Nirmala Sitharaman: దేశంలో ద్రవ్యోల్పణంపై చర్చ జరుగుతున్న వేళ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారమన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ద్రవ్యోల్పణం కట్టడి కేవలం కేంద్ర ప్రభుత్వం బాధ్యత మాత్రమే కాదని, రాష్ట్రాలూ తమ వంతుగా కృషి చేయాలని సూచించారు. ఢిల్లీలో ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్ (ICRIER) నిర్వహించిన కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ ప్రసంగిస్తూ రాష్ట్రాలు సైతం ద్రవ్యోల్బణం కట్టడిలో కీలక భూమిక పోషిస్తాయని చెప్పారు. కేంద్ర, రాష్ట్రాలు కలిసి పనిచేస్తేనే ధరలు దిగి వస్తాయన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ పై పన్ను తగ్గించినా.. కొన్ని రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గించకపోవడం ఈవిషయాన్ని నిర్మలా సీతారామన్ ఈసదస్సులో ప్రస్తావించారు. చమురుపై కేంద్రప్రభుత్వం రెండుసార్లు పన్ను తగ్గించిందని నిర్మలా సీతారామన్ గుర్తుచేశారు. రాష్ట్రాలు సైతం పన్ను తగ్గించాలని సూచించారు. కొన్ని రాష్ట్రాల్లో ద్రవ్యోల్బణం జాతీయ సగటు కంటే అధికంగా ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. చమురు ఉత్పత్తులపై పన్ను తగ్గించకపోవడం వల్ల ఆయా రాష్ట్రాల్లో ధరలు అధికంగా ఉన్నాయని చెప్పారు. అధిక ధరల నుంచి ప్రజలకు ఊరట కల్పించేందుకు కేంద్రప్రభుత్వం తన వంతుగా చర్యలు తీసుకుంటోందన్నారు.
చౌకగా దొరుకుతున్న రష్యా చమురు కొనుగోలూ ఇందులో భాగమేనని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం కట్టడికి వడ్డీ రేట్లు తగ్గించడం ఒక్కటే సరిపోదని, ఆర్థిక విధానాలకు అనుగుణంగా మరిన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ద్రవ్యపరపతి విధాన నిర్ణయాలొక్కటే ద్రవ్యోల్బణం కట్టడికి సరిపోవని వివిధ దేశాల అనుభవాలు తెలియజేస్తున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఈ ఏడాది ప్రారంభంలో క్రూడాయిల్ ధరలు దాదాపు రికార్డు స్థాయికి చేరుకున్నాయని, అమెరికా నేతృత్వంలోని పాశ్చాత్య దేశాలు రష్యాపై అనేక ఆంక్షలు విధించాయన్నారు. అయినా జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తూ రష్యా నుంచి చమురు దిగుమతులను పెంచాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..