
భారత్ అంతటా 3 వేల కిలోమీటర్ల మేర భారీ ఉరుములు, మెరుపులతో కూడిన మేఘాల బెల్ట్ ఏర్పడిందని.. కేరళ నుంచి అరుణాచల్‌ప్రదేశ్ వరకు ఒక భారీ తుఫాన్ వ్యవస్థ విస్తరించిందని సోషల్ మీడియాలో, కొన్ని వెబ్‌సైట్లలో విస్తృత ప్రచారం జరిగింది. ఉపగ్రహ చిత్రాలను చూపిస్తూ దేశవ్యాప్తంగా భారీ వాతావరణ అస్థిరత ఏర్పడిందని, మాన్సూన్‌కు ముందు అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయని కథనాలు వైరల్ అయ్యాయి. అయితే.. ఈ ప్రచారంలో ఉన్న సమాచారం పూర్తిగా తప్పుదోవ పట్టించేదేనని భారత వాతావరణ శాఖ (IMD) స్పష్టం చేసింది. ఉపగ్రహ చిత్రాలను తప్పుగా అర్థం చేసుకుని.. భారీ తుఫాన్ వ్యవస్థ ఏర్పడినట్లు ప్రచారం చేస్తున్నారని ఐఎండీ అధికారులు వివరణ ఇచ్చారు.
వాస్తవానికి.. ప్రస్తుతం దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రీ-మాన్సూన్ ప్రభావంతో వివిధ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తున్నాయి. ఇంకొన్ని చోట్ల గాలి వానలు బీభత్సం కనిపిస్తోంది. ఇవి సాధారణ వాతావరణ ప్రక్రియలో భాగమే తప్ప.. కేరళ నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకు ఒకే నిరంతర థండర్‌స్టామ్ ఛానల్ ఏర్పడిందని చెప్పడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని అధికారులు చెబుతున్నారు. ఉపగ్రహ చిత్రాల్లో కనిపించే మేఘాల సమూహాలను ఒకదానికొకటి కలిపి చూపిస్తూ.. భారీ వాతావరణ వ్యవస్థగా ప్రచారం చేయడం సరైంది కాదని ఐఎండీ స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో స్థానిక వాతావరణ పరిస్థితుల ప్రభావంతో వర్ష మేఘాలు ఏర్పడటం సాధారణమేనని తెలిపింది.
అలాగే.. 3 వేల కిలోమీటర్ల భారీ తుఫాన్ బెల్ట్ లేదా దేశాన్ని కప్పేసిన మేఘాల వ్యవస్థ వంటి ప్రచారాలకు ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రజలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఉపగ్రహ చిత్రాలు, అనధికార వాతావరణ విశ్లేషణలను నమ్మకుండా.. అధికారిక వాతావరణ బులెటిన్లను మాత్రమే ఆధారంగా తీసుకోవాలని సూచించింది.
ప్రస్తుతం దక్షిణ, మధ్య, తూర్పు భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు నమోదవుతున్నా.. అవి సాధారణ ప్రీ-మాన్సూన్ కార్యకలాపాలేనని ఐఎండీ తెలిపింది. మాన్సూన్ పురోగతి, వర్షాల తీవ్రతపై అధికారిక సమాచారం కోసం భారత వాతావరణ శాఖ విడుదల చేసే అప్డేట్లను మాత్రమే అనుసరించాలని సూచించింది. కాగా తొలుత వైరల్ అవుతున్న సమాచారంతో టీవీ9 వెబ్ సైట్‌లో కూడా ఓ కథనాన్ని ప్రచురించాం. వాతావరణ శాఖ వివరణతో దాన్ని తొలగించడం జరిగింది.