Heavy Rains: ఉత్తరాదిన బీభత్సం సృష్టిస్తున్న భారీ వర్షాలు.. అసోంలో 56కు చేరిన మృతుల సంఖ్య

|

Jul 04, 2024 | 9:08 PM

దేశంలోని పలు రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ విపత్తు ధాటికి చాలా కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. ప్రధాన నదులు నిండిపోవడంతో కన్నీటి వరద పారుతోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని సహాయక శిబిరాలకు తరలిస్తున్నారు.

Heavy Rains: ఉత్తరాదిన బీభత్సం సృష్టిస్తున్న భారీ వర్షాలు.. అసోంలో 56కు చేరిన మృతుల సంఖ్య
North India Floods
Follow us on

దేశంలోని పలు రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ విపత్తు ధాటికి చాలా కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. ప్రధాన నదులు నిండిపోవడంతో కన్నీటి వరద పారుతోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని సహాయక శిబిరాలకు తరలిస్తున్నారు.

అసోంలో వరద బీభత్సం అంతకంతకూ పెరుగుతోంది. 24 గంటల్లో మరో 8మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 56కు చేరినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 27 జిల్లాలోని 16.25 లక్షల మంది నిరాశ్రయులనట్లు వెల్లడించారు. బ్రహ్మపుత్ర, డిగేరు, కొల్లాంగ్ నదులుతోపాటు పెద్ద నదులన్నీ ఉప్పొంగి పొర్లుతుండటంతో వరద ఉధృతిలో ఊళ్లకు ఊళ్లే మునిగిపోయాయి. రోడ్లు తెగిపోయి రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జనజీవనం పూర్తిగా స్తంభించింది. ప్రస్తుతం 2,800 గ్రామాలు వరదగుప్పిట్లో చిక్కుకోగా, 42,478 హెక్టార్లలో వివిధరకాల పంటలు నీట మునిగినట్లు అధికారులు తెలిపారు. వరదల కారణంగా పలు జిల్లాల్లో రోడ్లు, వంతెనలు, ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతినట్లు చెప్పారు.

ఈ ఏడాదిలో ఇప్పటివరకు అసోంలో సంభవించిన ప్రకృతి విపత్తుల్లో చనిపోయినవారి సంఖ్య 56కు చేరినట్లు అధికారులు తెలిపారు. ఈ వరదల వల్ల కజిరంగా జాతీయ పార్కు, టైగర్‌ రిజర్వ్‌ కేంద్రాలు వరద నీటిలో మునిగిపోయాని, ఒక రైనో సహా 8 జంతువులు మృతి చెందాయని అటవీ అధికారులు తెలిపారు. ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ పర్యటించారు. పలు ప్రాంతాలలో దెబ్బతిన్న రోడ్లు, ఆనకట్టల మరమ్మతుల పనులను త్వరగతిన పూర్తి చేస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు.

అటు దేవభూమిగా పేరొందిన ఉత్తరాఖండ్‌లో వరద బీభత్సం కొనసాగుతోంది. ప్రధాన నదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. చంపావత్, అల్మోరా, పిథోర్‌గఢ్, ఉదమ్‌సింగ్ నగర్‌తోపాటు కుమాన్ తదితర ప్రాంతాల్లో మరో వారం రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని ఉత్తరాఖండ్ వాతావరణ శాఖ అధికారులు అలర్ట్‌ జారీ చేశారు. డెహ్రాడూన్, తేహ్రి, హరిద్వార్ తదితర నదీ పరివాహక ప్రాంతాల్లో ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో గంగా, అలకసంద, భాగీరథీ, శారద, మందాకిని, కోసి నదుల్లో నీరు భారీగా ప్రవహిస్తోంది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నదులను ఆనుకొని ఉన్న దాదాపు 100 రహదారులను అధికారులు మూసివేశారు.

గత 24 గంటల్లో అల్మోరాలోని చౌకుతియా ప్రాంతంలో 72.5 మి.మీ వర్షపాతం నమోదైంది. అలకనంద నది ఉప్పొంగడంతో రుద్రప్రయాగ్‌ వద్ద నది ఒడ్డున ఏర్పాటుచేసిన 10 అడుగుల శివుడి విగ్రహం నీట మునిగింది. నైనితాల్, పౌడీ జిల్లాల్లోని అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఎలాంటి విపత్తు తలెత్తినా, ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను జిల్లా మెజిస్ట్రేట్స్ ఆదేశించారు. గంగా, సరయూ నదులు ప్రమాదకర స్థాయికి కొంచెం దిగువన ప్రవహిస్తుండగా, అలకనంద, మందాకిని , భాగీరథి నదులు ఇప్పటికే ఆ స్థాయిని దాటేశాయి. మరోవైపు గోమతి, కాళీ, గౌరీ,శారద నదుల ప్రవాహం కూడా భారీగా పెరుగుతోంది.

పలుచోట్ల కొండ చరియలు విరిగిపడడంతో బద్రీనాథ్, యమునోత్రి, ధర్చులా , తవాఘాట్ జాతీయ రహదారుల పైనా రాకపోకలు నిలిచి పోయాయి. భారీగా నీటి ప్రవాహం, మట్టి కోతకు గురవడంతో సహాయకచర్యలకు ప్రమాదకరంగా మారింది. పారలు, గడ్డపారలతో మట్టిని తవ్వుతున్నారు. ప్రధాన రహదారులు దెబ్బతినడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. ప్రజలకు జీవనాధారమైన తోటలు తుడిచిపెట్టుకుపోయాయి. తాగేందుకు నీళ్లు కూడా దొరకడం లేదు.

ఇక ఇటు ఢిల్లీలో కుండపోత వాన పడుతోంది. ఎడతెరిపి లేని వానలతో ఢిల్లీ వాసులు తడిసిముద్దవుతున్నారు. రోడ్లన్నీ జలమయంగా మారుతున్నాయి. రోడ్లపై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల భారీ వర్షాలు ఢిల్లీని అతలాకుతలం చేశాయి. మళ్లీ వాన మొదలవడంతో నగర జనం ఆందోళన చెందుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…