దేశంలో సెకండ్ కరోనా వేవ్ దృష్ట్యా మళ్ళీ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్లకు, కర్ఫ్యూ వంటి ఇతర కఠిన ఆంక్షలకు దిగుతుండడంతో,,తిరిగి గత ఏడాది నాటి పరిస్థితులు పునరావృతమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. వలస కూలీలు అప్పుడే తమ స్వరాష్ట్రాలకు కదులుతున్నారు. అలాగే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కూడా బెంబేలెత్తుతున్నాయి. కోవిడ్ విజృంభణతో పలు రాష్ట్రాలు క్రమంగా ఆర్ధిక క్షీణతను ఎదుర్కొంటున్నాయి. దీంతో గత ఏడాదిలాగే ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం రెండో విడత ఆర్ధిక ప్యాకేజీపై దృష్టి నిలిపింది. చిన్నా, చితకా పరిశ్రమలను, కార్మికులను, వలస కార్మికులను ఆదుకునేందుకు నడుం బిగించినట్టు ఆర్ధిక శాఖవర్గాలు తెలిపాయి. 2020 లో దేశ వ్యాప్త లాక్ డౌన్ విధించిన పరిస్థితుల్లో… ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం గత ఏడాది మార్చి 26, మే 17 మధ్య భారీ ఎకనామిక్ ప్యాకేజీని ప్రకటించింది. 20.97 లక్షల కోట్ల విలువైన పలు సంక్షేమ పథకాలను ప్రకటించింది.
తాజాగా రెండో విడత ఆర్ధిక ప్యాకేజీ కోసం ఆర్ధిక మంత్రిత్వ శాఖ కసరత్తు ప్రారంభించే యోచనలో ఉండడంతో రిజర్వ్ బ్యాంకు, ఇతర శాఖలు ముఖ్య స్టేక్ హోల్డర్లతో టచ్ లో ఉంటున్నాయి..ఏ క్షణమైనా తమకు ఫైనాన్స్ శాఖ నుంచి పిలుపు అందవచ్చునని భావిస్తున్నాయి.ఢిల్లీ, మహారాష్ట్ర, యూపీ, రాజస్తాన్ వంటి రాష్ట్రాలు ఇప్పటికే లోకల్ లాక్ డౌన్లను, కర్ఫ్యూను ప్రకటించాయి. ఈ నేపథ్యంలో తిరిగి ఆత్మ నిర్భర్ వంటి పథకాలను ప్రభుత్వం ప్రకటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. తాజా ప్యాకేజీ కింద గతంలో కన్నా ఎక్కువగా కొన్ని లక్షల కోట్ల విలువైన సంక్షేమ ప్రతిపాదనలను ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించవచ్చు. ఈ మేరకు త్వరలో ప్రభుత్వ ప్రకటన వెలువడవచ్చునని భావిస్తున్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ :Telangana corona: తెలంగాణ మరోసారి కోరలుచాస్తున్న మహమ్మారి.. కొత్తగా 5926 మందికి పాజిటివ్, 18 మంది మృతి
తామరతంపరగా కోవిడ్ కేసుల వెల్లువ, ఇండియాను బ్రిటన్ రెడ్ లిస్టులో చేర్చింది.. అంటే ?