Nitin Gadkari: ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి. దీంతో వాహనదారులకు మరింత భారం మారుతోంది. ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో పలు వాహనాల తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను (Electric Vehicles) అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. దీంతో వాహనదారులు కూడా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక చమురు ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం (Central Government) ప్రజలకు మేలు కల్పించే నిర్ణయం తీసుకోబోతోంది. కాలుష్యానికి కారణమవుతున్న పెట్రోల్, డీజిల్ వాహనాలను తగ్గించి కేవలం ఎలక్ట్రిక్ వాహనాలనే నడపాలని భావిస్తోంది. ఇందుకోసం ఓ భారీ ప్రణాళిక సైతం రచించింది. ఇప్పటికే చాలా మంది పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటంతో ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. ముందుగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు అందుబాటులోకి రాగా, కార్లు కూడా వచ్చేస్తున్నాయి. ఇక రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాలు ధరలు తగ్గనున్నాయని కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీ తెలిపారు. అలాగే ఛార్జింగ్ స్టేషన్లు కూడా అధిక మొత్తంలో ఏర్పాటు అయ్యేందుకు అనుమతులు కూడా మంజూరు చేసినట్లు తెలిపారు. వచ్చే రెండేళ్లలో పెట్రోల్, డీజిల్ వాహనాలకు సమానంగా ఎలక్ట్రిక్ వాహనాల ధరలు ఉంటాయని పేర్కొన్నారు.
అయితే ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు పెద్దగా లేవు. ధరల విషయంలో పలు డిస్కౌంట్లు, ఆఫర్లు చేస్తోంది ప్రభుత్వం. భారత్‌లో భారీ మొత్తంలో ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకువచ్చేందుకు అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు దిగి వస్తాయని మంత్రి తెలిపారు.
ఏపీ, తెలంగాణలో ఛార్జింగ్ స్టేషన్లు:
ఇక ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి వస్తుండటంతో ఛార్జింగ్ స్టేషన్లు కూడా భారీగా ఏర్పాటు కానున్నాయి. ఫేమ్ ఇండియా స్కీమ్ ఫేస్ 2 కింద 16 జాతీయ రహదారులు, 9 ఎక్స్‌ప్రెస్‌వేలపై 1576 ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్‌లను మంజూరు చేసింది కేంద్ర మంత్రిత్వశాఖ. జాతీయ రహదారుల వెంట ఇరు వైపులా ప్రతి 25 కిలోమీటర్ల దూరంలో ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు కానుంది. అలాగే హేవీ డ్యూటీ వెహికిల్స్ కోసం జాతీయ రహదారులపై ప్రతి 100 కి.మీలకు ఇరు ఒక ఛార్జింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తోంది. వీటిలో 266 ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏపీలోని రహదారులపై, తెలంగాణలో 138 స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్టు భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇందులో భాగంగా 25 రాష్ట్రాలలో, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 68 నగరాలలో 2,877 ఛార్జింగ్ స్టేషన్‌లు మంజూరు చేసింది.
ఇవి కూడా చదవండి: