వివాదాస్పదమైన మూడు రైతు చట్టాలను కేంద్రం రద్దు చేయాలన్న డిమాండుతో ఆందోళన చేస్తున్న అన్నదాతలు జూన్ 26 న దేశ వ్యాప్తంగా అన్ని రాజ్ భవన్ లను ఘెరావ్ చేయాలని నిర్ణయించారు. 42 రైతు సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంయక్త కిసాన్ మోర్చా ఈ విషయాన్ని ప్రకటిస్తూ ఆ రోజుతో తమ ఆందోళన ప్రారంభించి 7 నెలలు పూర్తి అవుతుందని తెలిపింది. అన్ని రాష్ట్రాలలోని గవర్నర్ బంగళాల వద్ద ఆ రోజున రైతులు నల్లజెండాలతో నిరసన ప్రదర్శన చేస్తారని మోర్చా నేత ఇందర్జిత్ సింగ్ వెల్లడించారు. అదే రోజును తాము ఖేత్ బచావో…లోక్ తంత్ర్ బచావో (వ్యవసాయాన్ని రక్షించండి.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి) నినాద దినంగా పాటిస్తామన్నారు. ప్రతి రాష్ట్ర గవర్నర్ ద్వారా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కి తమ సంస్థ మెమొరాండం పంపుతుందన్నారు, 1975 జూన్ 26 న దేశంలో నాటి ప్రభుత్వం ఎమర్జెన్సీని ప్రకటించిందని, నాడు ఇదే రోజున ప్రజల ప్రజాస్వామిక హక్కులను ప్రభుత్వం కాలరాచిందని ఆయన విమర్శించారు. ఇప్పుడు మాత్రం ఇది అప్రకటిత ఎమర్జెన్సీ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నెల 26 న లక్షలాది రైతులు ఈ రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. తమ నిరసనను మరో మూడేళ్లు కొనసాగిస్తామని రైతు సంఘం నేత రాకేష్ తికాయత్ ప్రకటించిన విషయం గమనార్హం.
పంజాబ్, హర్యానా, యూపీ, బీహార్ రాష్ట్రాలకు చెందిన వేలాది రైతులు ఇప్పటికీ ఢిల్లీ శివార్లలోని బోర్డర్లలో ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ నెల 26 నుంచి తమ ప్రొటెస్ట్ ను ఉధృతం చేయాలని కూడా సంయుక్త కిసాన్ మోర్చా నిర్ణయించింది. కేంద్రం ఇటీవల ప్రకటించిన కనీస మద్దతు ధర పెంపును ఇందర్జిత్ సింగ్ కొట్టి పారేశారు. తాము ప్రధానంగా మూడు చట్టాల రద్దును కోరుతున్నామన్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Tamil Nadu : లోదుస్తుల్లో 45 మద్యం బాటిళ్లు తరలిస్తూ పట్టుబడ్డ హిజ్రాలు..చూసి షాక్ అయినా పోలీసులు .
Flash Point : కరోనా వైరస్ కి బ్లాక్ ఫంగస్ కి లింకేంటి? విస్తుపోయే నిజాలు వెల్లడించిన టీవీ9.