తమకు అయిదేళ్ల సమయం ఇస్తే ఈ రాష్ట్రాన్ని బులెట్లు, ఆందోళనలు, అల్లర్లు, వరదల బారి నుంచి విముక్తం చేస్తామని హోం మంత్రి అమిత్ షా అన్నారు. బోడోలాండ్ టెరిటోరియల్ రీజన్ తొలి వార్షికోత్సవం సందర్భంగా కోక్రఝర్ లో ఆదివారం జరిగిన సభలో మాట్లాడిన ఆయన.. బీజేపీ హయాంలో అన్ని రాజకీయ హక్కులు, సంస్కృతి, అన్ని వర్గాల భాషలకు రక్షణ ఉంటుందని హామీ ఇచ్చారు. బోడో శాంతి ఒప్పందంపై సంతకం చేయడం ద్వారా ప్రధాని మోడీ ఈశాన్య రాష్ట్రంలో తిరుగుబాటును, తీవ్రవాదాన్ని అణచివేసే కృషి చేస్తున్నారని ఆయన చెప్పారు. కోక్రఝర్ లో ఈ కార్యక్రమానికి ఇంతమంది హాజరయ్యారంటే అస్సాంలో శాంతిని భంగపరచాలని చూసేవారికి కనువిప్పు అవుతుందని, బోడో-నాన్ బోడో పేరిట విషం కక్కే వారికి గట్టి గుణపాఠం అవుతుందని అమిత్ షా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో యువతన బులెట్లతో చిదిమివేసిందని ఆయన ఆరోపించారు.
అస్సాంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆయన చేసిన ప్రసంగం ఎన్నికల ప్రచారంలా సాగింది. ప్రధాని మోదీ నాయకత్వంలో ఏ దేశం అన్ని రంగాల్లో పురోగమిస్తోందని అమిత్ షా చెప్పారు. కరోనా వైరస్ అదుపునకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు, వ్యాక్సిన్ల అందుబాటు తదితరాలను ఆయన వివరించారు.