Gautam Gambhir: క్రియాశీల రాజకీయాలకు గుడ్‌బై.. బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ సంచలన నిర్ణయం..!

మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. క్రియాశీల రాజకీయాల నుంచి వైదొలగాలని ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజకీయ విధుల నుంచి తప్పించాలని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను గౌతమ్ గంభీర్ కోరారు. దీనికి సంబంధించి ఆయన సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది.

Gautam Gambhir: క్రియాశీల రాజకీయాలకు గుడ్‌బై.. బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ సంచలన నిర్ణయం..!
Gautam Gambhir

Updated on: Mar 02, 2024 | 11:58 AM

మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. క్రియాశీల రాజకీయాల నుంచి వైదొలగాలని ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజకీయ విధుల నుంచి తప్పించాలని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను గౌతమ్ గంభీర్ కోరారు. దీనికి సంబంధించి ఆయన సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. గౌతమ్ గంభీర్ 2019 మార్చి నెలలో బీజేపీలో చేరారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గౌతమ్ గంభీర్‌కు బీజేపీ టికెట్ దక్కే అవకాశం లేదని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోవాలని గంభీర్ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

క్రికెట్‌కు సంబంధించిన బాధ్యతలపై దృష్టిసారించాల్సి ఉన్నందున.. రాజకీయ విధుల నుంచి తప్పించాలని పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కోరినట్లు గంభీర్ తెలిపారు. ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం కల్పించినందుకు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయాల నుంచి తప్పుకోవాలన్న గంభీర్ నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతోంది.

గౌతమ్ గంభీర్ ట్వీట్..

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా ఒకట్రెండు రోజుల్లో విడుదలయ్యే అవకాశముంది. అభ్యర్థుల ఖరారుకు సంబంధించి బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ రెండ్రోజుల క్రితం ఢిల్లీలో సమావేశమై సుదీర్ఘంగా చర్చించింది. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు 100 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను బీజేపీ ఏ క్షణంలోనైనా విడుదల చేసే అవకాశముంది. తొలి జాబితాలోనే ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా తదితరుల పేర్లు ఉండే అవకాశముంది.

త్వరలో జరిగే ఐపీఎల్ సీజన్‌ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు గంబీర్ మెంటర్‌గా వ్యవహరించనున్నారు. టికెట్ దక్కే అవకాశం లేకపోవడంతో పాటు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కోసం పనిచేయాల్సి ఉన్నందున క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోవాలని గంభీర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి