హర్యానాలో రైతుల నిరసనలు ఆదివారం కూడా కొనసాగాయి. నిన్న హిసార్, యమునా నగర్ జిల్లాల్లో బీజేపీ నేతలు పాల్గొన్నకార్యక్రమాలను వారు అడ్డుకోగా నేడు కూడా ఫతేహాబాద్ జిల్లాలో అదే పరిస్థితి కనిపించింది. యమునా నగర్ లో శనివారం రవాణా శాఖ మంత్రి మూల్ చంద్ శర్మ అటెండ్ అయిన కార్యక్రమాన్ని, హిసార్ లో రాష్ట్ర బీజేపీ చీఫ్ ఓంప్రకాష్ ధన్ కర్ పాల్గొన్న ఈవెంట్ ను కూడా అన్నదాతలు అడ్డుకున్నారు. పోలీసులతో ఘర్షణకు దిగి బ్యారికేడ్లను లాగి పారేశారు. ఇక ఆదివారం ఫతేహాబాద్ జిల్లాలోనూ, జాజర్ ప్రాంతంలోను బీజేపీ కార్యకర్తలపై వీరు విరుచుక పడ్డారు. ఖాకీలు బ్యారికేడ్లను పెట్టినా వాటిని ధ్వంసం చేసి వారిపైనా దాడికి దిగారు. ఈ కార్యక్రమాలకు హాజరు కావలసి ఉన్న ఎంపీ అరవింద్ శర్మ, ఏరియా ఇన్-ఛార్జి వినోద్ తాడే వీరి ఆందోళన ఫలితంగా ఈ స్థలాలకు చేరలేకపోయారు. వివాదాస్పద రైతు చట్టాలను కేంద్రం రద్దు చేసేంతవరకు తాము ఇలాగే బీజేపీ నాయకులు పాల్గొనే ఈవెంట్లను అడ్డుకుంటూనే ఉంటామని రైతు సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
బీజేపీ మిత్ర పక్షంగా ఉన్న జన నాయక్ జనతా పార్టీ నేతలను ఘెరావ్ చేయాలని కూడా వీరు పిలుపునిచ్చారు. తమ ఆందోళన ఆగదని,, పంజాబ్, హర్యానా, యూపీ రాష్ట్రాల్లోనూ తమ రైతులు ఇలాగే నిరసన ప్రదర్శనలు చేస్తారని రైతు సంఘాల నాయకులు తెలిపారు. ఇక పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యే రోజులు దగ్గర పడుతున్న కొద్దీ.. పార్లమెంటు ఎదుట ధర్నాలు నిర్వహిస్తామని అన్నదాతలు ఇదివరకే ప్రకటించారు. ఇప్పటికే ఇందుకు తగిన వ్యూహాలను సిద్జం చేసుకున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: petrol price: పెట్రోల్ ధరలు పెరగడానికి కారణమేంటో తెలుసా.? ఈ మంత్రి చెప్పిన లాజిక్ తెలిస్తే దిమ్మ తిరిగిపోద్ది.