
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న సంఘర్షణ ఎల్ఎన్‌జీ సరఫరాను తీవ్రంగా ప్రభావితం చేసింది. ముఖ్యంగా భారతదేశంలో సహజ వాయువు సరఫరాలపై ఒత్తిడి పెరుగుతోంది. దీనికి ప్రతిస్పందనగా, భారత ప్రభుత్వం నిత్యావసర వస్తువుల చట్టం, 1955లోని సెక్షన్ 3 కింద ఒక కీలకమైన ఉత్తర్వును జారీ చేసింది. పెట్రోలియం, సహజ వాయువు ఉత్తర్వు, 2026 ప్రకారం, దేశంలోని అన్ని చమురు, సహజ వాయువు కంపెనీలు తమ డేటాను పెట్రోలియం ప్లానింగ్ & అనాలిసిస్ సెల్ (PPAC)కు తప్పనిసరిగా అందించాలని భారత ప్రభుత్వం ఆదేశించింది.
దీంతో ప్రభుత్వ లేదా ప్రైవేట్ కంపెనీ ఏదైనా సరే, ఇప్పుడు ఏ కంపెనీ కూడా PPACకు డేటాను అందించడానికి నిరాకరించకూడదు. ఆ సమాచారం వాణిజ్యపరంగా సున్నితమైనది. యాజమాన్య హక్కులు కలిగినదని వాదించి ఏ కంపెనీ కూడా తప్పించుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వానికి ప్రతి కంపెనీకి సంబంధించిన పూర్తి అకౌంటింగ్ రికార్డులకు సంబంధించి సమాచారం లభిస్తుంది. ముడి చమురు ఉత్పత్తిదారులు, దిగుమతిదారులు, చమురు శుద్ధి కర్మాగారాలు, చమురు మార్కెటింగ్ కంపెనీలు, సహజ వాయువు ఉత్పత్తిదారులు, ఎల్ఎన్‌జీ దిగుమతిదారులు, గ్యాస్ పైప్‌లైన్ ఆపరేటర్లు, సిటీ గ్యాస్ పంపిణీ కంపెనీలు, పెట్రోకెమికల్ ప్లాంట్లు, అనగా ప్రభుత్వ రంగ సంస్థలైన ఓఎన్‌జీసీ, గెయిల్, ఐఓసీ, బిపిసిఎల్, హెచ్‌పిసిఎల్ నుండి ప్రైవేట్ రంగ సంస్థలైన రిలయన్స్, అదానీ గ్యాస్ వరకు.. ప్రతి చిన్న, పెద్ద కంపెనీ ఈ ఉత్తర్వు పరిధిలోకి వస్తాయి.
ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం, కంపెనీలు ఉత్పత్తి, దిగుమతి, ఎగుమతి, నిల్వ, కేటాయింపు, రవాణా, సరఫరాతో పాటు వినియోగం, ఉపయోగం గురించి పూర్తి సమాచారాన్ని ప్రభుత్వానికి ఇవ్వవలసి ఉంటుంది. అంటే ఎంత చమురు లేదా గ్యాస్ ఉత్పత్తి అవుతోంది, ఎంత దిగుమతి అవుతోంది, ఎంత బయటకు పంపిణీ చేస్తున్నారు, ప్రస్తుతం ఎంత నిల్వ ఉంది, ఎవరికి ఎంత ఇస్తున్నారు, ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకువెళుతున్నారు, మార్కెట్‌కు ఎంత చేరుతోంది. ఎంత ఉపయోగించబడుతోంది అనే వివరాలు ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది.
ప్రభుత్వం ఇంత పెద్ద చర్య తీసుకోవడానికి కారణం ఏమిటి? అంటే ఖతార్‌లోని రాస్ లఫాన్‌పై జరిగిన దాడి తరువాత, ప్రపంచవ్యాప్త LNG సరఫరాలు 20% వరకు ప్రభావితమయ్యాయి. హోర్ముజ్ జలసంధి మూసివేత భారత చమురు నౌకల రాకపోకలకు ఆటంకం కలిగించింది. అందువల్ల, దేశంలోని వాస్తవ చమురు, గ్యాస్ నిల్వలను, ఎక్కడ కొరత ఉందో, ఎక్కడ రేషనింగ్ అవసరం కావచ్చునో ప్రభుత్వం అర్థం చేసుకోవడం చాలా కీలకం. PPACకు రియల్-టైమ్ డేటా అందుబాటులో ఉండటం వలన ప్రభుత్వం సకాలంలో నిర్ణయాలు తీసుకోగలుగుతుంది. అంటే, రాబోయే వారాల్లో గ్యాస్ కొరత మరింత తీవ్రమైతే, మొదట ఎక్కడ సహాయం అందించాలి, ఎక్కడ సరఫరాను నియంత్రించాలి అనే దానిపై ప్రభుత్వానికి పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..