Atal Bihari Vajpayee Punyatithi: విలక్షణమైన వ్యక్తిత్వం ఆయన సొంతం.. పార్టీలకు అతీతంగా అందరూ అభిమానించే నాయకుడు.. దేశానికి 3సార్లు ప్రధానమంత్రిగా సేవలందించి.. నిస్వార్థ రాజకీయనాయకుడిగా అందరి మన్ననలు పొంది.. భారతీయుల మనసులు గెలిచిన నేత అటల్ బిహారీ వాజ్ పేయి మన నుంచి దూరమై నేటికి నాలుగేళ్లు.. మాజీ ప్రధాని అటల్ జీ వర్థంతి సందర్భంగా యావత్తు దేశం ఆ మహానీయునికి నివాళులర్పిస్తోంది. పార్టీలకు అతీతంగా.. తన నాయకత్వ లక్షణాలతో నవ భారత నిర్మాణానికి బాటలు వేసిన నాయకుడు అటల్ బిహారీ వాజ్ పేయి.. భారత 10వ ప్రధాన మంత్రిగా, బీజేపీ తొలి అధ్యక్షుడిగా కీర్తి గడించిన ఆ మహానేత 1924 డిసెంబర్ 25వ తేదీన మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో జన్మించారు.
పదవిని హోదాగా కాకుండా బాధ్యతగా భావించి ఏ పని చేపట్టినా అందరి మనన్నలు పొందుతూ.. దేశ కీర్తి ప్రతిష్టలు పెంచినవారిలో అటల్ బిహారీ వాజ్ పేయిని ఒకరిగా చెప్పుకోవచ్చు. 1996లో 13 రోజులు, 1998-99లో 13 నెలలు, 1999 నుంచి2004 వరకు ఐదేళ్ల పాటు పూర్తికాలం ప్రధానమంత్రిగా సేవలందించారు. మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని జనతా ప్రభుత్వంలో భారత విదేశాంగ శాఖ మంత్రిగా అటల్ జీ పనిచేశారు. జనతా ప్రభుత్వం కూలిపోయినప్పడు, భారతీయ జనసంఘ్ లోని ఇతర సభ్యులతో కలిసి భారతీయ జనతా పార్టీ పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. ఆతర్వాత 15 ఏళ్ల పాటు దేశమంతా పర్యటించి పార్టీ విస్తరణలో కీలక భూమిక పోషించారు అటల్ బిహారీ వాజ్ పేయి. తన రాజకీయ జీవితంలో 10 సార్లు లోక్ సభ, 2 సార్లు రాజ్యసభకు అటల్ జీ ఎన్నికయ్యారు. 1957లో బలరాంపూర్ నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఆయన లోక్ సభకు ఎన్నికయ్యారు. అటల్ బిహారీ వాజ్ పేయి అద్భుతమైన వక్తృత్వం, ఉచ్చారణ ద్వారా పార్లమెంటులో తనదైన ముద్ర వేశారు. అతని ప్రసంగ నైపుణ్యం అప్పటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూతో సహా చాలా మంది మనస్సులు గెలుచుకుంది. 1996 సార్వత్రిక ఎన్నికల తర్వాత బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించగా.. అతిపెద్ద పార్టీగా అవతరించినా బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. దీంతో మెజారిటీ నిరూపించుకోవడానికి ఇతర పార్టీల మద్దతు సేకరించలేకపోవడంతో 13 రోజుల తర్వాత అటల్ జీ రాజీనామా చేయాల్సి వచ్చింది.
ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి ను గుర్తుచేసుకోగానే గుర్తొచ్చేది 1998 పోఖ్రాన్ అణు పరీక్ష.. ప్రపంచానికి తెలియకుండా ఐదు అణుపరీక్షలను నిర్వహించి అణ్వాయుధ దేశంగా భారత్ అవతరించింది. మూడు నెలల పాటు జరిగిన కార్గిల్ యుద్ధం అటల్ జీ ప్రధానిగా ఉన్నప్పుడే జరిగింది. కార్గిల్ విజయం వాజ్ పేయి రాజకీయ ప్రతిష్టను మరింత పెంచింది. అటల్ బిహారీ వాజ్ పేయి జీవితాంతం బ్రహ్మచారిగానే ఉన్నారు. అయితే ఆయన నమితా భట్టాచార్య ను దత్తత తీసుకున్నారు. భారతీయ శాస్త్రీయ సంగీతం, నృతం అంటే ఎంతో ఇష్టపడే వాజ్ పేయి తన కవితలతోనూ ప్రజలను మెప్పించేవారు. స్వయంగా పద్యాలు రాసేవారు.
2005లో క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్న ఆయన.. తదుపరి సాధారణ ఎన్నికల్లో పోటీచేయబోనని ప్రకటించారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ.. 2018 ఆగష్టు 16వ తేదీన అటల్ జీ పరమవదించారు. 2015వ సంవత్సరంలో కేంద్రప్రభుత్వం భారత రత్నతో వాజ్ పేయిని గౌరవించింది. ఇప్పటికి రాజకీయాల్లో బీజేపీ గురించి ఎవరూ మాట్లాడినా అటల్ జీ తరువాత అటల్ జీ ముందు అని మాట్లాడుతుంటారు. రాజకీయ విమర్శలు చేసే వారు కూడా అటల్ బిహారీ వాజ్ పేయి అప్పటి పార్టీ ఇప్పటి బీజేపీ కాదని అంటుంటారు. దీనిబట్టి అటల్ బిహారీ వాజ్ పేయి వ్యక్తిత్వం ఎంత విలక్షణమైనదో చెప్పుకోవచ్చు.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..