కేవలం 20 రూపాయల కుర్ కురే కోసం ఒక గ్రామంలో ఓ రేంజ్ లో యుద్ధమే జరిగింది. ఈ గొడవల వలన ఎక్కడ తాము పోలీసు గడప ఎక్కాల్సి వస్తుందేమో అనే భయంతో గ్రామంలోని 25 మంది ఊరు విడిచి వెళ్లిపోయారు. ఈ వింత ఘటన దావణగెరెలోని చన్నగిరి తాలూకా హొన్నెబాగి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలోని రెండు కుటుంబాల మధ్య గొడవ జరగగా, ఆ గొడవ దృశ్యం సీసీ కెమెరాలో రికార్డయింది. 10 మందికి పైగా గాయపడి ఆసుపత్రి పాలయ్యారు.
కాగా హొన్నెబాగి గ్రామంలో అతిఫ్ ఉల్లా అనే వ్యక్తి కిరాణా దుకాణం నడుపుతున్నాడు. సద్దాం పిల్లలు ఇదే షాపులో కుర్ కుర్ కొన్నారు. అయితే కుర్ కురే గడువు ముగిసిందని, మరో కుర్ కురే ఇవ్వాలని సద్దాం కుటుంబీకులు డిమాండ్ చేశారు. ఆ తర్వాత మాట మాట పెరిగి ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి.
ఆ మాటల యుద్ధం అక్కడితో ఆగలేదు. మర్నాడు రోడ్డు పక్కన హోటల్ పెట్టుకుని జీవిస్తున్న సద్దాం, అతిఫ్‌పై మరికొంత మందికి ఈ విషయం గురించి చెప్పాడు. దీంతో కోపోద్రిక్తులైన 30 మందికి పైగా వ్యక్తులు సద్దాంపై దాడికి పాల్పడ్డారు. హోటల్‌ను ధ్వంసం చేశారని కూడా సద్దాం చెబుతున్నాడు. తనపై దాడికి పాల్పడ్డవారిపై సద్దాం తిరగబడ్డాడు. చివరికి ఈ కుర్ కురే పంచాయితీ పోలీసు గడపకు చేరుకుంది. చన్నగిరి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే దాడి చేసుకున్న వారిలో సుమారు 25 మంది తమని పోలీసులు ఎక్కడ అరెస్టు చేస్తారో అనే భయంతో గ్రామం విడిచి వెళ్లిపోయారు. ప్రస్తుతం పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చి ఆ ప్రదేశంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరువర్గాల ఫిర్యాదులపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..