Five Tourists test positive for Covid-19: ప్రపంచం మొత్తం కరోనాతో ఇంకా సతమతమవుతూనే ఉంది. సెకండ్ వేవ్ అనంతరం థర్డ్ వేవ్ రాకుండా అంతటా కరోనా కట్టడికి ఆంక్షలు అమల్లో ఉన్నాయి. కోవిడ్‌ను నియంత్రించాలంటే.. నిబంధనలు అనుసరించాలని ప్రభుత్వాలు పదేపదే సూచిస్తున్నాయి. ఒకరి నుంచి మరొకరికి గాలి ద్వారా వ్యాపిస్తున్న మహమ్మారికి చెక్ పెట్టేందుకు మాస్క్, భౌతిక దూరం పాటించాలని పదేపదే పేర్కొంటున్నారు. ఈ తరుణంలో కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కరోనా సోకినప్పటికీ.. బయట విచ్చలవిడిగా తిరుగుతూ మహమ్మారి వ్యాప్తికి మరింత కారణమవుతున్నారు. తాజాగా.. ఐదుగురు పర్యాటకులకు కరోనా అని నిర్థారణ అయినప్పటికీ.. వారంతా కనిపించకుండా పోవడం ఆందోళనకు గురిచేస్తోంది. ఐదుగురు వ్యక్తులు ఢిల్లీ నుంచి పర్యాటక ప్రాంతమైన నైనిటాల్ నగరానికి వచ్చారు. వారికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది.
అయితే.. ఐదుగురు టూరిస్టులు ఢిల్లీలో కోవిడ్ పరీక్షలు చేయించుకొని నైనిటాల్ పర్యటనకు వచ్చారు. వారందరికీ ఒకరోజు తర్వాత కోవిడ్ పాజిటివ్ అని రిపోర్టులో వెల్లడైంది. ఈ లోగా నైనిటాల్ చేరుకున్న కొవిడ్ సోకిన టూరిస్టుల ఆచూకీ లభించకపోవడంతో వైద్యాధికారులు అప్రమత్తమై గాలింపు చర్యలు చేపట్టారు. వారిని గుర్తించాలని కోరుతూ ఢిల్లీ వైద్యాధికారులు.. నైనిటాల్ జిల్లా అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆ యాత్రికుల జాడ కోసం గాలిస్తున్నట్లు నైనటాల్ అధికారులు తెలిపారు. పోలీసులు కూడా రంగంలోకి దిగి గాలిస్తున్నారని నైనిటాల్ బీడీ పాండే హాస్పిటల్ ప్రిన్సిపల్ మెడికల్ సూరింటెండెంట్ డాక్టర్ కేఎస్ ధామి వెల్లడించారు. ఈ విషయం బయటకు తెలియడంతో పర్యాటక ప్రాంతమైన నైనిటాల్‌లో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
Also Read: