స్టార్టప్‌ కంపెనీలో CHOగా ‘శునకం’ నియామకం.. వీలైతే CEO సీటు కూడా కావాలంటోంది?

హైదారాబాద్ నగరానికి చెందిన ఓ స్టార్టప్‌ కంపెనీ వినూత్న ఐడియా ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. హైదరాబాద్‌లోని గండి మైసమ్మలో ఓ వ్యవసాయ యంత్రాల తయారీదారు స్టార్టప్ కంపెనీ ఉంది. ఈ కంపెనీ యాజమన్యం తాజాగా ఉద్యోగులతో పాటు ఓ కుక్కకు కూడా ఉద్యోగం ఇచ్చి కంపెనీలో కుర్చీవేసి కూర్చోబెట్టింది. అదేంటీ అనుకుంటున్నారా? దీని వెనుక ఓ పెద్ద కారణమే ఉంది. అదేంటంటే..

స్టార్టప్‌ కంపెనీలో CHOగా శునకం నియామకం.. వీలైతే CEO సీటు కూడా కావాలంటోంది?
Dog as Chief Happiness Officer at IT firm

Updated on: May 30, 2025 | 12:59 PM

హైదరాబాద్, మే 30: తమ కార్యాలయంలో సానుకూల వాతావరణం పెంపొందిచడానికి, ఉద్యోగుల ఆనందం కోసం కుక్కగారిని పిలిచి మరీ ఓ స్టార్టప్ కంపెనీ ఉద్యోగం ఇచ్చింది. ఇందులో భాగంగా సదరు కంపెనీ గోల్డెన్ రిట్రీవర్ జాతికి చెందిన డెన్వర్ అనే శునకాన్ని ఏకంగా చీప్‌ హ్యాపీనెస్‌ ఆఫీసర్ పదవిలో నియమించుకుంది. అయితే డెన్వర్ ఆఫీస్ లో ఏ పని చేయదు.. జస్ట్ ఊరికే అలా కూర్చుని అందరికీ ఫన్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది.

హార్వెస్టెడ్ రోబోటిక్స్ అనే స్టార్టప్‌ కంపెనీ కో ఫౌండర్‌ రాహుల్ అరెపాకా..ఇందుకు సంబంధించిన పోస్ట్‌ ఒకటి లింక్డ్ఇన్ ప్రొఫైల్‌లో పెట్టారు. ఈ పోస్టులో డెన్వర్‌ను పరిచయం చేస్తూ.. ‘మా కొత్త ఉద్యోగి డెన్వర్ – చీఫ్ హ్యాపీనెస్ ఆఫీసర్‌. డెన్వర్‌ కోడ్ చేయదు. ఏదీ పట్టించుకోదు. కేవలం ఆఫీస్‌కి వచ్చి కూర్చుంటుంది. అందరికీ ఆనందం పంచుతుంది. ఆఫీస్‌ వాతావరణాన్ని ఆహ్లాదపరుస్తుంది. తద్వారా ఉద్యోగుల ఉత్సాహాన్ని రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా మేము ఇప్పుడు అధికారికంగా పెట్ ఫ్రెండ్లీ ఆఫీసర్‌గా మారాం. మా కంపెనీ తీసుకున్న ఉత్తమ నిర్ణయం ఇదే. ఇక్కడ డెన్వర్‌కి మిగతా అందరు ఉద్యోగుల కంటే కాస్త ఎక్కువగానే సౌకర్యాలు కల్పించాం..’ అని కంపెనీ కో ఫౌండర్‌ రాహుల్ అరెపాకా పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇక ఈ పోస్టుకు దాదాపు 13 వేలకుపైగా లైకులు, కామెంట్లతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

‘జీరో మీటింగ్స్, పూర్తి ప్రయోజనాలు.. వంద శాతం ఇంపాక్ట్‌.. అత్యుత్తమ నియామకానికి చీర్స్!’, ‘మీ పని-విరామ సమయంలో సెరోటోనిన్ వేగంగా విడుదల చేస్తుందన్నమాట’ అంటూ కొందరు నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తే.. మరికొందరేమో వెంటకారం చేయసాగారు. ‘కార్పొరేట్ లైఫ్‌ శునకానికి కూడా అలవాటు చేస్తున్నారు. చూస్తే విచారంగా ఉన్నట్లు కనిపిస్తుంది’ అంటూ కామెంట్లు పెడతున్నారు. మరికొందరేమో ఇలాంటి సీహెచ్‌ఓలను ఇతర కంపెనీలు కూడా నియమించుకోవాలని, తద్వారా ఉద్యోగుల మానసిక ఆరోగ్యంపై సానుకూలంగా ఉంటుందని పిలుపునిచ్చారు. ఇకపోతే డెన్వర్‌కు కూడా 138 మంది ఫాలోవర్స్‌తో సొంత లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంది. ఇందులో తాను హార్వెస్టెడ్‌లో చీఫ్ హ్యాపీనెస్ ఆఫీసర్‌గా జాబ్ చేస్తున్నట్లు, అక్కడ సానుకూల, ఆకర్షణీయమైన పని వాతావరణాన్ని పెంపొందించడానికి అంకితభావంతో ఉన్నట్లు డెన్వర్‌ ప్రొఫైల్‌లో పేర్కొంది. తాజాగా రాహుల్ పెట్టిన పోస్టుకు డెన్వర్ రిప్లై ఇస్తూ.. ‘చాలా థ్యాంక్స్ రాహుల్. పాసిబుల్‌ అయితే నేను CEO కావచ్చా?’ అంటూ రిప్లై ఇచ్చినట్లు కామెంట్‌ సెక్షన్‌లో కనిపించింది. ఇక దీనిపై నెట్టింట జోకులు పేలుతున్నాయి.

కాగా ఇటీవల కాలంలో ఉద్యోగుల ఒత్తిడి తగ్గించడం, నైతిక స్థైర్యాన్ని మెరుగుపరచడం వంటి వాటికి ప్రాధాన్యతనిస్తూ అనేక కంపెనీలు తమ కార్యాలయాల్లో పెట్-ఫ్రెండ్లీగా మారుస్తున్నాయి. అమెజాన్, గూగుల్, జాపోస్ వంటి ప్రఖ్యాత సంస్థలు సైతం తమ కార్యాలయాల్లో పెంపుడు జంతువులకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. జంతువుల సాన్నిహిత్యం ఒత్తిడిని తగ్గిస్తుందని, సాంఘిక సంబంధాలను ప్రోత్సహిస్తుందని, ఉత్పాదకతను పెంచుతుందని పలు అధ్యయనాలు సైతం నిరూపించాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.