ఎంటర్‌టైన్‌మెంట్ తీరు మారుతోంది. సినిమాలు, క్రికెట్ మాత్రమే కాదు.. ఎన్నికల ఫలితాలను కూడా బిగ్ స్క్రీన్‌పై చూసే రోజులు వచ్చేశాయి. జూన్ 4న ఇందుకోసం పలు ధియేటర్లు రెడీ అవుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడబోయే జూన్ 4న కోసం అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఆ రోజు ఫలితాల సరళిని తెలుసుకునేందుకు అంతా టీవీలు, మొబైల్స్‌కు అతుక్కుపోతుంటారు. అయితే ఎన్నికల ఫలితాలు బిగ్ స్క్రీన్‌లో.. అందులోనూ సినిమా ధియేటర్లలో ప్రదర్శిస్తే ఎలా ఉంటుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజంగా జరగబోతోంది. సినిమాలు ప్రదర్శించే వెండితెరపై ఎన్నికల ఫలితాల లైవ్ టెలికాస్ట్ జరగనుంది. మహారాష్ట్రలోని పలు ప్రధాన నగరాల్లోని ధియేటర్లు ఇందుకు వేదిక కాబోతున్నాయి.
ముంబైలోని ఎస్‌ఎం5 కల్యాణ్, సియాన్, కంజూర్‌మార్గ్‌లోని మూవీమ్యాక్స్ థియేటర్లు, ఠాణెలోని ఎటర్నిటీ మాల్, వండర్ మాల్, నాగ్‌పుర్‌లోని మూవీమ్యాక్స్ ఎటర్నిటీ, పుణెలోని మూవీమ్యాక్స్ తదితర థియేటర్లు జూన్ 4న ఎన్నికల ఫలితాలను లైవ్ టెలికాస్ట్ చేయనున్నట్టు తెలుస్తోంది. దీని కోసం ఇప్పటికే పేటీఎం వంటి వేదికల్లో బుకింగ్స్‌ను ప్రారంభించారని సమాచారం. ఆ రోజు ఆరు గంటల పాటు ఫలితాలను థియేటర్లలో లైవ్ స్ట్రీమ్ చేయనున్నారని తెలుస్తోంది. ఇందుకోసం టికెట్ ధరలు కూడా ఖరారయ్యాయి. రూ.99 రూపాయలు మొదలుకొని రూ.300 వరకు టికెట్ రేట్లను ఫిక్స్ చేశారు.
దీనికి ఆడియెన్స్ నుంచి రెస్పాన్స్ కూడా బాగానే వచ్చింది. ఇప్పటికే కొన్ని థియేటర్లలో ఫలితాల ప్రదర్శనకు హౌస్‌ఫుల్ అయినట్లు తెలుస్తోంది. టికెట్ బుకింగ్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్లను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి. మరోవైపు దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ఇది కొత్త రకమైన ఎంటర్‌టైన్‌మెంట్ అని కొందరు కామెంట్ చేస్తే.. సినిమాల్లో మంచి కంటెంట్ లేకపోవడంతో ఇలాంటి వాటిని లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారని మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. అయితే ధియేటర్లలో ఫలితాల లైవ్ టెలికాస్ట్ నిర్ణయం రిస్క్‌తో కూడుకున్నదని.. తాము కోరుకున్న వ్యక్తులు, పార్టీలు గెలవని పక్షంలో పలువురు విధ్వంసం సృష్టించే అవకాశం ఉంటుందని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు. దేశ వ్యాప్తంగా జరిగిన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు ఇంకా మూడు రోజులు సమయం ఉంది. ఈ నేపథ్యంలో ఇలాంటి సరికొత్త ట్రెండ్ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా వస్తుందా.. లేక మహారాష్ట్రకు మాత్రమే పరిమితం అవుతుందా అనేది వేచి చూడాలి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.