IMD Prediction: భారత వాతావరణ శాఖ (IMD) డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు పలు ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితుల గురించి వివరించింది. కోస్తా ఆంధ్ర ప్రదేశ్, రాయలసీమ, దక్షిణ- అంతర్గత కర్ణాటక తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని తెలిపింది. వాయువ్య భారతదేశంలో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD పర్కొంది. అందువల్ల ఇక్కడ సగటు ఉష్ణోగ్రత సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది.
మరోవైపు పంజాబ్, హర్యానా, పశ్చిమ రాజస్థాన్‌లలో ఉష్ణోగ్రతలు సాధారణంగానే ఉండే అవకాశం ఉంది. తూర్పు, పశ్చిమ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తూర్పు రాజస్థాన్, గుజరాత్‌లలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయా లేదా అని చెప్పడం కష్టమని అయితే గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే తక్కువగానే ఉంటుందని వాతావరణ శాఖ వివరించింది. దక్షిణ, ఈశాన్య భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో, హిమాలయాల పాదాలకు ఆనుకొని ఉన్న కొన్ని ప్రాంతాలలో రాబోయే శీతాకాలంలో కనిష్ట ఉష్ణోగ్రత సాధారణం లేదా అంతకంటే ఎక్కువ ఉండవచ్చని IMD తెలిపింది.
నవంబర్‌లో గరిష్ట వర్షం
IMD ప్రకారం.. అక్టోబర్, నవంబర్ నెలల్లో, వాయువ్య భారతదేశంలో 107 శాతం, దక్షిణ ద్వీపకల్పంలో 71 శాతం, దేశం మొత్తం 48 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. నవంబర్ నెలలో దేశంలో 645 భారీ వర్షాలు కురిశాయి. 168 అతి భారీ వర్షాలు పడ్డాయి. ఇది గత ఐదేళ్లతో పోల్చితే (నవంబర్‌లో వర్షపాతం) నవంబర్‌లోనే అత్యధికం. ఈ నెలలో 11 అతి భారీ వర్షాలు (204.4 మి.మీ కంటే ఎక్కువ) కురిశాయి. ద్వీపకల్ప భారతదేశంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. దీని కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో 44 మంది, తమిళనాడులో 16 మంది, కర్ణాటకలో 15 మంది, కేరళలో ముగ్గురు మరణించారు. నవంబర్‌లో సాధారణ వర్షపాతం 30.5 మిల్లీమీటర్లకు గాను 56.5 మిల్లీమీటర్లు అంటే 85.4 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.