Dr. Manmohan Singh Passes Away Live: ఆర్థిక సంస్కర్త అస్తమయం.. శనివారం రాజ్‌ఘాట్‌లో అంత్యక్రియలు

|

Dec 27, 2024 | 1:38 PM

మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ (92) గురువారం రాత్రి కన్నుమూశారు. చాలా కాలంగా అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న మాజీ ప్రధాని, గురువారం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత ఆయన్ను ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) ఢిల్లీలో చేర్చారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు భారత ప్రధానిగా ఉన్నారు. 1991లో ఆర్థిక మంత్రిగా ఆయన భారతదేశంలో ఆర్థిక సరళీకరణకు పునాది వేశారు. ఇది ప్రపంచ స్థాయిలో దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసింది.

Dr. Manmohan Singh Passes Away Live: ఆర్థిక సంస్కర్త అస్తమయం.. శనివారం రాజ్‌ఘాట్‌లో అంత్యక్రియలు
Manmohan Singh Passes Away

LIVE NEWS & UPDATES

  • 27 Dec 2024 12:03 PM (IST)

    భారత రాజకీయాలకు మార్గదర్శకుడుః మాజీ రాష్ట్రపతి కోవింద్

    డాక్టర్ మన్మోహన్ సింగ్ మన నుంచి వెళ్లిపోవడం దేశానికే తీరని లోటు అని భారత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. అతను చాలా సంవత్సరాలు తెలుసు. రాష్ట్రపతి భవన్‌లో ఆయనను కలిసేవాడిని. అతను సౌమ్యత, వినయానికి ప్రతీక. భారత రాజకీయాలకు మార్గదర్శకుడు. అతను భారత ఆర్థిక వ్యవస్థకు ఆధునిక నిర్మాత అని మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. ఆయనకువినయపూర్వకమైన నివాళులర్పించారు మాజీ రాష్ట్రపతి.

  • 27 Dec 2024 12:00 PM (IST)

    నివాళులర్పించిన రాహుల్, సోనియా, ప్రియాంక

    సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు మన్మోహన్ సింగ్‌కు ఘనంగా నివాళులర్పించారు. బెల్గాం నుంచి ఢిల్లీకి చేరుకున్న రాహుల్ గాంధీ మన్మోహన్ సింగ్ ఇంటికి చేరుకున్నారు. సోనియా, ప్రియాంకతో కలిసి మన్మోహన్ సింగ్‌కు నివాళ్లులర్పించారు. కాగా, ప్రజల సందర్శనార్ధం రేపు AICC కార్యాలయానికి మన్మోహన్ సింగ్ భౌతికకాయాన్ని తరలించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రేపు ఉదయం 8 నుంచి10 గంటల మధ్య AICC ఆఫీస్‌లో భౌతికకాయం ఉంచనున్నారు. రాజ్‌ఘాట్‌ దగ్గర మన్మోహన్‌ అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.

  • 27 Dec 2024 11:55 AM (IST)

    మైనార్టీల అభ్యున్నతికి కృషి చేసిన మన్మోహన్ః ఒవైసీ

    మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంతాపం తెలిపారు. “డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం గురించి వినడం చాలా బాధాకరం. విభజన శరణార్థి, ఆర్‌బిఐ గవర్నర్‌గా, ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా ఆయన సేవలు చిరస్మరణీయం. మైనారిటీలు, వెనుకబడిన తరగతులతో సహా భారతదేశంలోని అట్టడుగు ప్రజల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషిని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటానని ఒవైసీ తెలిపారు.

  • 27 Dec 2024 10:57 AM (IST)

    సల్మాన్ ఖాన్ సికందర్ టీజర్ విడుదల వాయిదా

    శుక్రవారం సల్మాన్ ఖాన్ 59వ పుట్టినరోజు సందర్భంగా సల్మాన్ తదుపరి చిత్రం సికందర్ టీజర్ విడుదల కావల్సి ఉంది. అయితే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందడంతో ఈ టీజర్ రేపు (డిసెంబర్ 28) ఉదయం 11.07 గంటలకు విడుదల కానుంది. ఈ విషయాన్ని నిర్మాత సాజిద్ నడియాడ్‌వాలా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.

  • 27 Dec 2024 10:52 AM (IST)

    ప్రగతి యాత్రను రద్దు చేసుకున్న నితీష్ కుమార్

    మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంతాపం తెలియజేశారు. దేశాభివృద్ధిలో మన్మోహన్ సింగ్ పాత్రను గుర్తు చేసుకున్నారు. అలాగే ఆయన గౌరవార్థం నేడు, రేపు జరగాల్సిన ప్రగతి యాత్రను రద్దు చేశారు.

  • 27 Dec 2024 10:49 AM (IST)

    మన్మోహన్ సింగ్‌కు ప్రధాని మోదీ నివాళి

    మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు నివాళులర్పించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ ఆయన ఇంటికి చేరుకున్నారు. మన్మోహన్ సింగ్‌ భౌతికాయం వద్ద పుష్ప గుచ్ఛం ఉంచి ఘనంగా నివాళులర్పించారు ప్రదాని మోదీ. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

  • 27 Dec 2024 10:42 AM (IST)

    రేపు రాజ్‌ఘాట్‌లో అంతిమ సంస్కారాలు!

    మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ దిగ్భ్రాంతి వ్యక్తి చేశారు. అంత్యక్రియల కార్యక్రమం ఇంకా ఖరారు కాలేదన్నారు. విదేశాల్లో ఉన్న మన్మోహన్ కూతురు రావల్సి ఉందన్నారు. ఆమె మధ్యాహ్నం లేదా సాయంత్రం వస్తున్నారు. ఆ తర్వాతే అన్నీ నిర్ణయిస్తామన్నారు. రేపు శనివారం అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు రేపు రాజ్‌ఘాట్ సమీపంలో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. రేపు(శనివారం) ఉదయం 8-10 గంటల మధ్య ఆయన భౌతికకాయాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఉంచనున్నారు. అనంతరం మాజీ ప్రధానికి అంతిమ వీడ్కోలు జరగనుంది.

     

  • 27 Dec 2024 09:22 AM (IST)

    ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంతాపం

    భారత మాజీ ప్రధాని, దేశ సీనియర్ నాయకుడు డాక్టర్ సర్దార్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల యావత్ దేశం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది. సాధారణ నేపథ్యం నుండి వచ్చినప్పటికీ, భారతదేశానికి మన్మోహన్ సింగ్ చేసిన సహకారం ఎల్లప్పుడూ గుర్తుండిపోతుందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కొనియాడు. ఆయన అత్మకు శాంతి చేకూరాలని, మోక్షాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఆయన కుటుంబసభ్యులకు, అభిమానులకు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

  • 27 Dec 2024 08:27 AM (IST)

    మన్మోహన్ సింగ్ మృతికి అమెరికా సంతాపం

    అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ J. బ్లింకెన్ భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపం తెలిపారు. US డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ విడుదల చేసిన ఒక ప్రకటనలో, “మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణించినందుకు భారతదేశ ప్రజలకు యునైటెడ్ స్టేట్స్ తన సంతాపాన్ని తెలియజేస్తుంది. డా. మన్మోహన్ సింగ్‌కు గొప్ప మద్దతుదారులలో ఒకరు. యుఎస్-ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్యం. గత రెండు దశాబ్దాలలో మన దేశాలు కలిసి సాధించిన అనేక విజయాలకు అతని కృషీ పునాది వేసింది.” అని పేర్కొన్నారు. మన్మోహన్ ఆర్థిక సంస్కరణలను గుర్తు చేసుకున్నారు. భారతదేశం వేగవంతమైన ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించిన మన్మోహన్ సింగ్ మరణానికి సంతాపం తెలియజేశారు.

  • 27 Dec 2024 08:23 AM (IST)

    దేశ ఆర్థిక సరళీకరణ రూపశిల్పి: ఉపరాష్ట్రపతి

    దేశ ఆర్థిక పరిస్థితిని మార్చిన మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ మృతి చెందడం తనకు చాలా బాధ కలిగించిందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ అన్నారు. ఆయన దేశ ఆర్థిక సరళీకరణకు రూపశిల్పి. ముఖ్యమైన మార్పుల ద్వారా దేశాన్ని ముందుకు తీసుకెళ్లాడు. ఆయన అభివృద్ధి, శ్రేయస్సు కొత్త మార్గాలను తెరిచారని కొనియాడారు.

  • 27 Dec 2024 08:22 AM (IST)

    ఆయన సింప్లిసిటీని మాటల్లో చెప్పడం అసాధ్యం: కేజ్రీవాల్

    మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంతాపం వ్యక్తం చేస్తూ.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు అని అన్నారు. ఆయన వివేకాన్ని, సరళతను మాటల్లో చెప్పడం అసాధ్యం. భగవంతుడు ఆయన పాదాల చెంత పుణ్యాత్మునికి స్థానం కల్పించాలని కేజ్రీవాల్ ఆకాంక్షించారు.

  • 27 Dec 2024 08:21 AM (IST)

    దేశ ఆర్థిక సరళీకరణ రూపశిల్పి: ఉపరాష్ట్రపతి

    దేశ ఆర్థిక పరిస్థితిని మార్చిన మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ మృతి చెందడం తనకు చాలా బాధ కలిగించిందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ అన్నారు. ఆయన దేశ ఆర్థిక సరళీకరణకు రూపశిల్పి. ముఖ్యమైన మార్పుల ద్వారా దేశాన్ని ముందుకు తీసుకెళ్లాడు. ఆయన అభివృద్ధి, శ్రేయస్సు కొత్త మార్గాలను తెరిచారని కొనియాడారు.

  • 27 Dec 2024 08:17 AM (IST)

    ఓ గురువును, మార్గదర్శినిని కోల్పోయాను: రాహుల్ గాంధీ

    మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. మన్మోహన్ సింగ్ తెలివితేటలు, విధేయతతో దేశాన్ని నడిపించారు. ఆర్థిక శాస్త్రం పట్ల ఆయనకున్న వినయం, అవగాహన దేశాన్ని ముందుకు తీసుకెళ్లాయి. ఒక గురువును, మార్గదర్శినిని కోల్పోయానంటూ రాహుల్ గాంధీ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఎమోషనల్ అయ్యారు. ఆయన అభిమానులైన లక్షలాది మంది ఆయనను ఎంతో గర్వంగా గుర్తుంచుకుంటారని తెలిపారు.

  • 27 Dec 2024 08:15 AM (IST)

    ఆర్థిక వ్యవస్థను గడలో పెట్టిన నిష్కళంకమైన నేత: రాష్ట్రపతి

    మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఆ దేశ అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము సంతాపం వ్యక్తం చేశారు. ప్రపంచంలో విద్యారంగంలో, పరిపాలనలో సమాన సౌలభ్యంతో పనిచేసిన రాజకీయ నాయకులలో మన్మోహన్ సింగ్ ఒకరని ఆమె అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. దేశానికి ఆయన చేసిన సేవ, నిష్కళంకమైన రాజకీయ జీవితం, అత్యంత వినయంతో ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారు. ఆయన మరణం మనందరికీ తీరని లోటు. ఆయన కుటుంబానికి రాష్ట్రపతి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

  • 27 Dec 2024 08:13 AM (IST)

    నివాసానికి భౌతికకాయం తరలింపు

    మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ భౌతికకాయాన్ని ఎయిమ్స్ నుంచి ఆయన నివాసానికి తరలించారు. మాజీ ప్రధాని 92 ఏళ్ల వయసులో మరణించారు. భారత ప్రభుత్వం డిసెంబర్ 27న జరగాల్సిన అన్ని కార్యక్రమాలను రద్దు చేసింది. అంతేకాకుండా 7 రోజుల జాతీయ సంతాప దినాలను ప్రకటించింది. పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

  • 27 Dec 2024 08:06 AM (IST)

    శనివారం నాడు మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు

    మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు శనివారం జరగనున్నాయి. దీనికి సంబంధించి శుక్రవారం అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు రేపు జరుగుతాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గురువారం అర్థరాత్రి తెలిపారు. అధికారికంగా ప్రకటిస్తామన్నారు. మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటని అభివర్ణించిన ఆయన.. కాంగ్రెస్‌కు, దేశానికి నిజమైన ప్రతీక మన్మోహన్ సింగ్ అని అన్నారు.

  • 27 Dec 2024 08:04 AM (IST)

    కష్ట సమయాల్లో కీలక పాత్ర పోషించారు: రాజ్‌నాథ్‌ సింగ్‌

    మన్మోహన్ సింగ్ మృతి పట్ల దేశ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంతాపం వ్యక్తం చేశారు. దేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. కష్టకాలంలో దేశ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. తన సేవ, తెలివితేటలతో అందరినీ మెప్పించారన్నారు. దేశ ప్రగతికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆయన కుటుంబానికి, అభిమానులకు రాజ్‌నాథ్ సింగ్ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

  • 27 Dec 2024 08:03 AM (IST)

    నిజాయితీ మాకు స్ఫూర్తిని నిలుస్తుంది: ప్రియాంక గాంధీ

    మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సర్దార్ మన్మోహన్ సింగ్ ఇచ్చిన గౌరవాన్ని రాజకీయాల్లో చాలా తక్కువ మంది మాత్రమే ప్రేరేపిస్తారన్నారు. ఆయన నిజాయితీ మనకు ఎప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తుంది. ఈ దేశాన్ని నిజంగా ప్రేమించే వారిలో ఆయన ఎప్పుడూ ఉంటారు. అతను నిజంగా సమతావాది, తెలివైనవాడు, దృఢ సంకల్పం, ధైర్యవంతుడని ప్రియాంక గాంధీ కొనియాడారు.

  • 27 Dec 2024 08:01 AM (IST)

    దేశం గొప్ప ఆర్థికవేత్తను కోల్పోయింది: ఖర్గే

    మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. చరిత్ర మిమ్మల్ని నిస్సందేహంగా గుర్తు చేసుకుంటుందని అన్నారు. మాజీ ప్రధాని మరణంతో దేశం ఒక దూరదృష్టి గల రాజకీయ నాయకుడిని, నిష్కళంకమైన చిత్తశుద్ధి గల నాయకుడిని, అద్వితీయ స్థాయి ఆర్థికవేత్తను కోల్పోయిందన్నారు. ఆర్థిక సరళీకరణ, హక్కుల ఆధారిత సంక్షేమ విధానాలు కోట్లాది దేశ ప్రజల జీవితాలను మార్చాయి. మన్మోహన్ సింగ్ దేశంలోని కోట్లాది మంది ప్రజలను పేదరికం నుండి బయటికి తీసుకొచ్చారు.

  • 27 Dec 2024 07:59 AM (IST)

    అద్వితీయ ప్రతిభ కలిగిన నాయకుడుః సిద్ధరామయ్య

    మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సంతాపం వ్యక్తం చేశారు. అద్వితీయ ప్రతిభ కలిగిన రాజకీయ నాయకుడు తన నాయకత్వంతో దేశంపై చెరగని ముద్ర వేశారని అన్నారు. ఆయన ప్రధానిగా ఉన్న సమయంలోనే నేను తొలిసారిగా కర్ణాటక ముఖ్యమంత్రిని అయ్యాను. ఆయన కుటుంబసభ్యులకు, ఆత్మీయులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు సీఎం సిద్ధరామయ్య.

  • 27 Dec 2024 07:51 AM (IST)

    ఘన నివాళులర్పించిన ప్రధాని మోదీ

    మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ప్రధాని మోదీ నివాళులర్పించారు. భారత విశిష్ట నేతల్లో మన్మోహన్‌ సింగ్ ఒకరు.. మన్మోహన్‌ సింగ్ భారత ఆర్థిక విధానాలపై బలమైన, చెరగని ముద్ర వేశారు. రాజకీయాల్లో తనతో గత క్షణాలను గుర్తు చేసుకున్నారు. తాను ప్రధానిగా ఉన్నప్పుడు, నేను గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిత్యం మాట్లాడుకునేవాళ్లమన్నారు మోదీ. ప్రభుత్వానికి సంబంధించిన వివిధ అంశాలపై లోతైన సంభాషణలు జరిగేవి. అతని తెలివితేటలు, వినయం ఎప్పుడూ కనిపించేవి. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు ప్రధాని మోదీ. భారత విశిష్ట నేతల్లో మన్మోహన్‌ సింగ్ ఒకరు.. మన్మోహన్‌ సింగ్ భారత ఆర్థిక విధానాలపై బలమైన, చెరగని ముద్ర వేశారు.

    సాధారణ నేపథ్యం నుంచి ఎదిగి గౌరవనీయమైన ఆర్థికవేత్తగా, ఆర్థిక మంత్రితో సహా వివిధ ప్రభుత్వ పదవులలో పనిచేశారు. సంవత్సరాలుగా మన ఆర్థిక విధానాలపై తీవ్ర ప్రభావాన్ని చూపారు. పార్లమెంటులో ఆయన ఆలోచనాత్మకమైన జోక్యాలు కూడా ఎల్లప్పుడూ గుర్తించదగినవి. ప్రధానిగా ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు విస్తృతంగా కృషి చేశారని ప్రధాని మోదీ కొనియాడారు.

  • 27 Dec 2024 07:19 AM (IST)

    మన్మోహన్ సింగ్ మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి

    భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంతాపం ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగడం చారిత్రక సందర్భం అని కేసీఆర్ అన్నారు. ఆయన మృతి తీరని లోటు అన్నారు.

  • 27 Dec 2024 07:15 AM (IST)

    ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు మృతి బాధాకరంః షర్మిల

    మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం అత్యంత బాధాకరమని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఆర్థిక సంస్కరణలకు ఆధ్యుడు, అవిశ్రాంత యోధుడు, మహోన్నత నాయకుడు భారత దేశ ఆర్థికశిల్పి మన్మోహన్ సింగ్. ఆయన మరణం దేశానికి తీరని లోటు. మన్మోహన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా, దేశ ప్రధానిగా ఆయన అందించిన సేవలు అమూల్యమన్నారు. మన్మోహన్ సారథ్యంలో మన దేశం అత్యధిక వృద్ధి రేటు సాధించి, ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందన్నారు. ఇండియన్ ఎకానమీ సూపర్ పవర్ గా గుర్తింపు తీసుకువచ్చిన ఘటన మన్మోహన్ సింగేదే అన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంలో సింగ్ సంస్కరణలు కీలకం. ప్రపంచాన్ని కుదిపేసిన ఆర్ధిక మాంద్యం ప్రభావం దేశ ఆర్ధిక వ్యవస్థపై పడకుండా గాడిలో పెట్టిన ఘనత మన్మోహన్ సింగ్ దే అని వైఎస్ షర్మిల సోషల్ మీడియా X వేదికగా సంతాపం వ్యక్తం చేశారు.

  • 27 Dec 2024 07:10 AM (IST)

    భారతావని ఒక గొప్ప కుమారుడిని కోల్పోయిందిః రేవంత్ రెడ్డి

    మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గొప్ప ఆర్ధిక వేత్త, మహా నాయకుడు, సంస్కరణ వాది అన్నింటికి మించి గొప్ప మానవతావాది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతితో దేశం ఒక గొప్ప కుమారుడిని కోల్పోయిందని సీఎం అవేదన వ్యక్తం చేశారు. మాజీ ప్రధానమంత్రి మృతిపై సోషల్ మీడియా X లో తన సంతాపాన్ని, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని సీఎం తెలియజేశారు. నిర్ణయాల తీసుకోవడంలో సమగ్రత, పారదర్శకత అన్నింటికీ మించి మానవీయ స్పర్శను జోడించేవారని, నవ భారత శిల్పుల్లో మన్మోహన్ సింగ్ ఒకరని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. రాజకీయ, ప్రజా జీవితంలో గౌరవ మర్యాదలు ఎలా పాటించాలో ఆయన తన ప్రవర్తన ద్వారా చూపించారని సీఎం పేర్కొన్నారు.

  • 27 Dec 2024 06:30 AM (IST)

    7 రోజుల పాటు జాతీయ సంతాప దినాలు

    మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. దేశానికి రెండుసార్లు ప్రధానిగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఆయన మృతితో కేంద్ర ప్రభుత్వం నేడు జరగాల్సిన అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను రద్దు చేసింది. దేశ వ్యాప్తంగా 7 రోజులపాటు జాతీయ సంతాప దినాలు ప్రకటించారు. నేడు ఉదయం 11 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. ప్రభుత్వ లాంఛనాలతో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు జరగనున్నాయి.

  • 27 Dec 2024 06:28 AM (IST)

    నేను గురువును, మార్గదర్శినిని కోల్పోయాను: రాహుల్ గాంధీ

    మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఓ పోస్ట్‌ చేశారు. మన్మోహన్ సింగ్ తెలివితేటలు, విధేయతతో దేశాన్ని నడిపించారు. ఆర్థిక శాస్త్రం పట్ల ఆయనకున్న వినయం, అవగాహన దేశాన్ని ముందుకు తీసుకెళ్లాయి. నేను ఒక గురువును, మార్గదర్శినిని కోల్పోయాను అంటూ ట్వీట్ చేశారు.

  • 27 Dec 2024 06:27 AM (IST)

    కష్ట సమయాల్లో కీలక పాత్ర: రాజ్‌నాథ్‌ సింగ్‌

    మన్మోహన్ సింగ్ మృతి పట్ల దేశ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంతాపం వ్యక్తం చేశారు. దేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. కష్టకాలంలో దేశ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. దేశ ప్రగతికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆయన కుటుంబానికి, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి అంటూ తన బాధను పంచుకున్నారు.

  • 27 Dec 2024 06:25 AM (IST)

    దేశం ఆర్థిక వేత్తను కోల్పోయింది: ప్రధాని మోదీ

    మన్మోహన్ సింగ్‌కు నివాళులర్పించిన ప్రధాని మోదీ.. దేశం తన విశిష్ట నాయకులలో ఒకరైన డాక్టర్ మన్మోహన్ సింగ్ జీని కోల్పోయిందని అన్నారు. సాధారణ నేపథ్యం నుంచి ప్రముఖ ఆర్థికవేత్తగా ఎదిగారని, ఆర్థిక మంత్రితో సహా వివిధ ప్రభుత్వ పదవులలో పనిచేశారని గుర్తు చేశారు. మన ఆర్థిక విధానాలపై తీవ్ర ప్రభావాన్ని చూపాడని, పార్లమెంటులో ఆయన ఆలోచనాత్మకమైన విధానాలు ఎల్లప్పుడూ గుర్తించదగినవి అని, ప్రధానిగా ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు విస్తృతంగా కృషి చేశారని మోదీ అన్నారు.

Dr. Manmohan Singh Passes Away: దేశానికి రెండు సార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు భారత ప్రధానిగా ఉన్నారు. 1991లో ఆర్థిక మంత్రిగా ఆయన భారతదేశంలో ఆర్థిక సరళీకరణకు పునాది వేశారు. ఇది ప్రపంచ స్థాయిలో దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసింది. గత కొంతకాలంగా శ్వాస సమస్యలతో ఇబ్బందిపడుతోన్న ఆయనను గురువారం(డిసెంబర్ 26) ఢిల్లీ ఎయిమ్స్‌ ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులో చేర్చారు. 92 ఏళ్ల మన్మోహన్ సింగ్‌ను ప్రత్యేక వైద్యుల బృందం పరీక్షించింది. చివరకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన భార్య గురుశరణ్ కౌర్ ఎయిమ్స్‌లో ఉన్నారు. ఆమెతోపాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఎయిమ్స్‌కు చేరుకున్నారు. ఎయిమ్స్ క్యాంపస్‌ను ఢిల్లీ పోలీసులు ఖాళీ చేయించారు. ప్రియాంక గాంధీ కూడా ఎయిమ్స్‌కు చేరుకున్నారు.

అవిభక్త భారతదేశంలోని పాకిస్థాన్‌ పంజాబ్‌లోని గాహ్ గ్రామంలో 1932 సెప్టెంబర్ 26న మన్మోహన్‌ సింగ్ జన్మించారు. పంజాబ్ విశ్వవిద్యాలయం, కేంబ్రిడ్జ్, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించారు. 1957-59లో ఆర్థిక శాస్త్రంలో సీనియర్‌ అధ్యాపకులుగా పనిచేశారు. 1959 నుంచి1963 మధ్య కాలంలో రీడర్‌గా ఉద్యోగం చేశారు. 1963 నుంచి 1965 పంజాబ్‌ వర్సిటీ, చండీగఢ్‌లో ప్రొఫెసర్‌గా పనిచేశారు. 1966 నుంచి1969 వరకు ఐక్యరాజ్యసమితిలో వాణిజ్య వ్యవహారాల అధికారిగా పనిచేశారు. 1969 నుంచి 1971 మధ్య ఢిల్లీ వర్సిటీ, అంతర్జాతీయ వాణిజ్యంలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. 1972-76 ఆర్థికశాఖలో ముఖ్య ఆర్థిక సలహాదారుగా ఉన్నారు. 1976 నుంచి 1980 వరకు రిజర్వు బ్యాంకు డైరెక్టర్‌గా పనిచేశారు. ఐడీబీఐ డైరెక్టర్‌, ఆసియా అభివృద్ధి బ్యాంకు భారత్‌ విభాగం గవర్నర్‌, ఐబీఆర్‌డీ భారత విభాగం గవర్నర్‌గా మన్మోహన్‌ సేవలందించారు. 1982-85 మధ్య ఆర్బీఐ గవర్నర్‌గా పనిచేశారు మన్మోహన్‌ సింగ్. 1985-87 మధ్య కాలంలో ప్రణాళికా సంఘం అధిపతిగా పనిచేశారు మన్మోహన్ సింగ్.

అక్టోబర్‌ 1991లో తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టారు మన్మోహన్ సింగ్. 1991 నుంచి 1996 వరకు పీవీ నరసింహారావు కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు మన్మోహన్ సింగ్. 1998 నుంచి 2004 వరకు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఐదుసార్లు అసోం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు మన్మోహన్ సింగ్. 2004లో సార్వత్రిక ఎన్నికల్లో యూపీఏ కూటమి గెలిచాక 13వ భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు మన్మోహన్ సింగ్‌. 2004 నుంచి 2014 వరకు రెండుసార్లు దేశ ప్రధానిగా పనిచేశారు. పదేళ్ల పాటు సుదీర్ఘకాలం ప్రధానమంత్రిగా పనిచేసి దేశ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాదులు వేశారు . ప్రధానిగా రోజుకు 18 గంటలు పనిచేశారు మన్మోహన్‌ సింగ్. పార్లమెంటు సభ్యుడిగా దాదాపు 33 ఏళ్ల పాటు కొనసాగారు. ఆరోగ్యం సహకరించని పరిస్థితుల్లోనూ కీలక సమయాల్లో ఓపిగ్గా సభకు వచ్చి అందరిలోనూ స్ఫూర్తి నింపారు మన్మోహన్ సింగ్.

1987లో మన్మోహన్‌ సింగ్‌ పద్మ విభూషణ్‌ అవార్డు అందుకున్నారు. 2017లో ఇందిరాగాంధీ శాంతి బహుమతి, 1993, 94లో ఉత్తమ ఆర్థిక మంత్రిగా యూరో మనీ అవార్డు అందుకున్నారు.2010లో మన్మోహన్‌ సింగ్‌ను వరల్డ్‌ స్టేట్స్‌ మెన్‌ అవార్డు వరించింది. ఫోర్బ్స్‌ అత్యంత శక్తివంతుల జాబితాలోనూ మన్మోహన్‌కు చోటు దక్కింది. మన్మోహన్ సింగ్ మృతితో ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలన్నీ రద్దు చేసింది కేంద్రం. ప్రభుత్వ లాంఛనాలతో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు జరగనున్నాయి.

Follow us on