భారీ వర్షాలు ఈశాన్య భారతాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా అసోంను కుండపోత వర్షం ముంచెత్తింది. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు గ్రామాలన్నీ జలమయం అయ్యాయి. భారీ వర్షాలకు పురాతన గోడలు, ఇళ్ళు నేలమట్టం అవుతున్నాయి. ఇళ్ళల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు జాగారం చేస్తున్నారు.
వరద దాటికి రోడ్లన్నీ కొట్టుకుపోవడంతో.. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోగులను ఎత్తుకొని ఆసుపత్రికి తీసుకుపోవాల్సిన పరిస్థితి నెలకొంది. గ్రామాల్లోని వాకిళ్లు, వీధులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. వరద నీటిలోపాములతో పాటు చేపలు కొట్టుకొస్తున్నాయి. దీంతో వాకిళ్లలోనే వలలు వేసి చేపలు పట్టుకుంటున్నారు గ్రామస్తులు.