
దేశంలో ఇథనాల్ మిశ్రమ ఇంధనం (Ethanol Blended Petrol) వాడకంపై జరుగుతున్న చర్చలు, సోషల్ మీడియా ప్రచారంపై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తీవ్రంగా స్పందించారు. ఇథనాల్ అంశంలో ప్రజలను ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టిస్తున్నారని, దీనిపై వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారాలు చేయవద్దని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా తన కుమారుడు నిఖిల్ గడ్కరీ కంపెనీని లక్ష్యంగా చేసుకుని వస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు.
“నా కుమారుడి కంపెనీ ఆదాయం, లాభాలకు సంబంధించి సోషల్ మీడియాలో ఇస్తున్న గణాంకాలు పూర్తిగా అవాస్తవం. గూగుల్‌లో ఉన్న తప్పుడు సమాచారాన్ని చూసి, దాన్నే నిజమని నమ్మి ప్రచారం చేస్తే సహించేది లేదు. అలాంటి తప్పుడు ప్రచారాలు చేసేవారిపై చట్టపరంగా పరువు నష్టం దావా వేసి కోర్టుకు ఈడుస్తాను” అని గడ్కరీ హెచ్చరించారు.
మైలేజీపై గడ్కరీ వివరణ
ఇథనాల్ వినియోగం వల్ల వాహనాల మైలేజీ తగ్గుతుందనే ఆందోళనలపై కేంద్ర మంత్రి సాంకేతిక వివరణ ఇచ్చారు. నగరాల్లో ఇథనాల్ కలిపిన పెట్రోల్ మైలేజీ, సాధారణ పెట్రోల్‌తో సమానంగానే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అయితే, సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్‌లో కెలోరిఫిక్ విలువ (Calorific Value) కొద్దిగా తక్కువగా ఉండటం వల్ల, కేవలం హైవేలపై ప్రయాణించేటప్పుడు మాత్రం మైలేజీ స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని ఆయన అంగీకరించారు.
వాహనాలకు నష్టం జరిగితే కంపెనీలదే బాధ్యత: గడ్కరీ
వారంటీ కాలంలో ఇథనాల్ ఇంధనం కారణంగా వాహన ఇంజన్‌కు లేదా ఇతర భాగాలకు ఏదైనా నష్టం వాటిల్లితే, దానికి డీలర్, సంబంధిత వాహన తయారీ కంపెనీయే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని గడ్కరీ హామీ ఇచ్చారు. ఒకవేళ నష్టం జరిగితే కంపెనీ ఉచితంగా మరమ్మత్తు చేయాలని, వినియోగదారులు సంతృప్తి చెందకపోతే కన్స్యూమర్ కోర్టును ఆశ్రయించవచ్చని పేర్కొన్నారు. ఇథనాల్‌పై సోషల్ మీడియాలో 53 వీడియోలు వచ్చాయని, అందులో చాలావరకు తప్పుదోవ పట్టించేవేనని మండిపడ్డారు. ఇప్పటివరకు తనకు ఎలాంటి అధికారిక ఫిర్యాదులు రాలేదని, ఎవరికైనా సమస్య ఉంటే మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయవచ్చని, వాటిని తానే స్వయంగా విచారిస్తానని చెప్పారు.
ఇథనాల్ కేవలం ఇంధనం కాదు.. దేశ ప్రయోజనం
మహాత్మా గాంధీ కన్న ‘ఆత్మనిర్భర్ భారత్’ కలలను సాకారం చేసే దిశగా ముడి చమురు దిగుమతులను తగ్గించి, స్వదేశీ ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమని గడ్కరీ తెలిపారు. “ఇథనాల్ అనేది కేవలం ఒక ఇంధనం కాదు.. అది జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన అంశం. స్వదేశీ, స్వావలంబన, జాతీయవాదమే దీని మూలమంత్రం” అని ఆయన అభివర్ణించారు. దీనివల్ల దేశంలో కాలుష్యం తగ్గడమే కాకుండా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమై రైతులకు మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదే క్రమంలో ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేపై వస్తున్న విమర్శలపై స్పందిస్తూ.. అక్కడ డ్రైనేజీ వ్యవస్థ ఇంకా పూర్తి కాలేదని, అందువల్లనే వర్షాకాలంలో కొన్ని చోట్ల నీరు నిలిచి గుంతలు పడ్డాయని ఆయన అంగీకరించారు. దేశ ప్రయోజనాల కోసం తీసుకుంటున్న ఇథనాల్ లాంటి నిర్ణయాలపై రాజకీయ లేదా తప్పుడు ప్రచారాలు పక్కనబెట్టి, వాస్తవాల ఆధారంగానే చర్చలు జరగాలని నితిన్ గడ్కరీ పిలుపునిచ్చారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..