Union Minister G.Kishan Reddy: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ధాన్యం కొనుగోలు పంచాయితీ తారాస్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఇంకా వరివార్ కంటిన్యూ అవుతోంది. తాజాగా పారబాయిల్డ్ రైస్ కొనుగోలు విషయంలో తెలంగాణ రైతుల తరుఫున మంత్రి కిషన్ రెడ్డి విజ్ఞప్తికి ఆమోదం తెలిపింది కేంద్రం. రబీ సీజన్‌లో పండించిన ధాన్యం కొనుగోలుకు, కేంద్రం మరోసారి గడువు పొడిగించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆరుసార్లు గడువు పొడిగించినప్పటికీ, మరోసారి సమయం పెంచినట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈనెల 31 వరకు గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే, తాజాగా అదనంగా పార్ బాయిల్డ్ కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇందుకు కేంద్ర మంత్రి పియూష్ గోయల్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు మంత్రి కిషన్‌రెడ్డి.
గడువు పొడిగించాలని గతంలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌కు మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. ఈ లేఖపై స్పందించిన కేంద్రమంత్రి వెంటనే స్పందించారని మంత్రి కిషన్ రెడ్డి ట్విట్టర్ వేదిక వెల్లడించారు. 2020-21 రబీ సీజన్ కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇవ్వవలసిన 2.60 LMT పార్ బాయిల్డ్ రైస్ కు అదనంగా మరో 2.50 LMT పార్ బాయిల్డ్ రైస్ ను తీసుకోమని గత నెల 28 వ తేదీన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు కిషన్ రెడ్డి లేఖ రాశారు. దీనికి స్పందిస్తూ మొత్తంగా 6.05 LMT పార్ బాయిల్డ్ రైస్‌ను తీసుకోమని కేంద్ర మంత్రి సూచించారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ FCI కి సంబంధిత శాఖ నుండి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈమేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా పీయూష్ గోయల్‌కు యావత్ తెలంగాణ రైతుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు.
On 28th April, I made 2 requests to @PiyushGoyal ji for the farmers of Telangana
1. Provide a 7th extension for Rabi KMS 2020-2021 till May 31st due to lack of processing units
2.Accept additional 2.50 LMT of fortified parboiled rice (Total 5.10) pic.twitter.com/uBp2A9ocXK
— G Kishan Reddy (@kishanreddybjp) May 11, 2022
ఇదిలావుంటే, రబీ ధాన్యం కొనుగోలు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం.. గడువు పొడిగిస్తూ ప్రకటన జారీ చేసిని సంగతి తెలిసిందే. అప్పట్లోగా మిల్లింగ్ పూర్తి చేసి సెంట్రల్ పూల్‌కి బియ్యాన్ని అందజేయాలని స్పష్టం చేసింది. మరోసారి గడువు పొడిగించడం కుదరదని తేల్చి చెప్పింది. గడువులోగా అందివ్వలేకపోతే మిగిలిన బియ్యానికీ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించింది. రీసైక్లింగ్ బియ్యాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి, ఎఫ్‌సీఐ సూచించింది. మిల్లుల వారీగా సెంట్రల్ పూల్‌కి అందించాల్సిన బియ్యంపై పర్యవేక్షణ ఉండేలా చర్యలు చేపట్టాలని కేంద్రం కోరింది. రాష్ట్ర ప్రభుత్వం ఆ వివరాలివ్వాలని స్పష్టం చేసింది.
మరోవైపు రాష్ట్రంలో కొన్ని రైస్ మిల్లుల్లో ఉండాల్సిన ధాన్యం లేదని, అవకతవకలు జరిగాయని గతంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. దీంతో తెలంగాణలో కొద్ది రోజులుగా ఎఫ్‌సీఐ అధికారులు రైస్ మిల్లులో తనిఖీలు చేశారు. అయితే, తనిఖీల సమయంలో కొందరు మిల్లులకు తాళాలు వేయడం చర్చనీయాంశమైంది.