
తెలంగాణ జిల్లాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా రైతులు యూరియా కోసం తంటాలు పడే దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ సమస్యకు మూలం ఇక్కడ లేదు. ఎక్కడో స్విచ్ వేస్తే ఇక్కడ బల్బ్ వెలిగినట్టు.. చైనాలో తీసుకున్న నిర్ణయాల ప్రభావంతో కేవలం తెలంగాణ మాత్రమే కాదు.. యావత్ దేశమే యూరియా కొరత సమస్యను ఎదుర్కోవాల్సిన పరిస్థితికి కారణమైంది. అయితే భారత ప్రభుత్వం చైనాతో జరుపుతున్న చర్చలు, సంప్రదింపులు సానుకూలంగా సాగుతున్నాయి. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ – భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో తాజాగా జరిపిన సమావేశంలో రేర్ ఎర్త్ మినరల్స్, ఎరువులు, టన్నెల్ బోరింగ్ మెషీన్‌ల వంటి కీలక అంశాలపై చర్చించారు. చైనా విదేశాంగ మంత్రితో జరిగిన సమావేశంలో దేశ అవసరాలు, ఆందోళనలను జైశంకర్ వివరించారు. ఇరు దేశాలు ఇప్పుడు “కష్టకరమైన సమయం” తర్వాత ముందుకు సాగాలని కోరుకుంటున్నాయని జైశంకర్ అన్నారు. ఆర్థిక సంబంధాలు, సరిహద్దు వాణిజ్యం, కనెక్టివిటీ, నదీ డేటా షేరింగ్ వంటి అనేక అంశాలపై కూడా ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా ఎరువులు, రేర్ ఎర్త్ మినరల్స్ విషయంలో దేశ అవసరాలను పరిష్కరించేందుకు చైనా నుంచి హామీ లభించింది. సోమవారం జైశంకర్‌తో భేటీ అయిన వాంగ్ యీ.. మంగళవారం సాయంత్రం ప్రధాన మంత్రి నరేంద్రమోదీతోనూ సమావేమయ్యారు. ఈ నెలాఖరులో చైనా పర్యటనకు వెళ్లేందుకు ప్రధాని మోదీ సిద్ధమవుతున్న వేళ ఇప్పుడు చోటుచేసుకుంటున్న పరిణామాలు దేశ రైతులతో పాటు ఆటోమొబైల్ పరిశ్రమకు శుభవార్తను అందించేలా కనిపిస్తున్నాయి.
దేశం అన్ని రంగాల్లో స్వయం సమృద్ధి సాధించి విదేశాలపై ఆధారపడాల్సిన పరిస్థితి లేకుండా చేసుకోవాలని ‘‘ఆత్మనిర్భర్ భారత్’’ నినాదాన్ని అందుకుంది. ఈ క్రమంలో కొన్ని రంగాల్లో స్వయం సమృద్ధి సాధించగా.. మరికొన్ని రంగాల్లో ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. అయితే ఇప్పటికీ అధిక మొత్తంలో విదేశాలపై ఆధార పడాల్సిన పరిస్థితులు కొన్ని రంగాల్లో ఉన్నాయి. వాటిలో ముడి చమురు ప్రధానమైనది కాగా.. ఆ జాబితాలో రేర్ ఎర్త్ మినరల్స్, ఎరువులు వంటివి ఉన్నాయి. చమురు దిగుమతుల భారాన్ని తగ్గించుకోడానికి భారత్ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నప్పటికీ.. అందులో ఉపయోగించే సెమీకండక్టర్లు, బ్యాటరీల విషయంలో విదేశాలపై ఆధారపడక తప్పని పరిస్థితి ఉంది. సెమీకండక్టర్ల తయారీ కోసం భారత్‌లో నలుదిక్కులా కొత్త యూనిట్లను ఏర్పాటు చేయడానికి కేంద్రమంత్రివర్గం ఈ మధ్యనే నిర్ణయాలు తీసుకుంది. ఇది తక్షణావసరాలను తీర్చకపోయినా.. భవిష్యత్తు అవసరాలను తీర్చగలదని ప్రభుత్వం విశ్వసిస్తోంది. ఇదిలా ఉంటే.. బ్యాటరీల విషయంలో కీలకమైన అంశం లిథియం అనే అరుదైన ఖనిజం. ఇది ప్రపంచంలో చాలా కొద్ది ప్రదేశాల్లో మాత్రమే లభ్యమవుతుండగా.. దాన్ని వెలికితీయడం కూడా క్లిష్టమైన ప్రక్రియ. ఈ విషయంలో చైనా గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. దీంతో ఎలక్ట్రిక్ వెహికిల్స్ తయారీకి అవసరమయ్యే బ్యాటరీల కోసం చైనాపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీన్ని నివారించేందుకు ఈ మధ్యనే కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన భారత్ – అర్జెంటీనా మధ్య ఒప్పందాలు జరిగాయి. ఇవి కార్యరూపం దాల్చి ఫలితాలు అందించే వరకు భారత్ అవసరాలు తీర్చడం సవాలుగా మారింది.
ఇదిలా ఉంటే ఆహార పదార్థాల ఉత్పత్తిలో.. ముఖ్యంగా వరి, గోధుమల ఉత్పత్తిలో ప్రపంచంలోనే ప్రపంచంలోనే 2వ స్థానంలో నిలిచిన భారత్.. యూరియా రూపంలో సవాలును ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎందుకంటే యూరియా సహా వివిధ రకాల ఎరువుల విషయంలో భారత్ పూర్తిగా స్వయం సమృద్ధి సాధించలేదు. పెద్ద మొత్తంలో దిగుమతులపై, కొద్దిమొత్తంలో స్థానిక తయారీపై ఆధారపడి భారత వ్యవసాయ రంగం ముందుకు నడుస్తోంది. రామగుండంలో ఎరువుల కర్మాగారాన్ని పునఃప్రారంభించడం సహా నానో యూరియాను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చినప్పటికీ.. ఇప్పటికిప్పుడు భారత్ అవసరాలు తీరడం లేదు. అందుకే ఎరువుల విషయంలోనూ దిగుమతులపైనే ఆధారపడక తప్పడం లేదు.
గత ఏడాది కాలంగా చైనా నుంచి ఈ వస్తువుల దిగుమతులు ప్రభావితమయ్యాయి. భారత రైతులు విస్తృతంగా ఉపయోగించే యూరియా వంటి ఎరువుల దిగుమతిలో చైనాయే అతి పెద్ద సరఫరదారుగా ఉంది. జూన్ 2024లో చైనా యూరియా ఎగుమతులను ప్రపంచవ్యాప్తంగా పరిమితం చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో ఇతర దేశాలకు యూరియా ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేసినప్పటికీ, భారత్‌పై ఈ నిషేధం కొనసాగింది. గత వారం మొదటిసారిగా బీజింగ్ భారత్‌కు యూరియా ఎగుమతి నిషేధాన్ని ఎత్తివేసినట్లు నివేదించింది.
2023-2024 ఆర్థిక సంవత్సరంలో భారత్ చైనా నుంచి సుమారు 774 మిలియన్ డాలర్ల విలువైన యూరియాను దిగుమతి చేసింది. అయితే 2024-2025 ఆర్థిక సంవత్సరంలో చైనా ఎగుమతి పరిమితుల కారణంగా ఈ దిగుమతులు 42.8 మిలియన్ డాలర్లకు పడిపోయాయి. అదేవిధంగా గత కొన్ని నెలలుగా చైనా-యూఎస్ వాణిజ్య యుద్ధం తీవ్రతరం కావడంతో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఎగుమతులపై కూడా చైనా వైఖరి మార్చుకుంది. ఫలితంగా చైనా నుంచి భారత్‌కు జరుగుతున్న రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ (REE) దిగుమతులను తీవ్రంగా ప్రభావితం చేసింది. సౌర, పవన విద్యుత్తు వంటి గ్రీన్ ఎనర్జీతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల వంటి గ్రీన్ టెక్నాలజీలకు ఈ రేర్ ఎర్త్ మినరల్స్ చాలా కీలకమైనవి.
వాంగ్ యీ మూడు రోజుల భారత్ పర్యటన కోసం ఆగస్టు 18న ఇక్కడకు వచ్చారు. ఆయన సోమవారం భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో సమావేశమై అనేకాంశాలు చర్చించారు. మంగళవారం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో సరిహద్దు సమస్యపై చర్చించారు. ఆ తర్వాత సాయంత్రం ప్రధాని మోదీతోనూ సమావేశమయ్యారు. వాంగ్ యీ బుధవారం పాకిస్తాన్‌కు వెళ్తారు. అయితే భారత్ – అమెరికా దేశాల మధ్య సంబంధాలు క్లిష్టతరంగా మారిన సమయంలో వాంగ్ యీ భారత పర్యటన ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రష్యా నుంచి భారతదేశం చమురు కొనుగోళ్లను కొనసాగించడంపై యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసహనంతో ఉన్నారు. భారత్ కొనుగోళ్ల కారణంగా రష్యా యుద్ధానికి అవసరమైన నిధులను సమకూర్చుకుంటోందని విమర్శించారు. ఈ నెల ప్రారంభంలో ట్రంప్ భారత్‌పై 50 శాతం వరకు సుంకాలను విధించారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ – చైనా మధ్య ఉద్రిక్తతలు సడలి సత్సంబంధాలు మెరుగుపడడం అనివార్యంగా మారింది.
ప్రధాని మోదీ ఈ నెలాఖరులో షాంఘై సహకార సంస్థ హెడ్స్ ఆఫ్ స్టేట్ సమ్మిట్‌కు హాజరుకానున్నారు. 2018 తర్వాత మోదీ తొలిసారిగా చైనాను సందర్శించనున్నారు. ప్రస్తుతం జరుగుతున్న వాంగ్ యీ భారత పర్యటన.. మోదీ చైనా పర్యటన ఎజెండాను ఖరారు చేసే అవకాశం ఉంది.
2020లో గల్వాన్ సైనిక ఘర్షణల తర్వాత న్యూఢిల్లీ మరియు బీజింగ్ మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ తర్వాత 2024లో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, రెండు దేశాలు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (LAC) వెంబడి ఘర్షణ పాయింట్ల వద్ద డిస్‌ఎంగేజ్‌మెంట్ కోసం ఒప్పందానికి చేరుకున్నాయని ప్రకటించారు. రెండు రోజుల తర్వాత రష్యాలోని కజాన్‌లో జరిగిన బ్రిక్స్ సమ్మిట్ లో ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను కలిశారు. ఇది చైనాతో ద్వైపాక్షిక విధానాలను పునఃప్రారంభించడానికి మార్గం సుగమం చేసింది. మొత్తంగా “భారత్ – చీనీ భాయి భాయి నినాదం మళ్లీ తెరపైకి వచ్చినట్టయింది. ఇందులో భాగంగా రెండు దేశాల మధ్య నెలకొన్న పరస్పర అపనమ్మకాలను తొలగించే చర్యలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా ఈ వేసవిలో కైలాస్ మానసరోవర్ యాత్ర పునఃప్రారంభంతో పాటు జూలై 24 నుండి చైనా పౌరులకు టూరిస్ట్ వీసాల జారీ వంటి చర్యలు ముఖ్యంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, ఎరువుల సరఫరా విషయంలో పరిమితులు, ఎగుమతులపై ఆంక్షలను చైనా పూర్తిగా సడలిస్తే భారతదేశ అవసరాలు తీరి ఇటు వ్యవసాయ రంగం, అటు ఈ-వాహన రంగం గట్టెక్కుతాయి. మొత్తమ్మీద త్వరలో ప్రధాని చేపట్టబోయే చైనా పర్యటన కేవలం భారతదేశంలోనే కాదు, యావత్ ప్రపంచంలోనే ఒక కొత్త అధ్యాయానికి మొదటిమెట్టుగా మారనుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..