White Ration Cards: టీవీ, ఫ్రిడ్జ్ వున్నాయా? అయితే మీ తెల్ల రేషన్ కార్డు హుళక్కే..! ప్రభుత్వ సంచలన నిర్ణయం

|

Feb 15, 2021 | 7:10 PM

రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. టీవీ, ఫ్రిడ్జ్ వంటివి ఇంట్లో వుంటే తెల్ల రేషన్ కార్డులను సరెండర్ చేయాలని ప్రజలకు పిలుపునిచ్చింది. స్వచ్ఛందంగా సరెండర్ చేయకపోతే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించింది.

White Ration Cards: టీవీ, ఫ్రిడ్జ్ వున్నాయా? అయితే మీ తెల్ల రేషన్ కార్డు హుళక్కే..! ప్రభుత్వ సంచలన నిర్ణయం
Follow us on

Government sensational decision on Ration cards: మీ ఇంట్లో టెలివిజన్, రిఫ్రిజిరేటర్ (ఫ్రిడ్జ్) వున్నాయా? అయితే మీ తెల్ల రేషన్ కార్డు గల్లంతే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. టీవీ, ఫ్రిడ్జ్ వుంటే మీరు రేషన్ కార్డు ద్వారా సబ్సిడీపై లభించే రేషన్ వస్తువులకు అర్హులు కాదని తేల్చింది రాష్ట్ర ప్రభుత్వం.

దారిద్య్ర రేఖకు దిగువన నివసించే పేద ప్రజలకు ఇచ్చిన రేషన్‌ కార్డులపై సంచలన నిర్ణయం తీసుకుంది కర్నాటకలోని యడియూరప్ప సర్కార్. టీవీ, ఫ్రిడ్జ్‌, ద్విచక్రవాహనం లాంటివి వున్న వారు తెల్ల రేషన్‌ కార్డును స్వచ్ఛందంగా వదులుకోవాలని ఆదేశించింది యడ్డీ ప్రభుత్వం. లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. టీవీ, ఫ్రిడ్జ్, టూ వీలర్ వున్న వారు ప్రభుత్వం సబ్సిడీ మీద అందించే నిత్యావసర వస్తులకు అర్హులు కాదని కర్నాటక రాష్ట్ర ఆహారం, ప్రజాపంపిణీ శాఖ మంత్రి ఉమేశ్‌ కత్తి సోమవారం (ఫిబ్రవరి 15న) మీడియా సమావేశంలో వెల్లడించారు.

‘‘రేషన్‌ కార్డులు పొందేందుకు కొన్ని షరతులు, పరిమితులు ఉన్నాయి. తెల్ల రేషన్ కార్డు తీసుకోవాలంటే ఐదెకరాల కంటే ఎక్కువ వ్యవసాయ భూమికి ఓనర్ అయి ఉండ కూడదు. టీవీ, ఫ్రిడ్జ్‌, మోటార్‌సైకిల్‌ లాంటివి ఉండకూడదు. ఇవి ఉన్న తెల్ల రేషన్‌ కార్డుదారులు 2021 మార్చి 31లోగా కార్డులను ప్రభుత్వానికి సరెండర్ చేయాలి.. లేదంటే వారిపై కఠిన చర్యలు తప్పవు. రూ. 1.20లక్షల కంటే ఎక్కువ వార్షికాదాయం పొందేవారు తెల్ల రేషన్‌ కార్డులు ఉపయోగించకూడదు’’ అని ఉమేశ్ ప్రకటించారు.

మంత్రి వ్యాఖ్యలను ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఖండించింది. రాష్ట్రవ్యాప్తంగా పలు రేషన్‌ దుకాణాల ఎదుట పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ‘‘టీవీ, ఫ్రిడ్జ్‌ లాంటివి ఇప్పుడు నిత్యావసరమయ్యాయి. వడ్డీ రహిత రుణాలు వంటి ఆఫర్లు వచ్చినప్పుడు సాధారణంగానే ప్రజలు ఇలాంటివన్నీ కొనుక్కుంటారు. అంతమాత్రానికే వారికి రేషన్‌ తొలగించడం సరికాదు. ఈ ప్రభుత్వం పేదలను వ్యతిరేకంగా పనిచేస్తోంది’’ అని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఖాదర్‌ సర్కారుపై విమర్శలు గుప్పించారు.

కర్నాటక మంత్రి మాటలిపుడు ఆ రాష్ట్రంలో రాజకీయ రచ్చను రాజేశాయి. కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ మంత్రి మాటలను ఖండించాయి. పలు సంఘాలు ఆందోళనకు శ్రీకారం చుట్టాయి. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. అయితే, మంత్రి ప్రకటనకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు జారీ అయినట్లు సమాచారమేదీ లేదని పౌరసరఫరాల శాఖ అధికారులు అంటుండడం విశేషం.

Also Read: యూటీ ప్రకటనతో రాజకీయ కలకలం.. అసదుద్దీన్ వ్యూహమేంటి?

Also Read: ప్రజల మీదికి ఖైదీల అస్త్రం.. సైన్యం నిర్ణయంపై ఆగ్రహం