హర్యానాలో కమలనాథుల ‘గోవా ప్లాన్‘.. ఒక్కసారిగా వ్యూహం మార్చిన కాంగ్రెస్ నేతలు..!

| Edited By: Janardhan Veluru

Sep 04, 2024 | 5:52 PM

హర్యానాలో భారతీయ జనతా పార్టీ (BJP)కి గట్టి సవాలు ఎదురైంది. వరుసగా పదేళ్లు అధికారంలో ఉన్న ఆ పార్టీ ఇప్పుడు మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు ఎదురీదాల్సి వస్తోంది. ప్రతిపక్ష కాంగ్రెస్ క్రమంగా బలపడుతున్న దశలో వరుసగా మూడోసారి అధికారంలోకి రావడం అంత ఈజీ కాదని కమలదళానికి బాగా తెలుసు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలితే తప్ప గెలవడం అసాధ్యమని కాషాయ పార్టీ అగ్ర నాయకత్వానికి అర్థమైంది.

హర్యానాలో కమలనాథుల ‘గోవా ప్లాన్‘.. ఒక్కసారిగా వ్యూహం మార్చిన కాంగ్రెస్ నేతలు..!
Arvind Kejriwal, Rahul Gandhi, Akhilesh Yadav
Follow us on

హర్యానాలో భారతీయ జనతా పార్టీ (BJP)కి గట్టి సవాలు ఎదురైంది. వరుసగా పదేళ్లు అధికారంలో ఉన్న ఆ పార్టీ ఇప్పుడు మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు ఎదురీదాల్సి వస్తోంది. ప్రతిపక్ష కాంగ్రెస్ క్రమంగా బలపడుతున్న దశలో వరుసగా మూడోసారి అధికారంలోకి రావడం అంత ఈజీ కాదని కమలదళానికి బాగా తెలుసు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలితే తప్ప గెలవడం అసాధ్యమని కాషాయ పార్టీ అగ్ర నాయకత్వానికి అర్థమైంది. అందుకే.. గోవా తరహాలో వ్యతిరేక ఓట్లను చీల్చడంపైనే దృష్టి సారించింది. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలడం కారణంగానే హ్యాట్రిక్ విజయం సాధించగలిగింది. అయితే బీజేపీ వ్యూహాన్ని పసిగట్టిన కాంగ్రెస్ కూడా అప్రమత్తమైంది. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), సమాజ్‌వాదీ పార్టీ (SP), సీపీఐ (ఎం) పార్టీలతో పొత్తు ద్వారా బీజేపీ వ్యతిరేక ఓట్ల చీలికను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోంది.

గోవాలో ఏం జరిగింది?

గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీ స్థానిక పార్టీలతో కలిసి కూటమిగా పోటీ చేయగా.. బెంగాల్‌కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ (TMC) కూడా తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగి పూర్తి స్థాయిలో కసరత్తు చేయడంతో కాంగ్రెస్‌ గెలుపు ముంగిట చతికిలపడింది. కాంగ్రెస్ గెలవాల్సిన ఈ యుద్ధం కాస్తా ఓటమిగా మిగిలిపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీకి 6.77 శాతం, రెవల్యూషనరీ గోవా పార్టీకి 9.21 శాతం ఓట్లు వచ్చాయి. ఆమ్ ఆద్మీ పార్టీ 2 సీట్లు, రెవల్యూషనరీ గోన్స్ పార్టీ 1 సీటు గెలుచుకున్నాయి. మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ (MGP)తో టీఎంసీ కూటమిని ఏర్పాటు చేసింది. టీఎంసీకి 5.21 శాతం ఓట్లు రాగా, మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీకి 7.6 శాతం ఓట్లు వచ్చాయి. మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ 1 సీటు గెలుచుకుంది, అయితే TMC గణనీయమైన ఓట్లను సాధించినప్పటికీ.. ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయింది.

మరోవైపు, కాంగ్రెస్ కూటమికి 23.46 శాతం ఓట్లు, గోవా ఫార్వర్డ్ పార్టీకి 1.84 శాతం ఓట్లు రాగా, కాంగ్రెస్‌కు 11 సీట్లు, గోవా ఫార్వర్డ్ పార్టీకి 1 సీటు లభించాయి. 2017 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పోల్చితే కాంగ్రెస్ కూటమికి 3.1 శాతం ఓట్లు తగ్గగా.. 7 సీట్లను కోల్పోయింది. 2017లో కాంగ్రెస్‌కు 16 సీట్లు, గోవా ఫార్వర్డ్ పార్టీకి 2 సీట్లు వచ్చాయి. బీజేపీకి 33.31 శాతం ఓట్లతో 20 సీట్లు వచ్చాయి. గోవాలో కాంగ్రెస్, ఆప్, టీఎంసీల మధ్య పొత్తు ఉంటే ఫలితం ఎలా ఉండేదో ఊహించుకోచ్చు. గోవాలో విపక్షాల ఓట్లు చీలడంతో బీజేపీకి గోవా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 20 సీట్లు వచ్చాయి.

హర్యానాలో బహుముఖ పోటీ!

హర్యానాలో బీజేపీ దృష్టి ముఖ్యంగా రెండు విపక్ష కూటములపైనే ఉంది. దుష్యంత్ చౌతాలాకు చెందిన జననాయక్ జనతా పార్టీ (JJP) చంద్రశేఖర్‌ ఆజాద్‌కు చెందిన ఆజాద్ సమాజ్ పార్టీ (ASP)తో పొత్తు పెట్టుకోగా, ఓంప్రకాష్ చౌతాలాకు చెందిన ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (INLD), బహుజన్ సమాజ్ పార్టీ(BJP)తో పొత్తు పెట్టుకుంది. జాట్‌ల తర్వాత హర్యానాలో దళితులకే అత్యధిక ఓటు బ్యాంకు ఉంది. రాష్ట్రంలో 17 సీట్లు దళితులకు రిజర్వు కాగా, దళిత ఓటుబ్యాంకు 35 స్థానాల్లో గెలుపోటములను ప్రభావితం చేయగలదు. జాట్, దళిత నాయకత్వాల కలయిక హర్యానా రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

కొద్ది నెలల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో దళితులకు రిజర్వు చేసిన అంబాలా, సిర్సా స్థానాల్లో బీజేపీ ఓడిపోయింది. కుమారి షెల్జా ఎదుగుదలతో దళితులు కాంగ్రెస్‌ను సీరియస్‌గా తీసుకోవడం ప్రారంభించారు. మరోవైపు దళిత ఓటుబ్యాంకులో గట్టి పట్టున్న మాయావతితో పాటు చంద్రశేఖర్ ఆజాద్ సైతం చాలా చురుగ్గా ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఒప్పందం ప్రకారం జేజేపీ, చంద్రశేఖర్ పార్టీకి 20 సీట్లు ఇవ్వగా, మిగిలిన 70 సీట్లలో ఆ పార్టీ పోటీ చేస్తుంది.

అదేవిధంగా హర్యానాలో బీఎస్పీ తన మూలాలను నిరంతరం బలోపేతం చేసుకుంటోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 87 స్థానాల్లో పోటీ చేసింది. ఒక్క సీటు కూడా గెలవకపోగా, 82 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయింది. అయినా సరే రాష్ట్రం మొత్తమ్మీద సగటున 4% ఓట్లు సాధించింది. ఈసారి ఇండియన్ నేషనల్ లోక్ దళ్‌(INLD)తో పొత్తు ద్వారా లబ్ది పొందాలని చూస్తోంది.

ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో జేజేపీకి 0.87 శాతం ఓట్లు వచ్చాయి. చంద్రశేఖర్ పార్టీ హర్యానాలో తొలిసారి తన సత్తా చాటాలని చూస్తోంది. అయితే ఉత్తరప్రదేశ్‌లో సాధించిన విజయంతో ఆ పార్టీ అధినేత చంద్రశేఖర్ ఆజాద్ ఉత్సాహంగా ఉన్నారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఐఎన్‌ఎల్‌డీకి 1.74 శాతం, బీఎస్‌పీకి 1.28 శాతం ఓట్లు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో జాట్-దళిత ఓట్లలో కొంత భాగాన్ని తమవైపుకు తీసుకురావచ్చని ఈ పార్టీలు భావిస్తున్నాయి. జేజేపీ కూటమిలో చంద్రశేఖర్ ఆజాద్ ద్వారా దళిత ఓట్లపై కన్నేయగా, ఐఎన్ఎల్డీ బీఎస్పీ ద్వారా దళిత ఓట్లను చీల్చే ప్రయత్నం చేస్తోంది. ఈ రెండు కూటములకు తోడు కాంగ్రెస్ ఇంకోవైపు, ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీ, కమ్యూనిస్టులు ఇంకోవైపు.. ఇలా మొత్తంగా బీజేపీకి వ్యతిరేకంగా ఇన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల రణరంగంలో బహుముఖ పోటీకి తెరలేపాయి. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పొత్తు రాజకీయాలు ఫలించకపోతే.. ఇన్ని పార్టీలు చీల్చుకునే ఓట్ల మధ్య తమ సాంప్రదాయ ఓటుబ్యాంకును నిలబెట్టుకుంటే చాలు గెలుపు సాధ్యపడుతుందని కమలదళం అంచనా వేస్తోంది.

బీజేపీ వ్యూహాన్ని పసిగట్టిన కాంగ్రెస్ నేతలు.. భావసారూప్య పార్టీలతో పొత్తు ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వకూడదని భావిస్తోంది. ఇందులో భాగంగానే రాహుల్ గాంధీ పొత్తులపై ఆలోచించాలని హర్యానా పార్టీ శ్రేణులకు సూచించారు. ఆ మేరకు ఆప్, సమాజ్‌వాది పార్టీలతో ఎన్నికల పొత్తులపై చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్, ఆప్ మధ్య పొత్తు విషయంలో ఇప్పటికే ఏకాభిప్రాయం కుదిరినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఆ పార్టీల మధ్య చర్చలు కొనసాగుతున్నట్లు సమాచారం. అలాగే ఎస్పీ, మరికొన్ని చిన్నా చితక పార్టీలతోనూ కాంగ్రెస్ నేతలు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.