General Election 2024: నేడే విడుదల.. లోక్‌సభతోపాటే ఏపీ ఎన్నికలు.. అప్పటికల్లా పోలింగ్!

General Election 2024 Notification: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఇవాళ విడుదల కానుంది. కేంద్ర ఎన్నికల సంఘం శనివారం ఎన్నికల తేదీలను ప్రకటించనుంది. ఈ మేరకు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో.. లోక్‌సభ ఎన్నికలు, కొన్ని రాష్ట్రాల శాసనసభ ఎన్నికల తేదీలను ప్రకటించనున్నట్లు ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ శుక్రవారం వెల్లడించింది.

General Election 2024: నేడే విడుదల.. లోక్‌సభతోపాటే ఏపీ ఎన్నికలు.. అప్పటికల్లా పోలింగ్!
General Election 2024

Updated on: Mar 16, 2024 | 10:50 AM

General Election 2024 Notification: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఇవాళ విడుదల కానుంది. కేంద్ర ఎన్నికల సంఘం శనివారం ఎన్నికల తేదీలను ప్రకటించనుంది. ఈ మేరకు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో.. లోక్‌సభ ఎన్నికలు, కొన్ని రాష్ట్రాల శాసనసభ ఎన్నికల తేదీలను ప్రకటించనున్నట్లు ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ శుక్రవారం వెల్లడించింది. లోక్‌సభ ఎన్నికలతోపాటు ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం శాసనసభల ఎన్నికల తేదీలను కూడా ప్రకటించనుంది. వీటితోపాటు జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలపై కూడా  స్పష్టత రానుంది. కాగా.. ప్రస్తుత లోక్‌సభ గడువు జూన్‌ 16తో ముగియనుంది. అప్పటిలోగా కొత్త సభ ఏర్పాటు కావాల్సి ఉంది. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీలకు కూడా ఈ ఏడాది మే లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. దీనిలో భాగంగా.. ఎన్నికల సంఘం.. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పర్యటించింది. జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలు, క్షేత్రస్థాయిలో అధికారులతో విస్తృత సమావేశాలు జరిపి షెడ్యూల్‌ను సిద్ధం చేసింది.

లోక్ సభ.. పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కాగానే.. దేశవ్యాప్తంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వస్తుంది. ఈ ప్రవర్తనా నియమావళి దేశమంతటా అమల్లో ఉండనుంది. దేశంలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కఠిన నిబంధనలను అమలు చేయనుంది. కాగా.. గత లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌.. 2019 మార్చి 10వ తేదీన విడుదలైంది. ఏప్రిల్‌ 11 నుంచి ప్రారంభమైన పోలింగ్‌, మే 19 వరకు ఏడు విడతల్లో జరగగా.. 2019 మే 23న ఓట్ల లెక్కింపు జరిగింది. ఈసారి (2024 ఎన్నికలు) కూడా ఏప్రిల్‌-మే నెలల్లోనే సార్వత్రిక ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.

ఇదిలాఉంటే.. ఇప్పటికే దేశమంతటా.. సార్వత్రిక ఎన్నికల ఫీవర్ వచ్చేసింది.. పలు ప్రధాన పార్టీలన్నీ వ్యూహాలతో ముందుకువెళ్తున్నాయి. బీజేపీ మూడో సారి అధికారన్ని చేజిక్కించుకునేందుకు సన్నాహాలను ప్రారంభించగా.. ఎలాగైనా సత్తా చాటాలని కాంగ్రెస్, పలు విపక్ష పార్టీలు వ్యూహాలను రచిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ రెండు విడతలుగా లోక్ సభ ఎన్నికల కోసం అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ కూడా రెండో విడత అభ్యర్థులను ప్రకటించింది. అంతేకాకుండా.. పలు ప్రాంతీయ పార్టీలు కూడా అభ్యర్థులను ప్రకటించి.. ఎన్నికల కదనరంగంలోకి దూకాయి.. ఈ నేపథ్యంలో ఇవాళ నోటిఫికేషన్ వెలువడటమే ఆలస్యం.. పార్టీలన్నీ ఎన్నికల సంగ్రామంలో మరింత జోష్ తో ముందుకు సాగనున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..