ముంబైలో గత వారం పలు చోట్ల ఫేక్ వ్యాక్సినేషన్ క్యాంపులను నిర్వహించారని, సుమారు 2 వేలమంది (బూటకపు) వ్యాక్సిన్లు తీసుకున్నారని మహారాష్ట్ర ప్రభుత్వం బాంబేహైకోర్టుకు తెలిపింది. వీటిని నిర్వహించిన ఫ్రాడ్ స్టర్ల కోసం పోలీసులు గాలిస్తున్నట్టు వెల్లడించింది. మలాద్, కాందీవలి, బొరీవలి తదితర ప్రాంతాల్లో బూటకపు వ్యాక్సినేషన్ క్యాంపులను ఏర్పాటు చేశారని పేర్కొంది. దీనిపై కోర్టు ఆందోళన వ్యక్తం చేస్తూ దీనివల్ల ఈ టీకామందులు తీసుకున్నవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందని ప్రశ్నించింది. దీనిపై ఇన్వెస్టిగేషన్ కూడా చేయాలనీ ప్రభుత్వంతో బాటు ముంబై మున్సిపల్ కార్పొట్రేషన్ కి కూడా సూచించింది. ఈ నెల 29 న తదుపరి విచారణ జరగాలని నిర్ణయించింది. ప్రజలకు ఇచ్చిన వ్యాక్సిన్లు అసలు మందులా లేక కాలం చెల్లినవా అన్న విషయం కూడా తేలాల్సి ఉంది.
రెండు వేలమంది వ్యక్తులను ఎలా గుర్తు పట్టి వారిని ఎలా వాకబు చేయాలో అధికారులకు తోచడంలేదు. అయితే ఇన్వెస్టిగేషన్ స్టేటస్ రిపోర్టును ఫైల్ చేశామని, 400 మంది సాక్షుల స్టేట్ మెంట్లను రికార్డు చేశామని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు ఆరుగురిని అరెస్టు చేశామని .. మరి కొంతమంది హస్తం కూడా ఇందులో ఉండవచ్చునని భావిస్తున్నామని వారు పేర్కొన్నారు. ఈక్యాంపుల్లో వ్యాక్సిన్ తీసుకున్నవారిలో ఇంతవరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని తెలిసింది. ఏమైనా ఇది పెద్ద వ్యాక్సినేషన్ స్కామ్ అని భావిస్తున్నారు. కోల్ కతా లో కూడా ఇలాంటి ఫేక్ వ్యాక్సినేషన్ క్యాంపులో సుమారు 250 మంది టీకామందులు తీసుకున్నారు. ఒక నటి , తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ ఫ్రాడ్ వెలుగులోకి వచ్చింది. తమ ఆధార్ నెంబర్లు గానీ, చిరునామాలు గానీ నిర్వాహకులు అడగలేదని ఆమె తెలిపింది. ఈ ఫేక్ వ్యాక్సినేషన్ వ్యవహారంలో ..తనను ఐ ఏ ఎస్ అధికారిగా చెప్పుకున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Saranga Dariya: నెమలి లాంటి నాట్యానికి, కోయిల లాంటి గాత్రానికి ఎన్నో రికార్డులు… ( వీడియో )