Maharashtra Hanuman Chalisa Row: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామని సవాల్ విసిరిన అమరావతి ఎంపీ నవనీత్‌కౌర్ దంపతులు జైలు పాలయ్యారు. రెండు వర్గాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టినట్టు నవనీత్ దంపతులపై కేసు నమోదయ్యింది. శనివారం ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. రాణా దంపతులకు పోలీసు కస్టడీకి నిరాకరించిన బాంద్రా కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. మే 6 వరకు జైల్లోనే ఉంటారు నవనీత్ దంపతులు. నవనీత్ రాణా దంపతుల బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది బాంద్రా కోర్టు.
ఈ క్రమంలో నవనీత్‌కౌర్ దంపతులు మరోసారి కోర్టులో బెయిన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈనెల 29వ తేదీన బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుగుతుంది. ముంబై పోలీసులు నవనీత్ రాణా దంపతులపై తాజాగా మరో కేసు పెట్టారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదయ్యింది. శనివారం ముంబైలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉద్దవ్ థాక్రే ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామన్న నవనీత్ రాణా ఇంటిని శివసేన కార్యకర్తలు ముట్టడించారు. శివసేన కార్యకర్తలపై రాణా దంపతులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆరుగురు శివసేన కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.
మహారాష్ట్రలో శాంతి కోసమే తాము సీఎం ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామని చెప్పామని నవనీత్ రాణా దంపతులు అంటున్నారు. ప్రధాని మోదీ ముంబై పర్యటన కారణంగా తాము ఆ కార్యక్రమాన్ని విరమించుకున్నప్పటికి పోలీసులు అరెస్ట్ చేశారని ఆరోపించారు నవనీత్ రాణా దంపతులు.
శివసేన నేతలు మాత్రం నవనీత్ రాణా దంపతుల అరెస్ట్‌ను పూర్తిగా సమర్ధించారు. మహారాష్ట్రలో అశాంతిని రేపడానికి బీజేపీ కుట్ర చేసిందని, ఆ కుట్రలో నవనీత్ రాణా దంపతులు భాగస్వాములని అన్నారు. తమ జోలికి వస్తే ఎవరిని వదిలే పెట్టే ప్రసక్తే లేదన్నారు.
Also Read: