India GDP: భార‌త్ వృద్ధి రేటులో మరోసారి కోత.. ఈ ఏడాది 6.8 శాతమే..! ఐఎంఎఫ్ అంచనా ఇదే..

|

Oct 11, 2022 | 9:25 PM

భారత వృద్ధి రేటులో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ మరోసారి కోత విధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధి రేటు 6.8 శాతం ఉండొచ్చని అంచనా వేసింది.

India GDP: భార‌త్ వృద్ధి రేటులో మరోసారి కోత.. ఈ ఏడాది 6.8 శాతమే..! ఐఎంఎఫ్ అంచనా ఇదే..
Imf
Follow us on

భారత వృద్ధి రేటులో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ మరోసారి కోత విధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధి రేటు 6.8 శాతం ఉండొచ్చని అంచనా వేసింది. ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలు, ఆర్థిక సంస్థలు వృద్ధి అంచనాలను తగ్గించగా.. ఐఎంఎఫ్ సైతం తాజాగా అంచనాల్లో కోత విధిస్తూ పలు కీలక విషయాలను వెల్లడించింది. కాగా.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 8.7 శాతంగా నమోదైంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను దేశం 8.2 శాతం నమోదు చేయొచ్చని జనవరిలో అంచనా వేసింది. అనంతరం వృద్ధి అంచనాల్లో కోత పెడుతూ 7.4 శాతంగా నమోదైనట్టు జులైలో వెల్లడించింది. తాజా అంచనాల్లో మరోసారి 0.6 శాతం కోత పెడుతూ 6.8 శాతం మాత్రమే వృద్ధి నమోదు కావొచ్చని పేర్కొంది. రెండో త్రైమాసికంలో ఊహించిన దానికంటే ఉత్పత్తి తక్కువగా నమోదు కావడం, డిమాండ్‌ అంతంత మాత్రంగానే ఉండడం లాంటి పరిణామాలే కోత విధించడానికి కారణమని తెలిపింది.

కాగా.. గత వారం, ప్రపంచ బ్యాంక్ కూడా భారతదేశ వృద్ధి అంచనాను 2022-23 ఆర్థిక సంవత్సరానికి 6.5%కి తగ్గించింది. ఇది మునుపటి జూన్ 2022 అంచనాతో పోలిస్తే 1% తగ్గింది. అంతర్జాతీయ పరిస్థితులు క్షీణించడమే జిడిపిలో కోతలకు కారణమని పేర్కొంది.

ఇవి కూడా చదవండి

వచ్చేది గడ్డు కాలమే..

దీంతోపాటు ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు అంచనాలను సైతం ఐఎంఎఫ్ వెలువరించింది. 2021లో 6 శాతంగా నమోదైన వృద్ధి రేటు ఈ ఏడాది 3.2 శాతం నమోదు కావొచ్చని అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2023) కేవలం 2.7 శాతంగా నమోదు కావొచ్చని ఐఎంఎఫ్ పేర్కొంది. దీనికి కరోనా, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, చైనాలో లాక్‌డౌన్లు వంటివి ఇందుకు కారణాలుగా వివరించింది.

గరిష్ట స్థాయిని పక్కన పెడితే.. ఇది “2001 కంటే బలహీనమైన వృద్ధి ప్రొఫైల్” అని IMF మంగళవారం ప్రచురించిన తన వరల్డ్ ఎకనామిక్ ఔట్‌లుక్‌లో పేర్కొంది. ఈ సంవత్సరం చైనా GDP అంచనా 3.2% వద్ద స్థిరంగా ఉండగా.. ఇది 2021లో చూపిన వృద్ధి కంటే 6% వరకు తగ్గింది. ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంకు, అనేక మంది గ్లోబల్ CEO ల నుంచి వచ్చిన హెచ్చరికలను ప్రస్తావిస్తూ.. 2023 మాంద్యం లాగా అనిపిస్తుందని నివేదికలో పేర్కొంది.

ఇక అమెరికా వృద్ధి రేటు కేవలం ఒక్క శాతానికే పరిమితం కావొచ్చని ఐఎంఎఫ్‌ తెలిపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..