
కలబంద : కలబంద గుజ్జును పేస్ట్‌లా చేసి, కొద్దిగా నీరు లేదా కొబ్బరినూనె కలిపి గ్రైండ్ చేయాలి. ఆ మిశ్రమాన్ని ఐస్ ట్రేలో పోసి గడ్డకట్టించాలి. ఇది చర్మాన్ని మృదువుగా మార్చడానికి దోహదపడుతుంది.
కీరా దోసకాయ రసం, రోజ్‌వాటర్: కీరా దోసకాయ రసాన్ని తీసి నేరుగా ఐస్ ట్రేలో పోసి క్యూబ్స్‌లా చేసుకోవచ్చు. అలాగే రోజ్ వాటర్‌ను కూడా ఐస్ ట్రేలో పోసి క్యూబ్స్‌లా మార్చి వాడుకోవచ్చు.
తేనె, నిమ్మరసం: ఒక చిన్న కప్పులో రెండు చెంచాల తేనె, ఒకటి లేదా రెండు నిమ్మకాయల రసం, కొద్దిగా నీరు పోసి కలపాలి. దీన్ని ఐస్ ట్రేలో వేసి గడ్డకట్టించాలి. నిమ్మరసంలోని సిట్రిక్ యాసిడ్ మృతకణాల పొరలను తొలగిస్తుంది. తేనెలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మొటిమలు, మచ్చలను తగ్గించడంలో సహాయపడతాయి.
ఐస్ క్యూబ్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఐస్ క్యూబ్ మసాజ్‌ను సరైన పద్ధతిలో చేయడం ఎంతో ముఖ్యం. ఐస్ క్యూబ్‌ను నేరుగా చర్మంపై రుద్దకూడదు. విపరీతమైన చల్లదనం వల్ల చర్మం మండటం లేదా ఇరిటేషన్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఒక శుభ్రమైన కర్చీఫ్ వంటి గుడ్డలో ఐస్ క్యూబ్‌ను ఉంచి మాత్రమే మసాజ్ చేయాలి. ఇది అతి చల్లదనాన్ని నియంత్రిస్తూ, నిరంతర చర్యకు సహకరిస్తుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
