Kerala: త్రితాలా ఉత్సవాల్లో హమాస్‌ లీడర్ల ఫొటోలతో ఏనుగులపై ఊరేగింపు.. బీజేపీ ఫైర్..

కేరళ పాలక్కాడు జిల్లా ఉర్సు ఉత్సవాల్లో హమాస్‌ లీడర్ల ఫోటోలను ఏనుగు అంబారీ మీద ఊరేగించడం సంచలనం రేపింది. ఉగ్రవాదులకు అటు కాంగ్రెస్‌, ఇటు లెఫ్ట్‌ నేతలు సహకరిస్తున్నారని బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది. దీనిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది.. అయితే కాంగ్రెస్‌ నేతలు మాత్రం దీనిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు.

Kerala: త్రితాలా ఉత్సవాల్లో హమాస్‌ లీడర్ల ఫొటోలతో ఏనుగులపై ఊరేగింపు.. బీజేపీ ఫైర్..
Hamas Leaders' Images

Updated on: Feb 18, 2025 | 8:23 AM

భారత్‌లో పాలస్తీనా తీవ్రవాద సంస్థ హమాస్‌కు మద్దతు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కేరళ లోని పాలక్కాడు జిల్లా త్రితాలా ఉర్సు ఉత్సవాల్లో హమాస్‌ లీడర్ల ఫోటోలను ఏనుగులపై ఊరేగించడం తీవ్ర కలకలం రేపింది. హమాస్‌కు మద్దతుగా వాళ్లు బ్యానర్లు ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యేతో పాటు ఇతర నేతలు కూడా హాజరయ్యారు. అయితే.. కేరళ ఉర్సు ఉత్సవాల్లో హమాస్‌ లీడర్ల ఫోటోలను ప్రదర్శించడంపై బీజేపీ మండిపడింది. అయితే కాంగ్రెస్‌ నేతలు మాత్రం దీనిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. సంఘ్‌ పరివార్‌ తప్ప భారత ప్రజలంతా పాలస్తీనా వాసులకు అండగా ఉన్నారని… త్రితాలా ఉర్సు ఉత్సవాలతో ఒక మతానికి సంబంధం లేదని, మతాలకు అతీతంగా స్థానికులు అందులో పాల్గొంటారని స్థానిక నేతలు చెబుతున్నారు.

నిర్వాహకులపై కేసు నమోదు చేయాలి: బీజేపీ డిమాండ్‌

అయితే, నిర్వాహకులపై కేసు నమోదు చేయాలని బీజేపీ డిమాండ్‌ చేస్తోంది. కేరళలో పరిస్థితికి ఇది అద్దం పడుతోందని విమర్శించారు బీజేపీ నేతలు. రాష్ట్రంలో అధికార సీపీఎం నేతలతో పాటు విపక్ష కాంగ్రెస్‌ నేతలు మత రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.

గతంలో పాలస్తీనా ప్రజలను ఉద్దేశించి హమాస్‌ నేత చేసిన ప్రసంగాన్ని కేరళలో ప్రత్యక్షప్రసారం చేయడాన్ని కూడా బీజేపీ నేతలు ప్రస్తావిస్తున్నారు. దీంతో దేశ సమగ్రతకు భంగం వాటిల్లుతుందని చెబుతున్నారు. పోలీసులు ఇప్పటివరకు ఈ ఘటనపై కేసు నమోదు చేయలేదు. ఎవరు తమకు ఫిర్యాదు చేయలేదని , అందుకే కేసు నమోదు చేయలేదని పోలీసులు చెబుతున్నారు.

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో కొద్దిరోజుల క్రితమే ఉగ్రవాదుల సమావేశానికి హమాస్‌ నేతలు హాజరయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో కేరళలో వాళ్ల నేతల ఫోటోలను ఏనుగులపై ఊరేగించడం కలకలం రేపుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..