యూపీ బాటలో మరో రాష్ట్రం , ‘లవ్ జిహాద్’ కింద మధ్యప్రదేశ్ లో తొలి కేసు నమోదు, బాధితురాలి ఫిర్యాదుపై ట్రక్ డ్రైవర్ అరెస్టు

యూపీ బాటలో మరో రాష్ట్రం కూడా పయనిస్తోంది. లవ్ జిహాద్ కింద మధ్యప్రదేశ్ లో తొలి కేసు నమోదయింది. బార్వానీ జిల్లాలోని పాల్సుద్ గ్రామానికి చెందిన..

  • Umakanth Rao
  • Publish Date - 9:39 am, Tue, 19 January 21
యూపీ బాటలో మరో రాష్ట్రం , 'లవ్ జిహాద్' కింద మధ్యప్రదేశ్ లో తొలి కేసు నమోదు, బాధితురాలి ఫిర్యాదుపై ట్రక్ డ్రైవర్ అరెస్టు

యూపీ బాటలో మరో రాష్ట్రం కూడా పయనిస్తోంది. లవ్ జిహాద్ కింద మధ్యప్రదేశ్ లో తొలి కేసు నమోదయింది. బార్వానీ జిల్లాలోని పాల్సుద్ గ్రామానికి చెందిన ఓ ట్రక్ డ్రైవర్ ను పోలీసులు అరెస్టు చేశారు. 25 ఏళ్ళ ఈ డ్రైవర్ ని రేప్, క్రిమినల్ ఇంటిమిడేషన్ వంటి వివిధ సెక్షన్ల కింద అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఇతడు నాలుగేళ్ల క్రితం తనకు పరిచయమయ్యాడని, తన మతం పేరు చెప్పి తనను పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టి అత్యాచారం చేశాడని బాధితురాలు ఆరోపించింది. అయితే ఇటీవల తనను ఇస్లాం లోకి మారాలని… మతం మార్చుకోవాలని ఒత్తిడి చేశాడని, తాను ప్రతిఘటిస్తే కొట్టాడని ఆమె వాపోయింది. బలవంతపు మత మార్పిడుల నిరోధానికి ఉద్దేశించిన చట్టం ఇటీవలే అమలవుతోంది. మొదట గత ఏడాది అక్టోబరులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఈ ఆర్డినెన్సును తెచ్చింది. తమ రాష్ట్రంలో కూడా ఈ విధమైన చట్టాన్ని తెస్తామని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ ఆ మధ్య ప్రకటించారు. బలవంతంగా మతం మారాలని ఎవరైనా ఒత్తిడి చేస్తే నాశనం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఇలా ఒత్తిడి చేసేవారికి 10 ఏళ్ళ జైలు శిక్ష, 50 వేలవరకు జరిమానా కూడా విధించాలని ఈ చట్టం నిర్దేశిస్తోంది.

అయితే కొందరు మాజీ న్యాయమూర్తులతో బాటు అనేకమంది  ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు. దీని పేరు చెప్పి అమాయకులను కూడా అరెస్టు చేస్తున్నారని వారు అంటున్నారు. ఈ చట్టానికి సవరణలు చేయాలని సూచిస్తున్నారు.