Goa: వెలవెలబోతున్న గోవా.. పడకేసిన పర్యాటకం

|

Jan 03, 2025 | 5:41 PM

గోవా గడ్డు పరిస్థితులు ఎదుర్కొటుంది. ఇలానే కొనసాగితే.. అక్కడ ఆదాయం భారీగా పడిపోయే అవకాశం ఉంది. డిసెంబర్ 31 కోసం.. దేశవిదేశాల నుంచి గోవాకు తరలివస్తారు పర్యాటకులు. కానీ ఇప్పుడు సీన్ మారింది. రిసార్టులు, హోటల్స్ సహా బీచ్‌లు అన్నీ ఖాళీగా ఉన్నాయి. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..

Goa: వెలవెలబోతున్న గోవా.. పడకేసిన పర్యాటకం
Goa
Follow us on

గోవాకు టూరిస్టుల రాక తగ్గిపోవడం నిజమే అంటున్నారు పరిశీలకులు. గత రెండేళ్లుగా జరుగుతున్న పరిణామాల పర్యవసానం ఇది అంటున్నారు వాళ్లు. గతంలో…దేశంలోనే టాప్‌ టూరిస్ట్‌ ప్లేస్‌ ఏది అంటే..ఠక్కున గుర్తుకొచ్చేది గోవా. అదో ప్రకృతి అందాల పాల కోవా. న్యూ ఇయర్‌ డెస్టినేషన్‌ అంటే అందరికి గుర్తుకొచ్చే మొదటి పేరు గోవా. పార్టీ చేసుకోవాలంటే చలో గోవా అంటారు. ఇక గోవా బీచ్‌లు స్వదేశీ, విదేశీ టూరిస్టులతో కిటకిటలాడుతుంటాయి. అయితే ఈసారి గోవాలో న్యూ ఇయర్‌ జోష్‌ పెద్దగా కనిపించలేదంటున్నారు. టూరిస్టుల సందడి లేక గోవా ఖాళీ అంటూ సోషల్‌ మీడియాలో వీడియోలు తెగ వైరల్‌ అవుతున్నాయి.

గత ఏడాది టూరిస్టులతో గోవా కళకళలాడిపోతే…ఈ న్యూ ఇయర్‌కి పర్యాటకులు లేక వెలవెలబోయింది. గోవాలో క్రిస్మస్ ముందు నుంచే న్యూఇయర్ సంబరాలు మొదలైపోతాయి. బీచ్‌లు, రెస్టారెంట్లు పర్యాటకులతో కిటకిటలాడుతుంటాయి. రోడ్లపై కాలుపెట్టడానికి కూడా ఖాళీ ఉండదు. ఎటుచూసినా సందడిగా కనిపిస్తుంది. అలాంటి గోవాకు ఏమైందో ఏమో తెలియదు కానీ అక్కడకు వెళ్లేందుకు టూరిస్టులు ముఖం చాటేస్తున్నారు. ఈ న్యూ ఇయర్‌కు పర్యటకులు లేక గోవా బీచ్‌లు, రోడ్లు వెలవెలబోయాయి. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట దర్శనమిస్తున్నాయి. అసలు టూరిస్టులు గోవాకు రావడం ఎందుకు తగ్గించారో తెలుసుకుందాం పదండి…

 

  • గోవాలో విదేశీ టూరిస్టులకే ప్రాధాన్యం
  • ఇండియన్స్‌ కంటే 4 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టే ఫారినర్స్‌
  • దీంతో భారతీయులను చిన్నచూపు చూస్తున్న వ్యాపారులు
  • గౌరవం తగ్గడంతో… గోవా ముఖం చూడని ఇండియన్స్‌
  • దీనికితోడు గోవాలో విపరీతంగా పెరిగిపోయిన హోటల్‌ అండ్‌ ఫుడ్‌ రేట్లు
  • మంచి సర్వీస్‌ అందించని రెస్టారెంట్‌ యాజమాన్యాలు
  • థాయ్‌ల్యాండ్‌లో కంటే ఎక్కువ రేట్లు ఉన్నాయని కంప్లయింట్లు
  • మరోవైపు గోవాలో భారతీయులపై పెరుగుతున్న దాడులు
  • నెల రోజుల్లో ముగ్గురిపై దాడి
  • తాజా దాడిలో ఏపీ యువకుడు మృతి
  • దోపిడి పాల్పడుతున్న కొందరు పోలీసులు

కర్ణుడి చావుకు పలు కారణాలు అన్నట్లు…ఈ కారణాలన్నీ కలిసి గోవాను పర్యాటకులకు దూరం చేశాయన్నది నిజం. తాజాగా గోవాలో జరిగిన ఘోరమైన దాడిలో తాడేపల్లిగూడెంకు చెందిన రవితేజ మృతి చెందారు. న్యూ ఇయర్‌ వేడుకల కోసం ఏపీ నుంచి 8 మంది మిత్రబృందం గోవా వెళ్లింది. హోటల్లో ఫుడ్ ఆర్డర్‌ తీసుకునే విషయంలో తలెత్తిన వివాదంతో ఘర్షణ జరిగినట్టు తెలుస్తోంది రాత్రి 1గంట సమయంలో అదనపు ఫుడ్‌ ఆర్డర్లు తీసుకోవడానికి రెస్టారెంట్‌ నిర్వాహకులు నిరాకరించడంతో వాగ్వాదం మొదలైనట్టు తెలుస్తోంది. కలంగుటే బీచ్‌లోని మెరీనా షాక్ దగ్గర మాటామాటా పెరగడంతో హోటల్‌ సిబ్బంది….రవితేజపై కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడిలో తీవ్రగాయాలతో తేజ మృతి చెందినట్టు నార్త్ గోవా ఎస్పీ అక్షత్ కౌశల్ తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు నేపాల్ కు చెందిన హోటల్‌ యజమాని అగ్నెల్ సిల్వేరా అతని కుమారుడు షుబర్ట్ సిల్వేరియా, అక్కడ పనిచేసే సిబ్బంది అనిల్ బిస్తా , సమల్ సునార్లను అరెస్టు చేశారు.

అయితే రెస్టారెంట్‌ లోని కొందరు, యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని, అదే విషయంలో గొడవ జరిగిందంటున్నారు మృతుని బంధువులు. బాధితుల సమాచారంతో…ఏపీ సర్కార్‌ రంగంలోకి దిగింది. గోవా ప్రభుత్వ అధికారులతో మాట్లాడి రవితేజ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి ప్రత్యేక విమానంలో తాడేపల్లిగూడెంకి తరలించారు.

ఈ కారణాలతోనే గోవాకు వెళ్లడానికి దేశీ టూరిస్టులు సుముఖత చూపించడం లేదు. అయితే ఇదంతా గోవాకు వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం అంటున్నారు ఆ రాష్ట్ర సీఎం ప్రమోద్‌ సావంత్‌. దేశ ప్రజలంతా గోవాకు రావాలని ఆయన ఆహ్వానించారు.

అయితే టూరిస్టులు రాక, వాళ్ల సందడి లేక, గోవాలో కాక పుడుతోంది. గోవా సర్కార్‌తో పాటు అక్కడి స్థానికులకు కూడా ఇది మేల్కొలుపు లాంటిది. ఎడాపెడా రేట్లతో బాదకుండా, స్వదేశీ టూరిస్టులకు కూడా తగిన గౌరవమర్యాదలు ఇస్తే…గోవాలో పర్యాటకం మళ్లీ పట్టాలెక్కడం ఖాయం అంటున్నారు పరిశీలకులు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..