BJP MLA Atanasio Monserrate: గోవాలో బీజేపీ మళ్లీ ప్రభంజనాన్ని సృష్టించి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది. 20కి పైగా సీట్లల్లో ముందంజలో ఉండగా.. బీజేపీకి ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు మద్దతునిస్తున్నట్లు ప్రకటించారు. అయితే.. మాజీ రక్షణ మంత్రి దివంగత మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్ 716 ఓట్ల తేడాతో బీజేపీకి చెందిన అటానాసియో మోన్సెరేట్ (బాబూష్) చేతిలో ఓడిపోయారు. బీజేపీ టికెట్ నిరాకరించడంతో ఉత్పల్ పారికర్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. అయితే.. అతి తక్కువ ఓట్లతో మోన్సెరేట్ చేతిలో ఓడిపోయారు. అయితే.. గెలుపు అనంతరం బీజేపీ అభ్యర్థి మోన్సెరేట్ (Mr Monserrate) మాట్లాడుతూ.. తన గెలుపు తాను సంతోషంగా లేనంటూ వ్యాఖ్యానించారు. చాలా మంది BJP మద్దతుదారులు తనకు ఓటు వేయలేదంటూ తన అసంతృప్తిని వ్యక్తంచేశారు. తనకు మద్దతు ఇవ్వడం లేదన్న విషయాన్ని బీజేపీ నేతలకు చెప్పానని.. భవిష్యత్‌లో జాగ్రత్త వహించాలని సూచించినట్లు పేర్కొ్న్నారు. ఈ సందర్భంగా మోన్సెరేట్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర బీజేపీ యూనిట్ ప్రజలకు సరైన సందేశం ఇవ్వలేదన్నారు.
తాను బీజేపీ నేతలందరితో టచ్‌లో ఉన్నానని.. బీజేపీతోనే కలిసినడుస్తానంటూ పేర్కొన్నారు. ఈ ఫలితంతో సంతృప్తి చెందలేదని.. చాలా మంది హార్డ్‌కోర్ బిజెపి ఓటర్లు ఉత్పల్‌కి ఓటు వేశారన్నారు. అందుకే ఉత్పల్‌కు చాలా ఓట్లు వచ్చాయంటూ పేర్కొన్నారు. గోవాలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని మోన్సెరేట్ అన్నారు. ప్రమోద్ సావంత్ మా ముఖ్యమంత్రి అవుతారని ఆయన తెలిపారు. తనకు వ్యతిరేకంగా బీజేపీ నేతలు ప్రచారం చేశారని భావిస్తున్నారా అని ఓ జాతీయ మీడియా అడిగిన ప్రశ్నకు.. సమాధానమిస్తూ.. ప్రజలకు సందేశాన్ని తెలియజేయడంలో పార్టీ నాయకత్వం విఫలమైందంటూ పేర్కొన్నారు.
కాగా.. గోవాలో మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మనోహర్ పారికర్ 25 ఏళ్ల పాటు పనాజీ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించారు. 2019లో ఆయన మరణానంతరం జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మోన్సెరేట్ గెలుపొందారు. ఆ తర్వాత మోన్సెరేట్ బీజేపీలో చేరారు.
Also Read: