Russia-Ukraine Conflict: ఓవైపు కోవిడ్-19 మహమ్మారి విసిరిన పంజాతో విలవిల్లాడుతున్న ప్రపంచంపై రష్యా – ఉక్రెయిన్ యుద్ధం కోలుకోలేని దెబ్బకొడుతోంది. దాదాపు రెండు నెలలు కావొస్తున్నా కొనసాగుతున్న యుద్ధం కేవలం ఆ రెండు దేశాలనే కాదు.. యుద్ధంతో అసలేమాత్రం సంబంధం లేని ప్రపంచ దేశాలు సైతం తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. ప్రపంచానికి బ్రెడ్ బాస్కెట్‌గా పేరుగాంచిన ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధం ఇప్పటికే ప్రపంచంలో ఆహార ధరలను సామాన్యులు అందుకోలేని స్థాయికి తీసుకెళ్లింది. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO) ఆహార ధరల సూచి ఇప్పటికే 12.6 శాతం పెరిగింది. ఇక తృణధాన్యాలు, పప్పుదినుసుల ధరలు మార్చి నాటికే 33% పెరిగాయి. ప్రపంచంలోని ప్రధానమైన ఆహార పదార్థాల్లో ఒకటైన గోధుమ ధర 19.7 శాతం మేర పెరిగాయి. ప్రపంచంలో గోధుమలను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో రష్యా, ఉక్రెయిన్ రెండూ ముందున్నాయి. ప్రపంచ అవసరాలకు ఈ రెండు దేశాలు కలిపి 30 శాతం మేర ఎగుమతి చేస్తున్నాయి. అలాగే 20 శాతం మేర మొక్కజొన్న అవసరాలను తీరుస్తున్నాయి. నూనె గింజల్లో పొద్దుతిరుగుడు పువ్వు (సన్ ఫ్లవర్) గింజల ఉత్పత్తిలో ఉక్రెయిన్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. అలాంటి దేశాలు వ్యవసాయ క్షేత్రాలను వీడి యుద్ధభూమిలో తలపడుతుండడంతో ఆ మేరకు ఏర్పడుతున్న ఆహార పదార్థాల కొరత పుష్కరకాల వ్యవధిలో ప్రపంచాన్ని మూడోసారి ఆహార సంక్షోభం దిశగా తీసుకెళ్తోంది.
యుద్ధం – పేద దేశాలకు శాపం
రష్యా – ఉక్రెయిన్ పేద, ధనిక అన్న తేడా లేకుండా ప్రపంచంలోని అన్ని దేశాలనూ ఏదో ఒక విధంగా ప్రభావితం చేస్తున్నప్పటికీ, పేద దేశాలపై ఆ ప్రభావం తీవ్రంగా ఉంది. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి రోజూ 69 కోట్ల మంది ప్రజలు ఆకలితోనే నిద్రపోతున్నారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా మధ్యస్థ ఆదాయ దేశాలు, తక్కువ ఆదాయ దేశాలు తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నాయి. పేద ప్రజల జీవనోపాధిని ఈ మహమ్మారి దారుణంగా దెబ్బతీసింది. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా ఈ దేశాలపై యుద్ధం మరింత తీవ్రంగా ప్రభావం చూపుతోంది. భారతదేశానికి ఇరుగుపొరుగునున్న శ్రీలంక, పాకిస్తాన్ వంటి దేశాల్లోనే ఈ ప్రభావం స్పష్టం కనిపిస్తోంది. ఆఫ్రికా దేశాలు ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా ప్రభావితమవుతున్నాయి.
ప్రపంచ ఆహార సంక్షోభం తప్పదా?
మారుతున్న వాతావరణ పరిస్థితులు, ఎల్-నినో వంటి సహజసిద్ధ ప్రతికూల వాతావరణ స్థితిగతుల కారణంగా ప్రపంచం ఒకటిన్నర దశాబ్ద కాలంలో ఇప్పటికే 2 సార్లు ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంది. అగ్నికి ఆజ్యం పోసిన చందంగా ముడి చమురుకు ప్రత్యామ్నాయంగా ఇథనాల్ ఉత్పత్తి కోసం చాలా దేశాలు ఆహార దినుసులకు బదులుగా చెరకు పంటను ఎక్కువ మొత్తంలో సాగు చేయడం కూడా ఆహార సంక్షోభ తీవ్రతను పెంచుతోంది. 2011లో ఏర్పడ్డ ఆహార సంక్షోభానికి రష్యా, ఉక్రెయిన్ దేశాల్లో నాడు నెలకొన్న కరవు పరిస్థితులే కారణమయ్యాయి. అయితే ఆనాటి కరవుకు ప్రతికూల వాతావరణ పరిస్థితులు కారణమవగా, ఈసారి ఏర్పడబోతున్న సంక్షోభం మాత్రం పూర్తిగా మానవ తప్పిదమే.
శ్రీలంకలో నెలకొన్న సంక్షోభానికి కోవిడ్-19 సగం కారణమైతే, మిగతా సగం నాయకత్వం తప్పిదాలే. పర్యాటకమే ప్రధాన ఆదాయవనరుగా ఉన్న ఈ దేశం రెండేళ్లుగా కోవిడ్-19 కారణంగా పర్యాటక ఆదాయాన్ని కోల్పోయింది. తద్వారా విదేశీ మారక నిల్వలు పూర్తిగా తరిగిపోయాయి. సరిగ్గా ఇదే సమయంలో రాజపక్స నేతృత్వంలోని ప్రభుత్వం దేశంలో సేంద్రీయ సాగును తప్పనిసరి చేస్తూ రసాయన ఎరువుల దిగుమతిని నిషేధించింది. దీంతో ఒక్కసారిగా పంట దిగుబడి సగానికి పైగా పడిపోయింది. విదేశీ మారక నిల్వలు లేకపోవడంతో దిగుమతులు సైతం చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా దేశం తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంలోకి వెళ్లిపోయింది.
పాకిస్తాన్ పరిస్థితి సైతం ఇంతకంటే గొప్పగా ఏమీ లేదు. అక్కడి రాజకీయ అస్థిరత ఆ దేశాన్ని సంక్షోభం అంచుల్లోకి నెట్టేస్తుంది. అఫ్ఘనిస్తాన్‌లోనూ అదే పరిస్థితి. అక్కడ లక్షల సంఖ్యలో చిన్నారులు కరవు, క్షామంతో అల్లాడుతున్నారు.
ఆసియా దేశాల కంటే ఆఫ్రికా దేశాల పరిస్థితి మరీ దారుణం. హెచ్ఐవీ, ఎబోలా వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలినప్పుడు తప్ప ఆ దేశాల గురించి మిగతా ప్రపంచం ఎప్పుడూ పట్టించుకోదనే వాదన కూడా ఉంది. యూనిసెఫ్ (UNICEF) అంచనాల ప్రకారం ఆఫ్రికాలో 90 శాతం పిల్లలకు కనీస ఆహారం అందడం లేదు. ప్రపంచవ్యాప్తంగా గణాంకాలను విశ్లేషిస్తే.. ప్రతి 3 సెకన్లకు ఒక చిన్నారి ఆకలితో ప్రాణాలు విడుస్తున్న దుస్థితి నెలకొంది. అంటే ప్రతి రోజూ 10,000 మంది చిన్నారులు ఆకలి కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తలెత్తిన రష్యా – ఉక్రెయిన్ యుద్ధం ఆఫ్రికా దేశాలను పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా చేసింది.
యుద్ధభూమిగా మారిన ప్రపంచ గోధుమ పాత్ర
ప్రపంచంలో గోధుమలను పెద్ద మొత్తంలో ఎగుమతి చేస్తున్న దేశాల్లో ఉక్రెయిన్, రష్యా ఉన్నాయి. ప్రపంచ అవసరాల్లో 10% గోధుమలు ఒక్క ఉక్రెయిన్ నుంచే ఎగుమతి అవుతున్నాయి. ఈజిప్ట్ వంటి 25 దేశాలు తమ అవసరాల్లో సగానికి పైగా ఉక్రెయిన్, రష్యా నుంచే దిగుమతి చేసుకుంటున్నాయి. యుద్ధం కారణంగా ఆహార సరఫరా నిలిచిపోవడంతో గోధుమ ధరలు ఇప్పటికే 42 శాతం పెరగ్గా, అది 50 శాతాన్ని దాటవచ్చని అంచనాలున్నాయి. ధరల పెరుగుదల తక్షణ ప్రభావంగా కనిపిస్తున్నప్పటికీ, అసలైన దుష్ప్రభావాలు రానున్న రోజుల్లో ఆహార సంక్షోభం, ఆకలిచావుల రూపంలో ప్రపంచాన్ని చుట్టేయనున్నాయి. ప్రపంచీకరణ పరిస్థితుల్లో యుద్ధం కారణంగా తలెత్తే దుష్ప్రభావాలు యుద్ధం చేసే దేశాల మీదనే కాదు, ప్రపంచంలోని అన్ని మూలలా వెనువెంటనే కనిపిస్తున్నాయి. రష్యా – ఉక్రెయిన్ యుద్ధం, రష్యాపై విధించిన ఆంక్షల కారణంగా ప్రపంచంలో చమురు, గ్యాస్, బొగ్గు సరఫరా తీవ్రంగా దెబ్బతిన్నాయి. చమురు ధరల్లో సంభవించే మార్పులు చమురును పెద్దమొత్తంలో దిగుమతి చేసుకుంటున్న భారత్ సహా దిగువ ఆదాయవర్గ దేశాల్లో నిత్యావసరాల ధరలను ప్రభావితం చేస్తాయి.
ఎరువుల కొరత
రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం ఆ దేశాలు పండించే పంటల ఎగుమతులపైనే కాదు, మిగతా ప్రపంచ దేశాల్లో పంటల సాగునే దెబ్బకొట్టనుంది. ఎందుకంటే, ప్రపంచంలో రసాయన ఎరువుల ఉత్పత్తి, ఎగుమతుల్లో రష్యా అగ్రస్థానంలో ఉంది. ప్రపంచానికి రష్యా నుంచి 23 శాతం మేర అమ్మోనియా ఎరువులు, 14 శాతం మేర యూరియా ఎరువులు, 10 శాతం మేర ఫాస్ఫేట్ ఎరువులు, 21 శాతం మేర పొటాష్ ఎరువులు ఎగుమతి అవుతున్నాయి. రష్యా మిత్రదేశం బెలారుస్ కూడా పొటాష్ ఆధారిత రసాయన ఎరువుల ఎగుమతుల్లో అగ్రభాగాన ఉంది. రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో బ్రెజిల్ (21 శాతం), చైనా (10 శాతం), అమెరికా (9 శాతం), ఇండియా (4 శాతం) మేర దిగుమతి చేసుకుంటున్నాయి. 2020లో రష్యా నుంచి 290 మిలయన్ డాలర్ల విలువైన రసాయన ఎరువులను భారత్ దిగుమతి చేసుకుంది. అయితే యుద్ధం కారణంగా రష్యా మీద విధించిన ఆంక్షల జాబితాలో ఎరువులను చేర్చనప్పటికీ, యుద్ధం కారణంగా సరఫరాలో అవాంతరాలు ఏర్పడి, ప్రపంచ ఎరువుల అవసరాలను దెబ్బతీసే ప్రమాదం ఉంది. సకాలంలో ఎరువులు రైతులకు అందకపోతే పంట క్యాలండర్ మారి దిగుబడిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అలాగే కొంతమేర ఎరువుల ధరలు పెరిగి రైతులకు మరింత భారంగా మారే అవకాశం కూడా ఉంది. భారత్ వంటి దేశాల్లో ఈ పరిస్థితులు ఇప్పటికే ఆకాశాన్నంటిన ఆహార ధరల్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లే ప్రమాదం పొంచి ఉంది.
భారత్ భవితవ్యం ఏంటి?
గత కొన్నేళ్లలో రుతుపవనాలు వ్యవసాయానికి సహకరించడంతో ఆహార దినుసుల ఉత్పత్తి దేశంలో రికార్డు స్థాయిలో పెరిగింది. 2021-22 లో ఆహార దినుసుల ఉత్పత్తి ఆల్ టైమ్ రికార్డ్ 316 మిలియన్ టన్నులను చేరవచ్చని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. అలాగే పప్పు దినుసులు, నూనె గింజలు, ఉద్యానవన పంటల ఉత్పత్తి కూడా రికార్డు స్థాయిలో పెరుగుతుందన్న అంచనాలున్నాయి. గోధుమల విషయంలో మిగులు నిల్వలున్న భారత్, ఆహార కొరత ఎదుర్కొంటున్న కొన్ని దేశాలకు అందించేందుకు ముందుకొచ్చింది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (WTO) నిబంధనలు సడలిస్తే, ఎగుమతి చేసేందుకు సైతం భారత్ సిద్ధంగా ఉంది. అయితే ఎరువుల సరఫరా ఏర్పడే అంతరాయం కారణంగా వచ్చే ఏడాది దిగుబడి మాత్రం ఆశాజనకంగా ఉండకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Also Read..
Costly Stock: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్టాక్ ఏంటో తెలుసా? ధర వింటే మూర్ఛ పోవాల్సిందే..