జీ-23 డైలమా, మే 2 డెడ్ లైన్, ‘గాంధీల’ పార్టీ ఫ్యూచర్ పై సస్పెన్స్, మెరుపులా ? మరకలా ?

125 ఏళ్లకు పైగా సుదీర్ఘ చరిత్ర గల కాంగ్రెస్ పార్టీకి 'పెద్ద పరీక్షలు' దగ్గర పడుతున్నాయి. బీటలు వారుతున్న భవనం మళ్ళీ....

  • Umakanth Rao
  • Publish Date - 5:03 pm, Mon, 1 March 21
జీ-23 డైలమా, మే 2 డెడ్ లైన్, 'గాంధీల' పార్టీ ఫ్యూచర్ పై సస్పెన్స్, మెరుపులా ? మరకలా ?

125 ఏళ్లకు పైగా సుదీర్ఘ చరిత్ర గల కాంగ్రెస్ పార్టీకి ‘పెద్ద పరీక్షలు’ దగ్గర పడుతున్నాయి. బీటలు వారుతున్న భవనం మళ్ళీ మెరుపులు సంతరించుకుంటుందా లేక మరకాల మాటున కనుమరుగవుతుందా అన్నది తేలాల్సిన తరుణం దగ్గర[పడుతోంది. ఏప్రిల్-మే నెలల్లో 5 రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలు ఈ పార్టీ భవితవ్యాన్ని నిర్దేశించనున్నాయి. దేశంలో  కేవలం పంజాబ్, రాజస్తాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉన్న ఈ పార్టీ ఈ ఎన్నికల్లో తన బలాన్ని నిరూపించుకోగలుగుతుందా లేక కమలం ముందు చతికిలబడుతుందా అన్నది  తేలాల్సి ఉంది. గత ఏడాది ఆగస్టులో పార్టీ అధినాయకత్వాన్ని బాహాటంగా ప్రశ్నిస్తూ అధినేత్రి సోనియా గాంధీకి 23 మంది ‘అసమ్మతి నేతలు’ రాసిన లేఖ తాలూకు స్మృతి మళ్ళీ మొన్నటి జమ్మూలో చటుక్కున పునరావృతమైంది. పార్టీ బలహీనపడిపోతోందని, ఇది సత్యమని సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, కపిల్ సిబాల్ సహా పలువురు  ఆక్రోశించారు. రాజ్యసభ నుంచి తాను  రిటైరయినా ..రాజకీయాలనుంచి రిటైర్ కాలేదని, తమకు అన్ని మతాలు, కులాలు ఒక్కటేనని ఆజాద్ అన్నారు. తమ పార్టీ నేత రాహుల్ గాంధీ.. ఉత్తరాది ఓటర్లకు, దక్షిణాది ఓటర్లకు తేడా ఉందంటూ తన దక్షిణాది పర్యటనలో చేసిన వ్యాఖ్యకు ఆయన ఇలా పరోక్షంగా కౌంటరిచ్చ్చారు.ఆనంద్ శర్మ అయితే ఒక అడుగు ముందుకేసి.. ఒక పార్టీ ఒక వ్యక్తికి ఓ హోదా, పదవి ఇవ్వవచ్ఛునని, కానీ పై హోదా అనుభవిస్తున్న ప్రతి వ్యక్తీ ప్రజానాయకుడు కాలేరని వ్యాఖ్యానించారు.

 

ఇది ఎవరిని ఉద్దేశించి ఆయన ఇలా అన్నారో ఊహించడం కష్టమేమీ కాదు.. పార్టీ బలహీనపడుతోందన్న మాట వాస్తవమని కపిల్ సిబాల్ గతంలో మాదిరే పునరుద్ఘాటించారు. పార్టీకి  యువ నాయకత్వం అవసరమని ఆయన అన్నారు. . అంటే వీరు  చెబుతున్నదంతా ఒక్కటే.. పార్టీకి బలమైన  నాయకత్వం కావాలన్నదే! తాము లోగడ ఓ లేఖలో ఏది ప్రస్తావించామో మళ్ళీ అదే అన్యాపదేశంగా పేర్కొన్నారు. జమ్మూ మీటింగ్ లో వీరు  చేసిన ఈ వ్యాఖ్యలపై మన్మోహన్ సింగ్, ఏకే ఆంటోనీ, చిదంబరం, జైరామ్ రమేష్,  దిగ్విజయ్ సింగ్ వంటి మోస్ట్ సీనియర్ నేతలెవరూ నోరు మెదపలేదు.అంతా  మౌనం వహించారు. వారి స్పందన ఏ మాత్రం లేదు. ఎన్నికల వేళ అంతా కలిసి కూర్చుని ప్రచార వ్యూహాలకు పదును పెట్టాల్సింది పోయి.. వేర్వేరు కుంపట్లు పెట్టుకుని నిరసన సెగలను  రాజేసుకుంటున్నారు.పార్టీ అధినాయకత్వం (సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ) కూడా సైలెంట్ గా ఉంది.మొన్నటి జమ్మూ మీటింగ్ లో మాట్లాడిన వారిలో కనీసం నలుగురు బాహాటంగా బయటకి వఛ్చి పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసినా ఎగురవేయవచ్చు. ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ ..’హమ్ దో, హమారే దో’ అంటూ అదేపనిగా విమర్శలు చేస్తూ పోతున్నారు గానీ పార్టీ  ప్రక్షాళన, సంస్థాగత బలోపేతం,  కొత్త  వర్కింగ్ కమిటీ ఏర్పాటు వంటివాటిపై ఒక్క మాట కూడా మాట్లాడడంలేదు. అయన ప్రచార సరళి అంతా మోదీని దుయ్యబట్టడానికే సరిపోతోంది. ఈ తరుణంలో మరి ఈ తాజా ఎన్నికలను పార్టీ ఎలా ఎదుర్కొంటుందో చూడాల్సిందే..

 

ఇవి కూడా చదవండి:

Rahul Challenge: రాహుల్ ఈత కొట్టారు.. చేపలు పట్టారు.. ఇప్పుడు విద్యార్థులతో పోటీ పడ్డాడు.. ఎందులోనో తెలుసా…!

Bill Gates: మైక్రోసాఫ్ట్ అధినేత ఆండ్రాయిడ్ వాడతారా.? ఐఓఎస్ వాడతారా.? ఆసక్తికర విషయాలు వెల్లడించిన బిల్ గేట్స్..