దేశవ్యాప్తంగా తాము గురువారం ‘రైల్ రోకో’ ఆందోళన నిర్వహిస్తామని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయత్ ప్రకటించారు. రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటలవరకు ఈ ఆందోళన జరుగుతుందన్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న తమ ఆందోళనను వివిధ రూపాలుగా కొనసాగిస్తామని ఆయన చెప్పారు. కేంద్రం అనేక ఆంక్షలను తొలగించిందని, కానీ గత 8 నెలలుగా పలు రైలు సర్వీసులను మాత్రం అనుమతించడం లేదని ఆయన ఆరోపించారు. కేంద్రం నిర్ణయం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ రైల్ రోకో ఆందోళనలో తమతమ గ్రామాలనుంచి అనేకమంది అన్నదాతలు పాల్గొంటారని తికాయత్ చెప్పారు. తమ అనుబంధ సంయుక్త కిసాన్ మోర్చా ఈ నిరసనకు పిలుపునిచ్చిందన్నారు.
రైతు సంఘాల పిలుపు నేపథ్యంలో రైల్వే శాఖ దేశవ్యాప్తంగా 20 కంపెనీల అదనపు రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ బలగాలను నియమిస్తోంది. . ముఖ్యంగా పంజాబ్, హర్యానా, బెంగాల్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలపై తాము ఫోకస్ పెట్టినట్టు ఈ శాఖ డైరెక్టర్ జనరల్ అరుణ్ కుమార్ తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బంది కలిగించవద్దని, ఈ ఆందోళన శాంతియుతంగా సాగాలని తాము కోరుతున్నామని ఆయన చెప్పారు. ఇలా ఉండగా తికాయత్ తమ మహా పంచాయత్ ల నిర్వహణకు సన్నద్ధమవుతున్నారు. సుమారు పది రోజులపాటు ఆయన మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల్లో పర్యటించి అన్నదాతలను సమీకరించేందుకు ఉద్యుక్తులవుతున్నారు. రైతు చట్టాలపై దేశ వ్యాప్తంగా అన్నదాతలను చైతన్య పరచడమే తమ ఉద్దేశమని ఆయన చెప్పారు.
మరిన్ని చదవండి ఇక్కడ :
నటుడు సందీప్ నహర్ సూసైడ్ కేసులో భార్య కాంచన్ శర్మపై ఎఫ్ ఐ ఆర్, ముంబై పోలీసుల దర్యాప్తు ముమ్మరం
మాజీ కేంద్ర మంత్రి ఎం.జె.అక్బర్ కేసులో జర్నలిస్ట్ ప్రియా రమణి నిర్దోషి, ఢిల్లీ కోర్టు తీర్పు