యావత్ దేశంలో రిపబ్లిక్ డే వేడుకలకు సిద్ధమవుతోంది. ఇక రిపబ్లిక్ డే అనగానే మొదటగా గుర్తొచ్చేది దేశ రాజధాని ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే పరేడ్. ఈ వేడుకను చూడడానికి ఎంతో మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఎప్పటిలాగే రిపబ్లిక్ డే పరేడ్‌కు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.
దేశ రాజధానిలోని కర్తవ్య మార్గ్ తో పాటు పరిసర ప్రాంతాల్లో దాదాపు 14,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ఈ ఏడాది కవాతును వీక్షించేందుకు 77,000 మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే పరేడ్‌లో పాల్గొనేందుకు ఇప్పటికే పలు విభాగాలకు చెందిన సైనికులు కవాతులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా భారత నావికా దళానికి చెందిన సైనికులు చేపట్టిన రిహార్సల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గామారింది.
రిహార్సల్‌లో భాగంగా భారత నావికాదళ బృందం సగీత వాయిద్యాలతో ‘నాటు నాటు’ పాటను ఆలపించాయి. అంతేకాకుండా సంగీతానికి అనుగుణంగా కవాతును చేపట్టారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నాటు నాటు పాట దేశవ్యాప్తంగా ఎలాంటి సంచలనం సృష్టించిందో చెప్పేందుకు ఇది మరో ఉదాహరణగా నిలిచింది. ట్రిపులార్ సినిమాలోని ఈ పాటకు ఏకంగా ఆస్కార్ అవార్డ్ వచ్చిన విషయం తెలిసిందే.
Indian Navy marching contingent early Morning warm Up in #Natu #Natu Style at #Kartavyapath for #RepublicDay2024 Parade. Super music played by #IndianNavy Band. #RRRMovie #NatuNatu @tarak9999 @ssrajamouli @AlwaysRamCharan @aliaa08 @ajaydevgn @indiannavy pic.twitter.com/TCtBAVDBzN
— Manish Prasad (@manishindiatv) January 24, 2024
ఇదిలా ఉంటే సారి గణతంత్ర దినోత్సవానికి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. రిపబ్లిక్ డే వేడుకలకు ఫ్రాన్స్ నాయకులు ముఖ్యఅతిథిగా రావడం ఇది 6వ సారి కావడం విశేషం. దీంతో ఎలాంటి అవాంఛిత సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. వివిధ రాష్ట్రాల మధ్య పరస్పర సహకారంతో సరిహద్దు ప్రాంతాల్లో శాంతిభద్రతలను సమీక్షిస్తున్నారు. అలాగే.. ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలపై నిఘా పెంచారు. గురువారం రాత్రి 10 గంటల నుంచి.. ఢిల్లీ సరిహద్దులను మూసివేస్తామని, భారీ వాహనాల ప్రవేశంపై ఆంక్షలు విధిస్తామని అధికారులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..