కోవిద్ టెస్టులు తప్పించుకోవడానికి….. పరుగో పరుగు…అస్సాం రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల తిప్పలు, ఇలా అయితే ఎలా అంటున్న అధికారులు
కోవిద్ టెస్టులు తప్పించుకోవడానికి రైలు ప్రయాణికులు భలే ఐడియా వేశారు. అధికారులకు పట్టుబడకుండా పరుగులమీద పరుగులు తీశారు.. అసలు సంగతేమిటంటే.. కన్యాకుమారి-డిబ్రుగఢ్ వివేక్ ఎక్స్ ప్రెస్ ఆదివారం సాయంత్రం..
కోవిద్ టెస్టులు తప్పించుకోవడానికి రైలు ప్రయాణికులు భలే ఐడియా వేశారు. అధికారులకు పట్టుబడకుండా పరుగులమీద పరుగులు తీశారు.. అసలు సంగతేమిటంటే.. కన్యాకుమారి-డిబ్రుగఢ్ వివేక్ ఎక్స్ ప్రెస్ ఆదివారం సాయంత్రం అస్సాం రాజధాని గౌహతికి సుమారు 60 కి.మీ. దూరంలోని జాగి రోడ్ స్టేషన్ కి చేరింది. అంతే ! రైలు ఆగీ ఆగగానే సుమారు 400 మంది ప్రయాణికులు హడావుడిగా దిగిపోయి పరుగులు పెట్టారు. వీరిలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. పోలీసులు,రైల్వే అధికారులు చూస్తూ ఉండగానే అంతా కాసేపటికే కనబడితే ఒట్టు.. అయితే పట్టుబడిన కొద్దిమందికి మాత్రం అధికారులు కోవిద్ టెస్టులు నిర్వహించారు. రేల్వే ప్రయాణికులందరికీ కోవిద్ టెస్టులు తప్పనిసరిగా నిర్వహించాలన్న రూల్ ఉంది మరి ! అస్సాంలో కేసులు స్వల్పంగా తగ్గాయి, గత 24 గంటల్లో ఆరు వేల కేసులు నమోదయ్యాయి.
కాగా బీహార్ లో కూడా గత నెలలో బక్సర్ రైల్వే స్టేషన్ లో ఇలాంటి ఘటనే జరిగింది. కరోనా వైరస్ టెస్టులకు భయపడి పెద్ద సంఖ్యలో ప్రయాణికులు బయటకు వెళ్లిపోయారు. దేశంలో కేసులు తగ్గుతున్న కారణంగా అధికారులు కూడా చూసీ చూడనట్టు వదిలేస్తున్నట్టు కనిపిస్తోంది. గత 24 గంటల్లో దేశంలో రెండు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. రికవరీ రేటు గణనీయంగా పెరిగింది. అయితే మరణాల సంఖ్య ఇంకా తగ్గాలని అధికారులు చెబుతున్నారు.