Children Eyes Removed: దేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఈ తరుణంలో బ్లాక్ ఫంగస్ అలజడి సృష్టిస్తోంది. తాజాగా బ్లాక్ ఫంగస్ సోకిన ముగ్గురు పిల్లల కళ్లను వైద్యులు శస్త్రచికిత్స ద్వారా తొలగించారు. ఈ విషాద సంఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరిగింది. ఇటీవల కరోనా బారిన పడి కోలుకున్న 4, 6, 14 ఏళ్ల వయసున్న ముగ్గురు పిల్లలకు ముకోర్మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) వ్యాధి సోకింది. దీంతో ముంబైకి చెందిన కేబీహచ్ బచూలి ఆప్తాల్మిక్ ఈఎన్టీ హాస్పిటల్‌లో 4, 6 ఏళ్ల పిల్లలకు, మరో ఆసుపత్రిలో 14 ఏళ్ల బాలికకు ఆపరేషన్ నిర్వహించి బ్లాక్ ఫంగస్ సోకిన ఒక్కో కనుగుడ్డును తొలగించినట్లు వైద్యులు ప్రకటించారు.
అయితే.. పిల్లలకు బ్లాక్ ఫంగస్ సోకడం ఆందోళన కలిగిస్తోందని వైద్యులు పేర్కొన్నారు. కరోనా నుంచి కోలుకున్న 4, 6 ఏల్ల వారికి మధుమేహం వ్యాధి లేదని, 14 ఏండ్ల బాలికతోపాటు కరోనా నుంచి కోలుకున్న మరో 16 ఏళ్ల బాలికకు మధుమేహం వచ్చిందని వైద్యలు తెలిపారు. డయాబెటిస్, ఇతర అనారోగ్య సమస్యలున్న కరోనా సోకిన రోగులను బ్లాక్ ఫంగస్ లక్ష్యంగా చేసుకుంటోందని పేర్కొన్నారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా ఇది ప్రమాదకరంగా మారుతుందని.. వైద్యులు ప్రకటించారు.
అయితే.. కనుగుడ్డులను తొలగించకపోతే.. వారి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడేదని వైద్యలు ప్రకటించారు. వారాల పాటు బ్లాక్ ఫంగస్ సోకిన పిల్లలకు చికిత్స అందించినప్పటికీ.. ఓ బాలికకు దురదృష్టవశాత్తు కనుగుడ్డులను తొలగించాల్సి వచ్చిందని ఫోర్టిస్ ఆసుపత్రిలో సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ డాక్టర్ జెసల్ షెత్ పేర్కొన్నారు.
Also Read: