పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ కర్ . సీఎం మమతా బెనర్జీ మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. అత్యవసరంగా మాట్లాడాలని నిన్న రాత్రి 10 గంటల 47 నిముషాలకు మీకు మెసేజ్ ఇస్తే, మీరు పట్టించుకోలేదంటూ ఆయన ఆమె మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. బరక్ పూర్ లో మనీష్ శుక్లా అనే బీజేపీ నేతను దుండగులు కాల్చి చంపారని, ఆ ఘటన గురించి మాట్లాడాలని తాను భావించి మెసేజ్ ఇస్తే దానికి మీనుంచి స్పందన లేదని జగదీప్ అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారిపోతున్నాయని ఆయన ఆరోపించారు. పోలీస్ అధికారులు కూడా దాదాపు తన మాటకు విలువ ఇవ్వడంలేదని ఆయన వాపోయారు. అయితే గవర్నర్ మెసేజ్ విషయంలో మమత నో కామెంట్ అన్నట్టు వ్యవహరించారు. ఆమెనుంచి ఏదైనా సమాధానం వస్తుందని ఆశించిన గవర్నర్ కి ఆశాభంగమే కలిగింది.