
తమిళనాడులోని కడలూరులో కుల వివక్ష..ఓ గ్రామ పంచాయతీ అధ్యక్షురాలిని కింద ‘నేలపై కూర్చోబెట్టింది’. నిజానికి గ్రామ సమస్యలపై చర్చించేందుకు ఉద్దేశించిన ఓ సమావేశానికి ఆమె అధ్యక్ష హోదాలో అధ్యక్షత వహించాల్సి ఉంది. కానీ ఎస్సీ వర్గానికి చెందిన ఆమెను అగ్ర వర్ణాలవారు నేలపై కూర్చోబెట్టారు. ‘తెర్కు తిట్టాయ్’ గ్రామ పంచాయితీకి ఆమె గత ఏడాది ప్రెసిడెంటుగా ఎన్నికైంది. ఇది రిజర్వ్డ్ స్థానం.. కానీ కులం తక్కువదానినని తనను చిన్న చూపు చూస్తున్నారని, గ్రామ అభివృద్దికి సంబంధించిన ఏ కార్యక్రమాల్లోనూ తనను పాల్గొననివ్వడంలేదని ఆమె వాపోయింది. అగ్రవర్ణాలకు నేను ఎంతగానో సహకరిస్తున్నా..కానీ నన్ను దూరం పెడుతున్నారు అని ఆది ద్రవిడ కులానికి చెందిన ఆమె తెలిపింది. తాజా ఘటన గురించి పై అధికారులకు ఈ విషయం తెలిసి గ్రామ కార్యదర్శిని సస్పెండ్ చేసి దీనిపై విచారణకు ఆదేశించారు. ఇతర మహిళలంతా కుర్చీల్లో కూర్చుంటే ఈ గ్రామ పంచాయతీ అధ్యక్షురాలు మాత్రం దూరంగా కింద కూర్చున్న ఫోటో వైరల్ అవుతోంది.