Crime News: ఫోన్‌ హ్యాక్ చేసి.. AI చిత్రాలతో బ్లాక్‌ మెయిల్.. 19 ఏళ్ల ఇంటర్ స్టూడెంట్‌ ఆత్మహత్య

హర్యానాలో విషాద ఘటన వెలుగు చూసింది. ఏఐ జెనరేటెడ్‌ అశ్లీల చిత్రాల బ్లాక్‌ మెయిల్ కారణంగా ఒక యువకుడు ఆత్మహత్యకు చేసుకొని ప్రాణాలు కోల్పోయాడు. తనకు రూ.20 వేలు ఇవ్వకపోతే, తనవి, తన సోదరీమణుల ఫోటోలను అశ్లీల ఫోటోలు, వీడియోలుగా చిత్రీకరించి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్ చేస్తానని ఒక వ్యక్తి యువకుడిని బ్లాక్‌మెయిల్ చేశాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Crime News: ఫోన్‌ హ్యాక్ చేసి.. AI చిత్రాలతో బ్లాక్‌ మెయిల్.. 19 ఏళ్ల ఇంటర్ స్టూడెంట్‌ ఆత్మహత్య
Crime News

Updated on: Oct 27, 2025 | 5:45 PM

హర్యానాకు చెందిన 19 ఏళ్ల కాలేజ్‌ స్టూడెంట్‌ తన ముగ్గురు సోదరీమణుల AI- జనరేటెడ్ అశ్లీల ఫోటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేయడంతో ఆత్మహత్య చేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఫరీదాబాద్‌లోని బసెల్వా కాలనీలో జరిగింది. రాహుల్ అనే 19 ఏళ్ల యువకుడు స్థానికంగా ఉన్న DAV కళాశాలలో రెండవ సంవత్సరం చదువుతున్నాడు. గత కొన్ని రోజుల క్రితం ఒక నిందితుడు రాహుల్‌ ఫోన్‌ను హ్యాక్ చేసి అతనితో పాటు, అతని ముగ్గురి సోరిమణుల చిత్రాలను ఏఐ సహాయంతో అశ్లీల చిత్రాలుగా చిత్రీకరించాడు. వాటిని రాహుల్‌కు పంపి రూ.20,000 వేలు ఇవ్వకపోతే ఈ చిత్రాలను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్ చేస్తానని బ్లాక్‌మెయిల్‌ చేశాడు. దీంతో మనస్తాపానికి గురైన రాహుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాహుల్‌ ఆత్మహత్యకు రెండు వారాల ముందు నుంచి ఈ బ్లాక్‌మెయిల్ మొదలైంది. నిందితుడు రాహుల్ ఫోన్‌ను హ్యాక్ చేసి తనతో పాటు తన సోదరీమణుల చిత్రాలను ఏఐ సహాయంతో అశ్లీల చిత్రాలు మార్చి బ్లాక్‌మెయిల్ చేసినట్టు రాహుల్ తండ్రి పోలీసులకు తెలిపాడు. నిందితుడి నుంచి పదే పదే బెదిరింపులు రావడంతో తన కొడుకు చాలా బాధపడ్డాడని, అవమానాన్ని తట్టుకోలేక అతను మరింతగా దూరంగా ఉంటున్నాడని మనోజ్ చెప్పాడు. గత 15 రోజులుగా రాహుల్ ప్రవర్తన పూర్తిగా మారిపోయిందని ఆయన అన్నారు.

అతను సరిగ్గా తినడం మానేశాడని, తమ మాట్లాడడం కూడా మానేశాడని.. ఎక్కువ సమయం తన గదిలో ఒంటరిగా గడిపేవాడని మనోజ్ చెప్పాడు. శనివారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో రాహుల్ తన గదిలో పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడని తెలిపారు. రాహుల్‌ను సమీపంలోని హాస్పిటల్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ అతను మరణించినట్టు రాహుల్ తండ్రి తెలిపాడు. దీంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.