Gujarat Rains: గుజరాత్‌ను ముంచెత్తిన భారీ వర్షాలు.. రెండ్రోజుల్లో 22 మంది మృతి!

మూడు వారాల పాటు స్తబ్దుగా ఉన్న నైరుతి రుతుపవనాలు తిరిగి వేగం పుంజుకున్నాయి. దేశంలోని పలు ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గుజరాత్ సహా పశ్చిమ తీర ప్రాంతాల్లోని రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గుజరాత్‌ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 22 మంది ప్రాణాలు కోల్పోయారు

Gujarat Rains: గుజరాత్‌ను ముంచెత్తిన భారీ వర్షాలు.. రెండ్రోజుల్లో 22 మంది మృతి!
Gujarat Floods

Updated on: Jun 18, 2025 | 10:20 PM

.గుజరాత్, గోవా సహా మహారాష్ట్రలోని ముంబైను వర్షాలు ముంచెత్తుతున్నాయి. గుజరాత్‌లో వర్షాల కారణంగా రెండు రోజుల్లో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. రుతుపవనాల ప్రభావం మహారాష్ట్రలో పలు ప్రాంతాలతోపాటు ఆర్థిక రాజధాని ముంబై తీవ్రంగా ఉంది. ముంబై నగరం, శివారు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల భారీగా ట్రాఫిక్‌ జామ్‌లు ఏర్పడి, సబర్బన్‌ రైళ్లు, మెట్రో రైళ్ల సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది. భారీ వర్షాలతో పొవాయ్ లేక్ పూర్తిగా నిండి పొంగి పొర్లుతోంది.

గుజరాత్‌లోని బోటాడ్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. తొమ్మది ప్రయాణికులతో కూడిన కారు నదిలో కొట్టుకుపోయింది. వీరిలో ఇద్దరిని మాత్రమే స్థానికులు రక్షించగలిగారు నలుగురు మృతిచెందారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. వీరికోసం ఎన్డీఆర్ఎఫ్ గాలింపు కొనసాగుతోంది. భారీ వర్షాల కారణంగా బోటాడ్ జిల్లా తీవ్రంగా ప్రభావితమైంది. మంగళవారం ఒక్కరోజే జిల్లాలో 18మంది ప్రాణాలు కోల్పోయారు.

భారీ వర్షాల కారణంగా ఖాంబోద డ్యామ్ గేట్లు ఎత్తివేయడంతో బోటాడ్ జిల్లాలో దిగువ ప్రాంతాలు జలమయ్యాయి. పలు పట్టణాలు, గ్రామాల్లోకి నీరు ప్రవేశించింది. ప్రజలలను పశువులను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఆమ్రేలి జిల్లా సైత వర్షాలతో తీవ్రంగా ప్రభావితమైంది. ఇదిలా ఉండగా అటు బావ్ నగర్‌ను సైతం వర్షాలు వీడటంలేదు. భారీ వర్షాలతో సౌరాష్ట్ర, చుట్టు పక్కల ప్రాంతాలు జలమయమయ్యాయి. నివాస స్థలాలు కొట్టుకుపోయాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ముందు జాగ్రత్తగా భావనగర్‌లో పాఠశాలు, విద్యాసంస్థలను మూసివేశారు.

మరోవైపు బుధవారం నుంచి మరో ఆరురోజులపాటు గుజరాత్‌, సౌరాష్ట్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని ఐఎండీ వెల్లడించింది. అటు ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్, మధ్య ప్రదేశ్‌, ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లో సైతం నైరుతి పవనాల కారణంగా భారీవర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది. వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని ఐంఎండీ హెచ్చరించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..