Covid-19 Booster Dose: నేటినుంచి ప్రభుత్వ దవాఖానల్లో ఉచితంగా బూస్టర్ డోసు.. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు

| Edited By: Rajeev Rayala

Jul 15, 2022 | 6:39 AM

75 రోజుల పాటు జ‌రిగే ఈ వ్యాక్సినేష‌న్ కార్యక్రమంలో భాగంగా అర్హులైన వారంద‌రికి బూస్టర్ డోస్ ఇచ్చేలా, త‌ద్వారా క‌రోనా నుంచి కాపాడుకునేందుకు రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంపొందించుకునేలా ప్రభుత్వ చర్యలు తీసుకుంటోంది.

Covid-19 Booster Dose: నేటినుంచి ప్రభుత్వ దవాఖానల్లో ఉచితంగా బూస్టర్ డోసు.. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు
Covid Booster Dose
Follow us on

COVID-19 Vaccine Boosters: రాష్ట్రంలో శుక్రవారం నుంచి 18 ఏళ్లు పైబ‌డి, రెండో డోసు నుండి 6 నెలలు పూర్తయిన వారికి ప్రభుత్వ ద‌వాఖాన‌ల్లో ఉచితంగా బూస్టర్ డోస్ ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. 75 రోజుల పాటు జ‌రిగే ఈ వ్యాక్సినేష‌న్ కార్యక్రమంలో భాగంగా అర్హులైన వారంద‌రికి బూస్టర్ డోస్ ఇచ్చేలా, త‌ద్వారా క‌రోనా నుంచి కాపాడుకునేందుకు రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంపొందించుకునేలా ప్రభుత్వ చర్యలు తీసుకుంటోంది. ఇప్పటివ‌ర‌కు 60 ఏళ్లు దాటిన వారికి మాత్రమే బూస్టర్ డోస్ ఇచ్చేందుకు అనుమ‌తించిన కేంద్రం.. ఈ ఏడాది ఏప్రిల్ 10 నుంచి.. 18 ఏళ్లు పైబ‌డిన వారికి బూస్టర్ డోస్ ఇచ్చేందుకు కేవ‌లం ప్రైవేటు అసుప‌త్రుల‌కు అనుమ‌తించింది. ప్రభుత్వ ఆసుప‌త్రుల్లో ఉచితంగా బూస్టర్ డోస్ అందుబాటులో లేక‌పోవ‌డం వ‌ల్ల చాలా మంది ల‌బ్ధి పొంద‌లేక‌పోయారు.

మ‌రోవైపు కొత్త వేరియంట్ రూపంలో క‌రోనా కేసులు ప‌లు రాష్ట్రాల్లో పెర‌గ‌టం ప్రారంభ‌మైంది. ఈ ప‌రిస్థితుల నేప‌థ్యంలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తులు చేసింది. రెండు డోసులు పూర్తి చేసుకున్న అర్హుల‌కు ఉచితంగా బూస్టర్ డోస్‌ ఇచ్చేందుకు వీలుగా ప్రభుత్వ ఆసుప‌త్రుల్లో బూస్టర్ డోస్ పంపిణీకి అనుమ‌తించాల‌ని కోరింది. సీఎం కేసీఆర్ సూచ‌న మేర‌కు, ఈ విష‌య‌మై కేంద్రానికి మంత్రి హ‌రీశ్ రావు గతేడాది డిసెంబర్ 2, ఈ జనవరి 18, ఏప్రిల్ 11న మొత్తం మూడు సార్లు లేఖ రాయ‌గా, జూన్ 13న‌ అన్ని రాష్ట్రాల అరోగ్య శాఖ మంత్రులతో జ‌రిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర ఆరోగ్య మంత్రి మ‌నుసుక్ మాండ‌వీయ‌కు మ‌రోమారు విజ్ఞప్తి చేశారు. ఎట్టకేల‌కు కేంద్రం, ప్రభుత్వ ద‌వాఖాన‌ల ద్వారా ప్రజ‌ల‌కు ఉచితంగా బూస్టర్ డోస్ ఇచ్చేందుకు అనుమ‌తించింది.

ఈ విషయం వైద్యశాఖ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ప్రపంచ కొవిడ్ ప‌రిస్థితులు, ఇత‌ర రాష్ట్రాల్లో కేసుల పెరుగుద‌ల నేప‌థ్యంలో ప్రభుత్వ ఆసుప‌త్రుల్లో బూస్టర్ ఇచ్చేందుకు అనుమ‌తించాల‌ని, త‌ద్వారా ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వడం సాధ్యమ‌వుతుంద‌ని కేంద్రానికి వివ‌రించడంతోపాటు ప‌లుమార్లు విజ్ఞప్తి చేశామన్నారు. ఆల‌స్యం జ‌రిగిన‌ప్పటికీ అనుమ‌తించ‌డం సంతోష‌క‌రమన్నారు. ఈ నిర్ణయం, తెలంగాణ ప్రజలతోపాటు యావ‌త్ దేశానికి మేలు చేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కోవిషీల్డ్, కోవాక్సిన్ కలిపి మొత్తం 20 లక్షల డోసుల నిల్వ ఉందని.. అర్హులైన ప్రతిఒక్కరికీ బూస్టర్ డోస్ అందించేలా ఏర్పాట్లు చేయలని వైద్యారోగ్య శాఖ అధికారుల‌ను ఆదేశించినట్లు మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

రాష్ట్రంలో బూస్టర్ డోస్ పంపిణీకి ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు..

  • అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో బూస్టర్ డోసు అందుబాటులో ఉంటుంది.
  • అన్ని జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఇంజినీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీల్లోనూ వాక్సిన్ అందుబాటులో ఉంటుంది.
  • సికింద్రాబాద్, నాంపల్లి, ఖాజీపేట రైల్వే స్టేషన్లతో పాటు, మహాత్మా గాంధీ, జూబ్లీ బస్ స్టాండ్ లలో 24 గంటల పాటు సౌకర్యం ఉంటుంది.
  • హౌసింగ్ సొసైటీలు, ఆఫీసులు, ఇండస్ట్రీలు, ఫ్యాక్టరీలు, ఇతర వర్క్ ప్లేసెస్ లో వారి కోరిక మేరకు వ్యాక్సినేషన్ నిర్వహించడం జరుగుతుంది.
  • 040-24651119 నెంబర్‌కు సంప్రదిస్తే.. 100 మంది కంటే ఎక్కువ మంది లబ్దిదారులు ఉన్న చోట వాక్సినేషన్ కేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుంది.