Open Society Prize 2021: కేరళ మాజీ ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజకు ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. కరోనా విపత్తు సమయంలో ఆమె చేసిన విశేష సేవలకు గాను సెంట్రల్ యూరోపియన్ యూనివర్సిటీ (సీఈయూ) ఓపెన్ సొసైటీ ప్రైజ్-2021కు శైలజ ఎంపికయ్యారు. సీఈయూ 30వ గ్రాడ్యుయేషన్ వేడుకల సందర్భంగా .. శైలజా టీచర్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు సీఈయూ అధ్యక్షుడు మైకేల్ ఇగ్నాటీఫ్ తెలిపారు. కరోనా సందర్భంగా శైలజతో పాటు వైద్య సిబ్బంది ప్రజలకు విశేష సేవలందించారని ఆయన పేర్కొన్నారు. అంతేగాక ప్రజాజీవితంలో అడుగుపెట్టాలనుకునే యువతులకు శైలజా టీచర్ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.
ప్రపంచవ్యాప్తంగా సమాజంలో అసాధారణమైన సేవలకు గుర్తింపుగా ఓపెన్ సొసైటీ ప్రైజ్‌ను సీఈయూ ప్రతి ఏటా అందజేస్తూ వస్తోంది. ఇందులో భాగంగా తాజాగా జరిగిన 30వ గ్రాడ్యుయేషన్ ప్రదానోత్సవం సందర్భంగా కేకే శైలజ ఈ అవార్డుకు ఎన్నికైనట్లు సీఈయూ ప్రకటించింది. కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న సమయంలో.. నాయకత్వ పటిమ, స్థానిక ప్రభుత్వాల సహాయంతో ప్రజారోగ్య సేవలను సమర్థవంతంగా, పట్టుదలతో నిర్వహించినందుకు కేకే శైలజా టీచర్‌కు ఈ పురస్కారాన్ని అందజేస్తున్నట్లు వివరించింది. ఎంతో మంది మహిళలకు శైలజా టీచర్ ఆదర్శంగా నిలవడంతో పాటు కరోనా కట్టడిలో తీసుకున్న చర్యలు పలు దేశాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని మైకేల్ వెల్లడించారు.
అయితే.. ఈ పురస్కారం దక్కడంపై కేరళ మాజీ మంత్రి శైలజ ఆనందం వ్యక్తం చేశారు. ఈ పురస్కారాన్ని తీసుకోవడం గౌరవంగా భావిస్తున్నానన్నారు. కాగా.. ఇటీవల జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్ తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంది. అయితే.. కేకే శైలజకు మాత్రం మంత్రివర్గంలో చోటు దక్కలేదు.
Also read;