India Floods: దేశ వ్యాప్తంగా వరదలు బీభత్స కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. గుజరాత్‌లో వరదల బీభత్సం కొనసాగుతోంది. 8 జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా గుజరాత్‌లో ఇప్పటివరకు 83 మంది ప్రాణాలు కోల్పోయారు. నవసరాయ్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. గత వారం రోజులుగా వరదల్లో చిక్కుకున్న 100 మందిని సహాయక బృందాలు కాపాడాయి. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు వరదబాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. వల్సాద్, జామ్‌నగర్, సూరత్, అహ్మదాబాద్, జునాఘడ్ జిల్లాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. నవసరాయ్‌లో ఎన్డీఆర్‌ఎప్ బృందాలు మనుషులతోపాటు మూగజీవాలను కాపాడుతున్నాయి. జంతు ప్రేమికులు కూడా బోట్లలో వెళ్లి వరదలో చిక్కున్న ఆవులకు, పక్షులకు ఆహారాన్ని అందిస్తున్నారు.
మహారాష్ట్రలో గత కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వరదల కారణంగా 99 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలోని మాలేగావ్‌లో వరదల బీభత్సంలో ఓ యువకుడు స్టంట్ చేయబోయాడు. వరద ప్రవాహంలో ఎత్తైన బ్రిడ్జ్ నుంచి కిందకు జంప్ చేశాడు. ఒకేసారి వరద ప్రవాహం పెరగడంతో నదిలో కొట్టుకుపోయాడు నయీం అమీన్ అనే యువకుడు. ఫ్రెండ్స్‌తో కలిసి వీడియో చేస్తుండగా ఈ ఘటన జరిగింది. 24 గంటలు గడిచినప్పటికీ నయీం అమీన్ జాడ చిక్కడం లేదు. గల్లంతైన నయీం కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి.
రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో భారీ వర్షం
రాజస్థాన్‌లో కూడా పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. మధ్యప్రదేశ్‌లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నర్మదాపురం లోని తావా డ్యాం పూర్తిగా నిండిపోయింది. దీంతో 10 గేట్లను ఎత్తారు అధికారులు . లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి